పుట:2015.370800.Shatakasanputamu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈశతకమును కంచెర్ల గోపమంత్రి రచించి భద్రాచలరాముల వారి కంకితము గావించెను. ఇతఁ డాత్రేయగోత్రుఁడు. లింగమంత్రి కుమారుఁడు. ఆదిశాఖాబ్రాహ్మణుఁడు. భట్టరాచార్యులశిష్యుఁడనియుఁ దిరుమంత్రము పఠించుచుంటిననియు నూర్ధ్వపుండ్రముఁ బెట్టితిననియుఁ గవి చెప్పికొనియుండుటచే గోపమంత్రి వైష్ణవత్వము నొందినవాఁడని సువ్యక్తమగును. ఇందుల కనుకూలముగ ముకుందమాల, యామునాచార్యస్తోత్రము లోనగు వైష్ణవగ్రంథములలోని భావము లిందలిపద్యములలోఁ గానవచ్చుచున్నవి.

కంచెర్ల గోపమంత్రియే రామదాసు. గోపమంత్రి దానరాధేయులని ప్రశస్తివహించిన అక్కన్నమాదన్నగారలకు మేనల్లుఁడై తానిషా యని వ్యవహరింపఁబడు అబూల్ హసన్ కుతుబుషా గోలగొండ రాజ్యము పాలించుతఱి భద్రాచలప్రాంతమునకు తాహసీలుదారుగా నియోగింపఁబడెను. దొరతనమువారి ధనమును దేవాలయనిర్మాణమునకు వ్యయము చేసి శిక్షితుఁడగుటయు శ్రీరామానుగ్రహమువలన బంధముక్తుడగుటయు నాబాలవృద్ధ మెఱింగిన సుప్రసిద్ధకధయే.