పుట:Chandamama 1947 07.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చినబాధ? పొండి, పొండి," అని కసిరాడు.

నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూచి మంచివాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానమిచ్చాడు. చివరికి ముసలితాత కొయ్యగుర్రం మిగిలింది. "ఏమిటి దీని విశేషం," అని అడిగాడు నవాబు.

"ఏలినవారు చిత్తగిస్తే మనవి చేస్తాను. ఇది వట్టి చూపులగుర్రంకాదు. కీలుగుర్రం. ఇది కనుమూసి కనుతెరిచే లోపల చుక్కల్ని చూసివస్తుంది ఆకాశం అంతు కనుక్కొస్తుంది," అన్నాడు ముదివగ్గు.

"టట్‌టట్! అంతా అబద్ధం. అలాంటిది భూలోకంలో ఉండదు," అన్నాడు నవాబు.

"ఏలినవారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను," అన్నాడు శిల్పి.

"ఇక్కడికి పదికోసుల దూరంలో చందనపర్వతం ఉంది. దానిమీద మసీదు. మసీదుకు పక్కన ఖర్జూరపుచెట్టు ఉంది. పోయి ఆ చెట్టు ఆకు పట్టుకురా చూస్తాను," అన్నాడు నవాబు.

ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రమెక్కి ఏదో బుడుపు లాగావున్న మీట నొక్కాడు. గుర్రం అగమేగాలమీద లేచింది. అది ఎప్పుడు వెళ్లి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలీదు. నవాబు తెప్పరిల్లి చూచేసరికి ఖర్జూరపు ఆకు పుచ్చుకొని శిల్పి ఎదురుగా నుంచున్నాడు.

నవాబుకు ఎలాగైనా ఆగుర్రాన్ని సంపాయించా లనిపించింది. "నీకేమి కావాలన్నా కోరి పుచ్చుకో. నాకా కీలు గుర్రం మాత్రం యివ్వు," అన్నాడు.