పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక్కడ క్రీస్తు నెత్తురు పిశాచాన్ని పారదోలుతుంది. అచ్చట క్రూర నియంతయైన ఫరో ప్రజలను సముద్రంవరకు వెన్నాడాడు. ఇచ్చట సిగ్గులేనిదయ్యం జ్ఞానస్నాన జలాలవరకు భక్తులను వెన్నాడుతుంది. అక్కడ ఒక నియంత సముద్ర జలాల్లో మునిగి చచ్చినట్లే ఇక్కడ మరొక నియంత రక్షణజలాల్లో మునిగిచస్తాడు".

5. పూర్వవేద ప్రజలకు సున్నతి అనేది ఉంది. దానిద్వారానేవాళ్లు దేవుని ప్రజలయ్యారు. నూత్న వేదంలో మనకు జ్ఞానస్నానం సున్నతిలాంటిది. సున్నతి ద్వారా యూదులు పూర్వనిబంధనానికి చెందినట్లే. జ్ఞానస్నానం ద్వారా మనం నూత్న నిబంధనానికి చెందుతాం. ఈ పట్టన సిరిల్ భక్తని పలుకులివి, "పూర్వం అబ్రాహాము సున్నతిని పొందాడు. జ్ఞాన స్నానంలో మనంకూడ సున్నతిని పొందుతాం. పవిత్రాత్మేమనమీద సిలువగుర్తువేసి మనకు ఈ సున్నతి చేస్తుంది."

4. జ్ఞానస్నాన ఫలితాలు

జ్ఞానస్నానంవల్ల మన జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. క్రింది అంతస్తులోని నరుడుపై అంతస్తులోనికి ఎక్కిపోయినట్లుగానే, ఈ సంస్కారంద్వారా మనం ప్రాకృతిక జీవితంనుండి ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కిపోతాం. ఈ యధ్యాయంలో రెండంశాలు పరిశీలిద్దాం.

1. మన సహకారం

జ్ఞానస్నానం దైవకార్యమైనా అది మన సహకారాన్ని కోరుకొంటుంది. ఆగస్టీను భక్తుడు చెప్పినట్లు దేవుడు మన సహకారం లేకుండానే మనలను పుట్టిస్తాడు. కాని మన సహకారం లేందే మనలను రక్షించడు. జ్ఞానస్నానంలో మన సహకారం విశేషంగా పరివర్తనం, విశ్వాసం అనే రెండంశాల మీద ఆధారపడి వుంటుంది. కనుక ప్రస్తుతం ఈ రెండంశాలను పరిశీలిద్దాం.

1) పరివర్తనం. "యెరూషలేము మొదలుకొని సమస్త జాతులకును క్రీస్తు పేరిట పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడుతుంది" - ఇది వుత్తాన క్రీస్తు శిష్యులతో చెప్పిన వాక్యం - లూకా 24, 47. అనగా ప్రజలు క్రీస్తుని తలంచుకొని పశ్చాత్తాపడితే పాపక్షమను పొందుతారని భావం. కనుక జ్ఞానస్నానానికి ముందు మన తరపున మనకు పశ్చాత్తాపం వుండాలి. ఆత్మదిగివచ్చాక పేత్రు యెరూషలేము యూదులతో మాటలాడుతూ "మీరు పరివర్తనము చెంది పాపక్షమ కొరకు క్రీస్తు నామాన జ్ఞానస్నానం పొందండి" అని నుడివాడు - అచ 2, 38. కావున మన పాపాల కొరకు పశ్చాత్తాపపడందే జ్ఞానస్నానం ఫలితమీయదు.