పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుబ్జ: ఈ పృధ్వీమహారాజు కాలనేమివంటివాడు. జిత్తులమారి, స్వామిద్రోహి. ఈతనివలన నటు కళింగ రాజ్యమును, ఇటు విష్ణుకుండిన రాజ్యమును రెండును మోసగింపబడినవి.

జయనంది: మహాప్రభూ!ఇంతవరకు నొక పెద్దయుద్దమైన చవిచూచి యెరుగను. మా చేతులు నిదురపోవుచున్నవి. మాకు సెలవిండు. మూడు కోటగోడలు గలిగిన యీ త్రిపురమునకు మేము పురహరుల మయ్యెదము.

కుబ్జ: త్వరపడకు మయ్యా! గుమ్మడికాయంత పండు నిచ్చి మ్రింగమందును, అపు డేమిసేతువు?

జయ: అది మెత్తని పండా, గట్టి పండా మహాప్రభూ!

కుబ్జ: పండు మెత్తని దగుటలోనను, గట్టిదగుటలోనను ఏమున్నది?

జయ: మెత్తని దగుచో ముక్కలు చేసి మ్రింగవచ్చును.

'కుబ్జ: గట్టిదయినచో?

జయ: దానిని ముక్కలుగా కోసి, నమలిమ్రింగ వలయును?

కుబ్జ: కావున ముక్కలు చేయుట పండు ఎట్టిదైనను సమానమన్నమాట!

జయ: చిత్తము.

కాల: కావున నీ కోటను బట్టుటకు, గోటసంరక్షకుని ఏకాగ్రతను జెదరగొట్టవలెనని మహాప్రభువులు -

కుబ్జ: అదియే నా త్రిప్పికొట్టు తంత్ర ప్రయోగము. కోట బాహిరముననున్న మనపై శత్రువుల దృష్టి కేంద్రీకరింపబడి యున్నది. మనమేమి పన్నాగములు పన్నినను, శత్రువులు దానికి ప్రతిని బన్నుచునేయుందురు. కావున, కోట లోపలనొక సంక్షోభమునకు వారి దృష్టిని మరల్ప గల్గినచో వారి యేకాగ్రత ద్విముఖమగును. రెండు ముఖ్యములున్న దానిని బహుముఖములుగా మార్చుట మతిసులభము.

జయ: లో మన మెట్లు సంక్షోభమును సృజింప గలము మహారాజా?

కుబ్జ: ఓపిక పట్టుము.

ఆ రాత్రి చాళుక్యసైన్యము లన్నియు నప్రమత్తతతోనే మహారాజు నాజ్ఞ కొఱకు నేదురు చూచుచుండినవి.

నడిరేయి యగునప్పటికి బదివేల రెండెడ్ల బండ్లను ఎద్దులవిప్పివైచి ఒక్కొకబండి నెనిమిదిమంది వీరుల చొప్పున లాగికొనుచు, సార్ధయోజనము చుట్టుకొలతగల కోటచుట్టును మూడు యోజనముల వృత్తముగా నాక్రమించిన చాళుక్య సైన్యములను కుబ్జవిష్ణువర్ధనుల యాజ్ఞగా జయనంది కొని వచ్చెను. ప్రతిబండిపైనను దిట్టములైన దూలముల నడ్డముగా, నిలువుగా గట్టించినాడు జయనంది. చక్రములకు వాని వెడల్పునకు సరిపడు పొడుగుగల సన్నని గట్టి దూలములను గట్టించినాడు. ఇవన్నియు విషమసిద్ది మహాప్రభువు నాజ్ఞలే! ఒక్కొక బండి క్రిందుగా నలుగురు విలుకాండ్రును, నెనిమిదీ మంది బండిని వెనుక నుండి త్రోయుటకును నుండుటకు మహా ప్రభువు నాజ్ఞ.

ఈ బండ్ల వెనుక శిలాపాతనయంత్రములు, నగ్నిబాణ యంత్రములు, శిలా చక్రయుక్తము లైనవి, రథములవలె బోవుటకుగా సిద్దము చేయబడినవి.



అడివి బాపిరాజు రచనలు - 6

251

అంశుమతి(చారిత్రాత్మక నవల)