పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈలా మన జీవితం క్రీస్తు జీవితం కావాలంటే మనము అతనితో ఐక్యం గావాలి. రెమ్మలు తల్లితీగలోనికి ఐక్యమైనట్లుగా మనమూ క్రీస్తులోనికి ఐక్యంగావాలి - యోహా 15,4

కొందరు తొలిసారిగా ఆత్మలోనికి జ్ఞానస్నానం పొందినపుడు గొప్ప భక్తిభావాన్ని అనుభవిస్తారు. కాని ఈ భక్తిభావం నిలుస్తుందా? మనం రోజురోజు క్రీస్తుప్రేమలో పెరుగుతూంటే ఈ భక్తిభావం నిలుస్తుంది. పెంతెకోస్తుభక్తిని నిలుపుకొనే మార్గాలు విశేషంగా నాలున్నాయి. ఇవి దైవవాక్కు ప్రార్థనమూ, భక్తసమాజమూ, సేవాను. ఇక వీటిని క్రమంగా పరిశీలించి చూద్దాం.

2. దైవవాక్కు పెంతెకోస్తు ఉద్యమానికి చెందిన భక్తుడు దినదినమూ దైవవాక్కును పఠించాలి. ఈ చదవడం కూడ జ్ఞానార్ధనం కోసంగాదు, భక్తిభావాన్నీ భగవదనుభవాన్నీ పెంపొందించుకోవడానికి. మామూలుగా ఈ వుద్యమానికి చెందిన భక్తులు ఆత్మ ప్రేరణంవలన బైబులు పఠనంలో గొప్ప ఆసక్తి చూపుతారు. బైబులు వాక్కు వాళ్ళ హృదయాన్ని వెలిగించి వశం చేసికొంటుంది.

మనకు ఓ వ్యక్తిమీద ప్రేమ గౌరవమూ కలిగితే ఇక అతనికి అంటిపెట్టుకొని వుంటాం. కాని మనకు తెలియని వ్యక్తి మీద ప్రేమ గౌరవాలు పట్టవు. ఇందుకే మన కిష్టమైనవాళ్ళ జీవిత విశేషాలను ఆసక్తితో తెలిసికొంటుంటాం. ఇక క్రీస్తు విషయంలోకూడా ఇంతే ఆ ప్రభువుమీద మనకు ప్రేమ ఏర్పడాలంటె మొదట అతన్ని గూర్చి మనకు క్షుణ్ణంగా తెలియాలి. ఈలా తెలిసికోవడానికి బైబులు తప్పితే వేరేమార్గంలేదు. నాల్గవ శతాబ్దంలోనే భక్తుడు జెరోము బైబులు తెలియని వాళ్ళకు క్రీస్తంటే యేమిటో తెలియదని చెప్పాడు. కనుక క్రైస్తవ భక్తుడు బైబులు చక్కగా చదువుకోవాలి.

బైబులు పఠించేవాళ్ళకు ప్రభువువాక్కు నిష్పలం. వానా మంచూ నేలను తడిపి పంట పండించినట్లుగా దైవవాక్కుకూడా వాళ్ళ హృదయాన్ని ఫలభరితం చేస్తుంది - యెష55, 10. వాళ్లు ప్రభువు శిష్యులౌతారు - యోహా 8,31. ఆ ప్రభువు సందేశంతో నిండుకొంటారు. ఆ సందేశాన్ని ఇతరులకు అందిస్తారుకూడ. పైగా ప్రభుని కృతజ్ఞతతో ఎలుగెత్తి స్తుతిస్తారు - కొలో 3, 16

ప్రభువు వాక్కు గొప్ప వివేచనాన్ని ప్రసాదిస్తుంది - హెబై 4, 12. భక్తితో దైవవాక్కును పఠించేవాళ్ళు తమ్ముగూర్చిన దైవసంకల్పాన్ని గుర్తిస్తారు - రోమా 12, 2 ఈ వాక్కు అనే ఆయుధంతో భక్తులు జీవితంలోని దుష్టశక్తులతో పోరాడగలరు - ఎఫే 6,17. వేయేల, దేవుని వాక్కును పాటించేవాడు రాతిపునాది మీద యిల్లకట్టిన బుద్ధిమంతుని లాంటివాడు - మత్త 7, 24