పుట:Chandrika-Parinayamu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. శరధీశప్రేషితభా
స్వరమౌక్తికశుభికఁ దాల్చె జనపతి ‘శుభికే
శిర ఆరోహ’ యటంచున్
ధరణీసురపాళి సుస్వనంబునఁ బలుకన్. 44

క. మరుదర్పితమణిముద్రిక
నరనాథుకరాంగుళికఁ దనర్చెఁ బ్రవాళేం
దిర తనచెల్మికి రా భా
సురభద్రాసనము నిచ్చుసొంపు వహింపన్. 45

క. పతి దాల్పఁ బొలిచె ధనదా
ర్పితహీరాంగదము తనధరిత్రీభారో
ద్ధృతి కలరి భుజాభజనా
దృతిఁ గుండలితాహినేత యెనసినపోల్కిన్. 46

క. హరుఁడంచిన నవకనకాం
బర మయ్యెడఁ గప్పి నృపతి భాసిల్లెను బం
ధురసాంధ్యరాగవృతుఁడై
ధరణిం గనుపట్టు శిశిరధామునిచాయన్. 47

వ. ఇవ్విధంబున సకలదిగ్రాజనియోజిత నానావిధదివ్యమణివిభూషణభూషితగాత్రుం డగుచు, నాసుచంద్రధరాకళత్రుండు నిశాముఖకృత్యంబులు నిర్వర్తించి మించినముదంబున వేల్పుదొర యంచిన చౌదంతి నెక్కి యుదయనగవజ్రశృంగాగ్రవిద్యోతమానుండగు నరుణభానుండో యన నఖిలచక్రలోచనసమ్మోదసంపాదకమహాస్ఫురణంబునం బొలుపొందుచు, నభినవ్యశాతకుంభకుంభవారాంచితపాండురాతపత్రసహస్రంబు చుట్టు వలగొన నరుణమణిగణసంస్యూతఫణిరమణఫణాదశశతమధ్యస్థితుండగు నృసింహదేవుండునుంబోలె నపరిమితవిబుధమనఃపథ జరీజృభ్యమాణ మహాద్భుత