పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

దంపూరు నరసయ్య

“అనంతరామశాస్త్రి తన అభిప్రాయాలను వివరించే సందర్భంలో తరచుగా సభ్యతను విడిచిపెడుతూ ఉంటాడు. ఆయన సంప్రదించిన ఆకరాలు హాస్యాస్పదమైనవి. సభ్యత విడిచిపెట్టకుండా ఆయనకు సమాధానం చెప్పడం వీలుపడదు. ఉద్దేశపూర్వకంగా అటువంటి విషయాలు ఈ లేఖలో ప్రస్తావించడం లేదు, చర్చలో వచ్చే విషయాల స్వభావమే అటువంటిదని పాఠకులు గ్రహించాలి' అని వెంకన్నశాస్త్రి ముందుగా హెచ్చరిస్తాడు.

“తన వాదానికి ఆధారంగా అనంతరామశాస్త్రి మనుస్మృతి 83వ ప్రకరణంలో 8వ శ్లోకాన్ని ఉదాహరించాడు. వివాహయోగ్యమైన కన్యకు కేశాలు అతిగా ఉండడం, పల్చగా ఉండడం మంచిదికాదు. బాలిక ఈడేరిన తర్వాతగాని ఈ విషయం తెలిసే అవకాశం లేదు. అప్పటివరకు చాలా శరీరభాగాలలో కేశాలు రావు. అందుచేత ఈడేరిన బాలికనే పెళ్ళాడాలని మనువు భావించాడు. ఇదీ అనంతరామశాస్త్రి వాదం! పరిహాసాస్పదంగా లేదా?

ధర్మశాస్త్రాలు విధి నిషేధాలను స్పష్టంగా పేర్కొన్నాయి. ఈ విషయంలో ఎటువంటి స్వేచ్ఛలేదు. శాస్త్రాలు కొన్నికార్యాలను చెయ్యమనో, చెయ్యవద్దనో చెపుతాయి. వీటి ఆచరణలో మనకు స్వేచ్ఛ ఉంటుంది. అనంతరామశాస్త్రి ఉదాహరించిన మనువాక్యాలు రెండో పద్దతివి. కేశాల ప్రస్తావన సౌందర్యానికి సంబంధించినదేగానీ, ఆయన భావించిన అర్థం దానికి లేదు.

శిశువు జన్మించిన నాటి నుంచి ఎనిమిదేళ్ళు వచ్చే లోపల మనువు షోడశకర్మలు విధించాడు. ఉపనయనంతప్ప, మిగతా కర్మలను ఆడపిల్లలకు కూడా మంత్రాలు లేకుండా ఆచరించాలని విధించాడు. పురుషుడికి ఉపనయన విధితో ఈ కర్మలు ముగిసినట్లు, స్త్రీకి వివాహ విధితో ఇవి పూర్తవుతాయని పేర్కొన్నాడు. స్త్రీకి ఎనిమిదో ఏట వివాహ విధి పూర్తి చెయ్యాలి. ఈ వయసులో కుమార్తె వివాహం నిర్వహించని తండ్రి గర్హనీయుడని స్మృతి పేర్కొంటుంది. బాలికలకు ఎనిమిదో ఏడు నిండేలోపల వివాహకార్యం పూర్తిచేయాలని శాస్త్రగ్రంథాల నుంచి విస్తారంగా ఉదాహరించాము. అనంతరామశాస్త్రి మనువును తప్ప ఇతర రుషుల ధర్మసూత్రాలను అంగీకరించ నన్నాడు. ఆయన వాటిని చదివిన పాపాన పోలేదు. రంగనాథశాస్త్రికి ఇంగ్లీషు వచ్చుకదా! హైస్కూలు పరీక్షలో 'ప్రొఫిషియెంట్' గా ఉత్తీర్ణుడయ్యాడుకదా ! మనుస్మృతి ఇంగ్లీషు అనువాదాలను పరిశీలించవచ్చు కదా !”

అయిదో లేఖ

వెంకన్నశాస్త్రి పేరుతో ఈ లేఖ మద్రాస్ టైమ్స్‌లో ప్రచురించబడింది. ప్రచురణ తేది లేదు. లేఖ 1865 సెప్టెంబరు 19 నాడు రచించబడినట్లు పేర్కొనబడింది.