పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గజ్జికురుపులకు ఆముదం, సున్నం కలిప్ రాస్తారు. -చీము వోడిపోతుంది, కురుపు మాడిపోతుంది. చిగుముకు మురుపిందాకు, పసుపు, ఉప్పు కలిపి నూరి రాస్తారు - తగ్గిపోతుంది. చిడుము, గజ్జి తగ్గడానికి సముద్రస్నానం చేయిస్తారు - అదికూడా ఒక మందు క్రింద లెక్కే. ఒంటిమీద పొక్కులకు మాచపత్రిఆకు పసరు రాస్తారు. తామరకు, చిక్కుడాకు రుద్దినా, కొబ్బరిపెంకు కాలుస్తుంటే వచ్చే చమురు రాసినా తగ్గిపోతుంది. ఇలా వైద్యం తేలిగ్గా చేస్తారు. సెగ్గడ్డలకు తెలగపిండి పెరుగులో నానబెట్టి కట్టుకట్టి పక్వానికివచ్చాక చ్ంద్రకాంతంచెట్టు ఆకును ఆముదంతో వేడిచేసి అంటిస్తారు. అది కోసేసి చీమునంతటినీ వోడ్చేసి మానిపోతుంది. ముఖంమీద మొటిమలకు అల్లంరసం ఆరారా రాస్తారు. తగ్గిపోతాయి. చిరుపుడి కాయలకు సున్నం, చాకలిసోడా కలిపిఅంటిస్తారు. రాలిపోతాయి. సప్పికి, మాదని పిప్పళ్ళు, మిరియాలు, దాల్చినచెక్క, చెంబపిక్కలు కలిపి అరగదీసి ఆ గంధం పూస్తారు. మాదకు కాకినాడ దగ్గరగల పెద్దాడలో చీట్లుయిస్తారు. ఈ చీట్లు తీసుకున్న మనిషి రోగి దగ్గరకు వెళ్ళేవరకూ అల్పాచమానంకూడ చెయ్యకూడదు. అంతకఠోరమైన నియమం. ఆ చీట్లు రోగిదగ్గర చింపుతారు. ఆమాద తగ్గిపోతుంది. అయితే చుట్ట పొగ వాసనవంటివి అయిదారు రోజులవరకూ రోగిదగ్గరకు రానీయకూడదనే నియమం ఉంది. ఈ చీట్లతోపాటు మందుకూడాయిస్తారు. అదికూడా వాడాలి.

కవుకుదెబ్బలకు ములగాకూ, వామ్మూ ఉడికించి కట్టుకడతారు. నడుమునొప్పికి కోడుగుడ్డులోని తెల్లనిసొన గుడ్డకి రాసి సెగను కాసి పట్టువేస్తారు. ఇరుకు నొప్పికి, బెణుకు నొప్పికీ చింతపండు ఉడికించి పట్టు వేస్తారు. వాతం నొప్పులకు తెల్లజిల్లేడుపాలు పొడుస్తారు. నులుగుపాము నడుంముక్క వండిపెడతారు. కీళ్ళ నొప్పులకి (రొమెటిజం) ఉడ్కబెట్టిన కేబేజి ముక్కలు ముక్కలుగా తరిగి రోగి కాళ్ళకూ చేతులకూ మర్ధనాచేస్తారు. కాళూ చేతులూ తిమ్మిర్లకు నీరుల్లిపాయ మెత్తగా నూరి మర్ధనా చేస్తారు-తగ్గిపోతాయి. కాళ్ళ పగుళ్ళకి ఆముదంలో పసుపు కలిపి పగుళ్ళలో రాస్తారు- కొంతమంది నిమ్మకాయ తొక్క రుద్దుతారు.

తలలో పేను కొరుకుడుకు ఎర్రమందారపువ్వు రుద్దుతారు. చుండ్రుకు మెంతులు నానబెట్టి రుబ్బి ఆముద్ద తలకు మర్ధనాచేసి తలంటుతారు-