పుట:Abaddhala veta revised.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏతా వాతా చెప్పొచ్చేదేమంటే, యీ ఖరీదైన విలాసపు ఆధ్యాత్మికత మన సమాజానికి అక్కరకు రానిదనే. సామాన్యులకు ఏ మాత్రం తోడ్పడని యిలాంటి ఆశ్రమాలు సమాజానికి చీడపురుగుల వంటివి. సమాజపు సంపదను అనుభవిస్తున్న యీ ఆశ్రమాలు కొత్తరకపు స్మగ్లర్స్ మాత్రమే.

- హేతువాది, సెప్టెంబరు 1992
ఏది సెక్యులరిజం? ఎలా అమలుపరచడం?

సెక్యులరిజం చిక్కుల్లో పడింది. భక్తి బలప్రదర్శనకు దిగింది. రాజకీయ పార్టీలు ప్రజల్ని నలుచుకు తింటున్నాయి. అయోధ్యలో మసీదు-రామమందిర్ తగాదావలన, సెక్యులరిజం అంటే ఏమిటో నిర్దుష్టంగా తేల్చుకోవలసిన స్థితి వచ్చింది.

సెక్యులరిజంపై దాడిచేస్తున్న భారతీయ జనతాపార్టీ దేశంలో సెక్యులరిజం గురించి చర్చ జరగాలంటున్నది.

సెక్యులర్ శక్తులన్నీ ఏకం కావాలని ప్రధాని పి.వి.నరసింహారావు పిలుపు యిచ్చాడు.

ఏది సెక్యులరిజం అంటే అన్ని మతాల్ని సమాన గౌరవంగా చూడడం అని రాధాకృష్ణన్ చెప్పిన భాష్యాన్ని పల్లెవేస్తున్నారు. ఆ పేరిట ఎవరిమతాన్ని వారు ప్రోత్సహిస్తూ, అధికారంలో వున్నవారు తమ వ్యక్తిగత నమ్మకాల్ని జనంపై రుద్దేస్తున్నారు.

ప్రధానిగావున్న పి.వి.నరసింహారావు హైదరాబాద్ లో ఒక ప్రైవేటు కళ్యాణమండపానికీ వచ్చిన సాయిబాబా కాళ్ళకు మొక్కాడు. నాలుగేళ్ళపాటు దేశాన్ని సుభిక్షంగా వుంచమని (తన పదవీకాలం) పి.వి. కోరుకున్నాడు. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ పుట్టపర్తి వెళ్ళి సాయిబాబా కాళ్ళకు వందనం చేశాడు.

ప్రజలు ఎన్నుకున్న పదవులలో వున్నవారు ప్రజలు తమకిచ్చిన సార్వభౌమత్వాధికారాన్ని ఇతరుల పాదాల వద్ద తాకట్టుపెట్టారు. ఇది ప్రజలకు అవమానం.ఇది సెక్యులర్ వ్యతిరేకం. అలాంటి వాళ్ళు సెక్యులర్ శక్తులు ఏకం కావాలంటే, పదవులు నిలబెట్టుకోడానికి ఎత్తుగడ మాత్రమే అవుతుంది.

సెక్యులరిజం అంటే ఏమిటి? మానవవాదులు,హేతువాదులు మొదటి నుంచీ యీ విషయమై స్పష్టంగానే చెబుతూ వచ్చారు.

సెక్యులరిజం అంటే అన్ని మతాలకు ప్రభుత్వం దూరంగా వుండతమే. మతాన్ని వ్యక్తిగత విశ్వాసంగా పరిగణించి,ప్రభుత్వ యంత్రాంగాన్ని,ప్రసారాలను మతానికి వినియోగించకుండా వుండటమే సెక్యులరిజం. అంటే ఎవరు ఏ మతానికి చెందినా,చట్టం ముందు సమానమే.దీనికి అనుగుణంగానే రాజ్యాంగంలో ఆదేశసూత్రాలలో యూనిఫారం, సివిల్ కోడ్ కావాలన్నాం.