పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఊపిరి విశ్వమంతటా వ్యాపించివుంది. కావుననే కీర్తనకారుడు
నీవు ఊపిరిపోస్తే ప్రాణిసృష్టి జరుగుతుంది
నీవు భూమికి నూత్నజీవం దయచేస్తావు

అని పాడాడు - 10430. ఆత్మవూపిరి. ఆ వూపిరివల్లనే బాబిలోనియాలో శిధిలమైయున్న ఎముకలు మల్లా జీవాన్ని పొందాయి. "నా ప్రజలారా! నేను మీ సమాధులు తెరిచి మిమ్మలేపుతాను. మిమ్మమళ్ళాయిస్రాయేలు దేశానికి తోడ్కొని పోతాను” - యెహెజేలు 37,14.

2. పాలస్తీనా దేశంలో వాన అట్టే కురవదు. కనుక యూదులు నీటిని అమూల్యమైన వరంగా భావించారు. జీవంతో సమానంగా ఎంచారు. దేవుని దీవెనవల్ల ఎడారి కూడ నీటితో నిండిపోతుందని చెప్పాడు యెషయా

నేను ఎడారిని కొలకులుగా మారుస్తాను
ఎండిన నేలను నీటి బుగ్గలుగా జేస్తాను

-41,18. క్రమేణ జీవదాయినియైన నీరు జీవమొసగే ఆత్మకు చిహ్నమైంది. ఆత్మ నీరు కనుక దేవుడు దాన్ని ప్రజలపై కుమ్మరిస్తాడు. "పిమ్మట నేను నా యాత్మను ఎల్లరిపైకుమ్మరిస్తాను' - యోవేలు 2,28. "నేను దావీదు వంశజులపైనా, యెరూషలేములోని యితర ప్రజలపైనా దయాగుణాన్నీ ప్రార్ధనగుణాన్నీ కుమ్మరిస్తాను" - జెకర్యా 12,10. దేవుడు తన ఆత్మనే ప్రజలపై కుమ్మరిస్తాడు. నేను మీపై శుభ్రమైన జలాలు చల్లి మిమ్మ శుద్ధిచేస్తాను" - యెహె 36,25, ఈ నీరు యెరూషలేములోని దేవాలయం నుండి ప్రవహిస్తుంది. "ఆ దేవళం గుమ్మం క్రిందినుండి నీరు ఊరి తూర్పుదిక్కుగా ప్రవహిస్తుంది" - 37,1. ఇక్కడ ఈ దేవళం దేవునికి చిహ్నం. ఆత్మ యెప్పడు గూడ దేవునినుండిగాని బయలుదేరదు.

బైబులు ఆత్మను సముద్రజలాలతో పోల్చదు. చెలమ నీటితోను వాననీటితోను పోలుస్తుంది. ఈ నీరు జీవాన్నీ సత్తువనూ దయచేస్తుంది.

3. నీరు మృదువుగా వుండి అన్నిటిలోకి ప్రవేశిస్తుంది. నరుని శరీరంలోకిగూడ ప్రవేశిస్తుంది. కనుకనే ప్రభువు "నా యాత్మను మీలో వుంచుతాను" అన్నాడు - యెహె 36,27. ఆత్మ జలంలాంటిదనే పూర్వవేద భావాన్ని నూత్నవేదంలో యోహాను మళ్లా ఎత్తుకొన్నాడు. విశ్వాసంగల భక్తుడు ఆత్మవలనా నీటివలనా గూడ జన్మిస్తాడు - 3,5, క్రీస్తు అంతరంగంనుండి జీవజల నదులు పుట్టుకవస్తాయి. ఈ జీవజలం పవిత్రాత్మే - 7,38-39.