పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ సంభాషణ అంతా వింటూవున్న ఇంకో ఉపాధ్యాయిని వీరిద్దరి దగ్గరకూ వచ్చి కూచుంటూ, “ఒక మహా భావాన్ని ఎంత ముక్కలు చేశావమ్మా మాలతీ?” అని అన్నది.

“ముక్కలు చేయడమేమిటి ఇందిరగారూ? భావం ముక్కలు అవడమేమిటి?”

“అవును, భావం ముక్కలవడమేమిటి? భావం రబ్బరు ముక్కలు కాదులే! గాజు సామాను ముక్కలౌతుంది. ఎంత శాస్త్రజ్ఞురాలివి. కలలు విచ్ఛిన్నం కావూ? ఆశయాలు భగ్నం కావూ? ఆశలు ముక్కలు కావూ? ఆ విధంగానే భావాలు ముక్కలవుతాయి.”

మాలతి: నువ్వు కవయిత్రివి. కథలు రాస్తావు. మధురమైన కంఠంతో పాటలు పాడుతావు. వీణతీగలు మీటి మంత్రాలు పన్నీరు జల్లుతావు.

పద్మావతి: మాటలతో కవిత్వం ప్రదర్శిస్తున్నారే టీచరుగారు!

ఇందిర : అలాంటిది ఆ అమ్మాయి భావం ముక్కలవడమంటుందేమిటి పద్మా!

పద్మా: ఏం భావం ముక్కలయింది ఇందిరక్కగారూ!

ఇందిర: ఈ విచిత్ర సన్నివేశము అనేక శతాబ్దాలనుండీ జరుగుతూ ఉన్నదని, చరిత్రలు చెప్పుతూన్నవి. ఈ పూజారి పూర్వీకులు ఈ పూజారివలెనే పక్షులను పిలిచారు. పక్షుల పూర్వీకులు యీ పక్షులవలెనే సరిగా వేళకు యింత అందంగానూ వచ్చి తమ కర్పించిన ప్రసాదము ఆరగించి, రివ్వున నీలాల లోతులోనికి ఎగిరిపోయి తెల్లని మేఘాలలో కలిసిపోతున్నాయి.

మాలతి: ఎంత తియ్యగా చెప్పుతున్నావు అక్కా! కోతులను తయారుచేసి మన యింటికి వచ్చి ఆటలాడించే చెంచు, జంగాల ముసలమ్మల కన్న ఈ పూజారులు ఎక్కువేమిటి.

ఇందిర: ఇక్కడ ఈ దృశ్యంలో వుండే భావము చాలా ఉత్తమమైనది కదా! కోతులాట ఒక బిచ్చకత్తె అడుక్కునేందుకు వుపయోగించేందుకు మాత్రమే.

మాలతి: ఆ కోతిని హనుమంతుడని ఆడించుతుందిగా! అదీ గొప్ప భావమే.

ఇందిర: ఎంత చక్కగా పోల్చావు! ఈ కొండ శిఖరాలమీద పచ్చని వృక్షాలు నిండిన యీ చరియలలో మేఘాలు మన కడకు వచ్చి మేలమాడే పవిత్ర ప్రదేశాలలో ఒక దివ్యలోకము ప్రత్యక్షమౌతుంది. ఆ లోకంలో శ్రుతి కలిసిపోయి, మహావిచిత్ర సన్నివేశము మానవజీవితాలను మహోన్నతపథాలకు కొనిపోతుంది. హిమాలయాలలో నిత్యజన్మయై దిగివచ్చి భారతదేశంలో నిత్యప్రవాహయై నిత్యసముద్రసంగమయైన గంగానదీ భావం భారతీయ జీవితానికి ఎట్లు నిత్యనూతనోత్తేజము చేకూరుస్తుందో, అలాగే యీ తిరుక్కళికుండ్ర సన్నివేశమున్నూ!

పద్మా: ఇందిరక్కయ్యగారు చెప్పిన మాటలు నాకేవో పులకరాలు కలుగజేస్తున్నవి. నేను గ్రహించుకోలేని ఆలోచనలు జాజిమల్లి సువాసనలుగా నన్ను అలుముకుపోతున్నవి.

3

నరసింహమూర్తి మేష్టారు నానాటికి చిక్కులెక్కువ పడిపోతున్న బుచ్చి వెంకట్రావు పద్మావతుల జీవిత సూత్రాలు గమనిస్తూ గాఢ విషాదంలో పడిపోయాడు. వాళ్ళ బ్రతుకులే ఒక సంగీతమైతే అపశ్రుతుల్లా అపస్వరాలులా, తప్పుడు తాళాలు ఏవేవో వచ్చి పడినవి.

అడివి బాపిరాజు రచనలు - 7

116

జాజిమల్లి(సాంఘిక నవల)