పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిచ్చి యమునానదివైపున యుద్దముచేయ రాణిగారి నంపిరి. ఆమెయు గడమసైన్యము మిగుల జాగ్రతగా నుండుట గని తన స్థలమునకు బోయెను. కాని యుద్ధమునందసమాన ప్రజ్ఞగల హూణసైన్యంబు అల్పకాలములోనే పేష్వాగారి సైన్యంబుల దైన్యంబునొందించెను. అది గని రావుసాహెబు పేష్వా మొదలగువారధిక విచారమున మునుంగ రాణిగారు వారికి ధైర్యపు మాటలుచెప్పి తన స్వల్పసైన్యముతో శత్రువులను చీకాకుపరచెను. కాని వెనుకనుండి వచ్చు శత్రుసైన్యముల వలనను, తమ సైన్యమునందలి ఇతర సేనాధిపతులు పలాయితులగుట వలనను రాణిగారు యుద్ధమునుండి తొలగవలసినవారయిరి.

ఇట్లు కాల్పీయం దపజయమును బొందిన ఈ ప్రముఖులందరును గ్వాలేరు వైపునగల గోపాలపురమునందుజేరి ముందు చేయవలసిన దానినిగూర్చి విచారింపుచుండిరి. వారెంత విచారించినను సైన్య మత్యల్పమగుటచే యుద్ధముచేయుటకు దోచకుండెను. రాణిగారును వారితోడనే యుండెగాన నామె యాయల్పసైన్యముతో గ్వాలేరున కరిగి సిందేగారిని తమకు దోడుపడ వేడుకొనవలయుననియును, అందు కాయన సమ్మతించినయెడల యుద్ధముచేయవలయుననియు నాలోచనచెప్పెను.

ఆమె గరపిన యాలోచన పేష్వాగా రంగీకరించి దిన ప్రయాణములు చేసి 1858 వ సంవత్సరము మే నెల 30 వ తేదీని గ్వాలేరునకు సమీపమునందున్న మురారిపుర సమీపమున బ్రవేశించిరి. అంత వారందరును విచారించి స్ందేగారిని తమకు సహాయులగుటకుగాను వర్తమాన మంపిరి.