పుట:2015.370800.Shatakasanputamu.pdf/569

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

618

భక్తిరసశతకసంపుటము


ల్పారఁగఁదోల నిన్నొగి నుపాసన చేసెద సంతసంబునన్
సారదయాప్తిఁ గైకొనుచు సద్గతి నీఁగదె రామ...

81


చ.

జలధరదేహ నామనవి శ్రావ్యముగా వినకున్న భావము
న్దెలిసి మనంబులోనఁ గడుదీనత నొందుచునున్న నాయెడ
న్మెలఁగుటకై నిజంబుగ నిమీలితనేత్రుఁడ నౌచు నెమ్మదిం
దలఁచుచు నున్న నాతలఁపుఁ దప్పక దీర్పుము రామ...

82


చ.

అనవరతంబు మీమహితు లాత్మగతంబున నిల్చిగాదె స
న్మునివరులెల్ల యోగపరిపూర్ణసమాధి వినిశ్చలాత్ములై
మనమున సన్నుతించుచుఁ బ్రమాదపరిభ్రమ లేమి లేక యే
మునుఁగుచును న్వినోదముల మోదమునొందరె రామ...

83


ఉ.

మోహరసాబ్ధిలోఁ బడి ప్రమోదమున న్విషయాతురంబున
న్సాహసధుర్యులై సతులసంగతులం బడి తాపయుక్తులై
దాహము దీఱ నారిసురతంబులనే రుచిగాఁ దలంచి సం
మోహనిబద్ధులై చెడిరి మూర్ఖులు భూస్థలి రామ...

84


ఉ.

శ్రీకరభక్తచిత్తసరసీరుహబంధురచంచరీక సు
శ్లోక సురారివారక వసుంధరనాయక! రావణాంతకా
ప్రాకటనిర్జరప్రముఖపాలక! కాంచనకుండలప్రభా
నీకఫలప్రదాయక! వినిర్జితపాతక రామ...

85