పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోవడాంవల్ల మంచిగాలి కరువు - వర్షాభావం ఏర్పడి మంచినీళ్ళకరువు. వర్షాలులేకపోవడం వల్ల పంటలకరువు. అందుకే మరల పెరట్లో చెట్టులు పెంచడం, కనీసం మనిషికొకచెట్టు నాటడం యీనాడు అందరూ చేపట్టవలసినది.

విహారం:

               "ఆడకే చుక్కాని ఈడనే గడవేసి
                 పడవెక్కి భ్ణద్రాద్రి పోదామా
                 చలి గంగస్నానము చేదామా"
                  

జానపదులైన క్రొత్తజంటలవిహారయాత్రలు ఇవి. వీరివిహారయాత్రలలో ముఖ్యమైన తీర్ధయాత్రలు, అంతర్వేది, పొన్నాడ, చొల్లంగి, కోరుకొండ, కోటిపల్లి, వాడపల్లి మొదలగు తీర్ధాలకు యెడ్లబళ్ళు కట్టుకొని మూటకూళ్ళు పట్టుమొని కుటుంబాలకు కుటుంబాలు తరలి వెళతారు. దగ్గర తీర్ధాలకు కాలినడకనే వెడతారు - ఇరుగు పొరుగు వారితో జట్లుజట్లుగా కూడి. దూరప్రాంతాలైన తిరుపతి, సింహాచలం, అన్నవరం వగైరా పుణ్యక్షేత్రాలకు మొక్కుంబడుల పేర్లతో రైలులో వెళతారు. ఈ ప్రయాణాలలో అటుకులు మూటకట్టుకొనిపోయి ప్రయాణం మధ్యలో అన్నానికి బదులు అవి నీళ్ళలో నానబెట్టుకు తింటారు. జాతర్లలో, తీర్ధాలలో వీరు స్వేచ్చగావిహరిస్తూ మంచం పకోడీలు, జీళ్ళు, కరకజ్జం, కడ్డీలు కొనుక్కు తినడం, లక్కపిడతలు, కొయ్యబొమ్మలుకొని తెచ్చుకోవడం, స్త్రీలు రకరకాల గాజులు తొడిగించుకోవడం చేస్తూ ఎంతో ముచ్చటగా తిరుగుతారు. రంగులరాట్నం సరదా విపరీతం. పురుషులు రంగుల రాట్నంలో గుర్రాలు, ఏనుగులు సింహాలమీద ఎక్కగా, స్త్రీలు ఉయ్యాళ్ళలో కూర్చుంటారు. రంగులరాట్నం గిర్రున తిరుగుతుంటే వాళ్ళ కళ్లు గిర్రున తిరిగిపోయి, గాలిలో తేలిపోయి ఏదో లోకంలోకి ఎగిరిపోతున్నట్టు మధురానుభూతిని పొందుతారు. ఈ రంగులరట్నం సాహిత్యంలో అనాదికాలం నుంచీ కనిపిస్తోంది. చంద్రశేఖర శతకంలో దీని ప్రస్తావన యిలా ఉంది.