పుట:Dhruvopakhyanamu.djvu/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

ధ్రువోపాఖ్యానము భాగవతమున జతుర్థస్కంధమున వచ్చు స్వాయంభువ మన్వంతర కథాసందర్భమున జెప్పబడిన భక్తచరిత్రము. శ్రీమద్భాగవతము సంస్కృతమున వ్యాసమహర్షి చే విరచింపబడియె. ఇది యష్టాదశ పురాణములలో నొక్కటి యని పెక్కండ్ర యభిప్రాయము. దేవీ భాగవత మను పేర బార్వతీదేవి యవతార విశేషముల వర్ణించు మఱియొక గ్రంథము కలదు. అయ్యదియే పదునెనిమిది పురాణములలో బేర్కొనబడిన భాగవత మని కొందఱి యభిప్రాయము. శ్రీమద్భాగవతము విష్ణులీలా చరిత్రమును బ్రతిపాదించును. వ్యాసుడు వేదాంతశాస్త్రమును బ్రహ్మ సూత్రముల రూపముగా నెలకొల్పెను. అది సకల జనుల కధ్యేయము కాక పోవుటచే భాగవతకథారూపమున వేదాంతదర్శన రహస్యము లుద్బోధించుటకై వ్యాసులీ గ్రంథమును రచించిరి. దీనికి సంస్కృతభాషలో బెక్కులు వ్యాఖ్యానములు గలవు. వానిలో జాల బ్రాచీనమైనది శ్రీధరకృతము ఆది యద్వైతమునే విశేషముగా స్థాపించును.

దీని దెనిగించిన కవి బమ్మెర పోతనామాత్యుడు. ఇతడు శివభక్తుడగు కేసనకు లక్కమాంబయందు జనించినవాడు; కౌండిన్యగోత్రజుడు పరమేశ్వరోపాసనచే గవితాశక్తి బడసిన కవి. సహజపాండిత్యబిరుదము వహించినందున నితడు గురుకులక్లేశమున విద్య సాధింపక స్వయంకృతిచే సాహిత్యమునందును దర్శనములందును బ్రౌఢపాండిత్య మలవరచుకొనియె. ఇతని దేశకాలము గురించి భిన్నాభిప్రాయములు గలవు. క్రీ.శ. 1420 ప్రాంతమున నితని భాగవతము రచింపబడియుండునని పలువురి యభిప్రాయము. భాగవతాంధ్రానువాదమున కితడే మొదటివాడు. ఇత డోరుగల్లను నేకశిలానగరమున నుండె నని మామతము. కొందరితడు కడపమండలములోని యొంటిమిట్టలో వసించె నని చెప్పుదురు. ఓరుగంటివా డనుట కనేక హేతువులు గానవచ్చుచున్నది క్రింద సూచించెదము. ఆంధ్రభాషలో మహాగ్రంథము లగు మహాభారతమును భాస్కరరామాయణమును శ్రీమద్భాగవతమును బహుకవిప్రోక్తములయ్యె గాని కేవల మేకావిక్ర్తముగాకపోయె. భారతములో నారణ్యపర్వమున నన్నయ కవిత నిలిపోయె. తిక్కన విరాట