పుట:Abaddhala veta revised.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింగర్ చర్చను ప్రారంభించి పెద్ద దుమారం లేపాడు. సంపన్న దేశాలలో విలాసాలకు ఖర్చుచేసే వారు ఒక్కసారి ఆలోచించి, వాటిని తగ్గించుకుంటే, ఆ పొదుపుతో పేద పిల్లలు బాగుపడతారంటాడు.

పీటర్ సింగర్ హేతుబద్ధమైన ఉపయోగతావాది చింతనాపరుడు. మనం చేసే పనుల ఫలితాలను, బాగోగులను బట్టి మంచిచెడ్డలు నిర్ధారించాలంటాడు.

వస్తువులన్నీ వుండగా వాటిని మార్చేసి, లేదా అవతలపారేసి, కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వాటికోసం సంపన్నులు పరుగెడుతుంటారు. సెలవుల్లో ఖరీదైన పిక్నిక్ లకు వెడతారు. అత్యంత విలాసవంత హోటళ్ళలో బాగా ఖర్చుపెట్టి తాగుతారు, తింటారు. అవసరం లేని ఖర్చులు పెడతారు. ఆ డబ్బులో కొంతైనా విరాళంగా యిస్తే చాలామంది అనాధ పిల్లలు, పేద పిల్లలు బాగుపడతారంటాడు పీటర్ సింగర్.

తన వాదానికి మద్దతుగా పీటర్ సింగర్ మరో తాత్వికుడి రచనలు కూడా ఉదహరించాడు. న్యూయార్క్ యునివర్శిటీ ఫిలాసఫర్ పీటర్ సింగర్ 1996లో ప్రచురించిన పుస్తకంలో యిలాంటి వాదన ఆకట్టుకున్నది. (Peter Singer:"Living High And Letting Die")

అయితే పిల్లల్ని ఎందుకు కాపాడాలి? అంటే, రోగాలకు, ఆకలికి పిల్లలు బాధ్యులు కారు. వారిని కన్న తల్లిదండ్రులు, సమాజం అందుకు బాధ్యత వహించాలి. కనుక అలాంటి పిల్లల్ని ఆదుకోవడం బాధ్యతగా స్వీకరించాలని పీటర్ సింగర్ వాదించాడు.

బాల్యదశలో ఆకలి, రోగాలు లేకుండా బయటపడితే ఆ తరువాత వారి తిప్పలు వారు పడతారు. కనుక 2 వేల రూపాయలు దానం చేస్తే ఒక పిల్లవాడు (లేదా బాలిక) ప్రమాదస్థితిని దాటి బయటపడే అవకాశం వుంది.

ప్రపంచంలో అనేక మంది ఆ మాత్రం దానం చేయగల స్థితిలో వున్నారు. అయినా ఉదాసీనంగా అశ్రద్ధ చేస్తున్నారు. ఎందరో పిల్లలు సహాయం అందక చనిపోతున్నారు. ఇదీ స్థితి.

జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూదులను చంపారు, చిత్రహింసలకు గురి చేశారు. నాజీలు హిట్లర్ నాయకత్వాన జరిపిన యీ దారుణ అమానుష చర్యలు జర్మనీ పౌరులకు తెలుసు. అయినా వూరుకున్నారు. పిల్లలు చనిపోతున్నా బాధపడుతున్నా తెలిసీ కనీస దానం చేయకపోవడం అలాంటిదేనని పీటర్ సింగర్ అంటున్నాడు.

కనీస అవసరాలు తీరేవారు, విలాసాల జోలికి పోకుండా దానం చేయడం నైతిక బాధ్యత అని తాత్వికుడు పీటర్ సింగర్ విజ్ఞప్తి చేస్తున్నాడు. జీవించడమేకాదు. నైతికంగా మంచి జీవనం అవసరం. ఆ దృష్ట్యా అతడు వాదిస్తున్నాడు.

ఎవరీ పీటర్ సింగర్?

1946లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో పుట్టిన పీటర్ సింగర్ అటు ఆస్ట్రేలియాలోనూ,