పుట:2015.329863.Vallabaipatel.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

27

ధ్యాయులలో దేశభక్తిని రేకెత్తించి, వారి ద్వారా పిల్లలకుఁ బ్రబోధము చేయించెను. మ్యునిసిపలు కమిషనరుకు నారోగ్య శాఖాధికారికి సింహస్వప్న మైనాఁడు. ఆ పట్టణము నతిసమర్థతలోఁ బాలించి దాని పెంపుకుఁ బెద్ద కృషిచేయుటయేగాక కాంగ్రెసు పతాక రంగులను లాంతరు స్తంభములకు వేయించెను. వేయేల? ఆనగరమును కాంగ్రెసు నగరము కావించెను.

పటే లధ్యక్షుఁడుగా నుండుటకు ముం దహమ్మదాబాదు కంటోన్మెంటు మునిసిపాలిటీకి నీటి పన్నిచ్చెడిదికాదు. పటే లధ్యక్షుఁడైన తరువాతఁ 'బన్ని చ్చెదరా, నీళ్ళు బందు చేయనా' యని తాఖీదు పంపినాడు. అంతట గలెక్టరు 'మీతో మాట్లాడవలయును. ఎన్నింటికి వచ్చెద'రని కబురు చేసెను. దానికిఁ బటే లిట్లు సమాధానము పంపెను. 'మీతో మాట్లాడవలసినపని నా కేమియు లేదు. నాతో మాట్లాడవలసిన యవసర మున్నచో నా యాఫీసుకు వచ్చి మాట్లాడవచ్చును.' అంతట విధిలేక కలెక్ట రాయన యాఫీసుకు వచ్చి నీళ్ళు వదలి పెట్టవలసినదిగాఁ గోరెను. పన్నీ యనిదే నీరు వదలుటకు వీలు లేదని పటేలు పట్టుపట్టెను. కంటోన్మెంటు నీటి పన్నిచ్చు నాచారము లేదని కలెక్టరు వివరించెను. అట్లయినచో నీ పూటనుండి నీరు బందు చేయుచున్నానని పటేలు బెదరించెను. కలెక్టరు గవర్న మెంటుకు వ్రాసి యా పన్ను చెల్లించెను. ఈ విధముగాఁ బటే లిక్కడ విజయదుందుభిని మ్రోగించెను.