Jump to content

కాశీయాత్ర చరిత్ర/పీఠిక

వికీసోర్స్ నుండి

ఏనుగుల వీరాస్వామయ్యగారి

కాశీయాత్ర చరిత్ర

తృతీయ ముద్రణము

పీఠిక

భారతదేశ చరిత్రను గురించీ ప్రజల స్థితిగతులను గురించీ తేట తెనుగులో జాబులుగాను, దినచర్యగాను రచింపబడిన యీ చరిత్రగ్రంథము తెనుగు వాజ్మయంలో అపూర్వమైనది. ఇది అందరూ చదవలసిన పుస్తకం. ఇది చిరకాలం కిందటనే అనగా 1838 లో నొకమాటు 1869 లో నింకొకమాటు అచ్చు పడిందిగాని మళ్ళీ అచ్చుపడలేదు. అందువల్ల ఈ పుస్తకంయొక్క ప్రతులు ఇప్పుడు చదవడానికైనా ఎక్కడా దొరకడంలేదు. ఏమారుమూలనైనా తలవని తలంపుగా ఒక ప్రతి దొరికినా దానిలోని పుటలు తిప్పితేనే నుసి అయిపోయేటంత పాతబడి పెళుసెక్కి వున్నాయి. వీరాస్వామయ్యగారు 1832 ఆ ప్రాంతంలో సి. పి. బ్రౌను దొరగారికి వ్రాయించి పంపిన పుస్తకం వ్రాతప్రతి యొకటి చెన్నపట్టణం ఓరియంటల్ మాన్యూస్క్రిప్ట్సు లైబ్రరీలో ఉందిగాని, అది చదవడానికి వెళ్లి కొన్నాళ్ళు ఉండాలి. అంతే కాకుండా అచ్చు పుస్తకానికీ దానికీ కొన్ని తేడాలు కూడా వున్నాయి. అందువల్ల ఈగ్రంథం మళ్ళీ అచ్చు వేయడం చాలా అవసరమైంది.

పుస్తకం రచింపబడిన నాటికీ నేటికీ మనదేశ పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి. అందువల్ల అప్పట్లో వీరాసామయ్యగారు తన కాలంనాటి వారందరికీ తెలిసిన సంగతులే యని విపులంగ వ్రాయక సూచించి వదిలిన రాజకీయ సాంఘిక చారిత్రక అంశము లనేకములు ఇప్పుడు విప్పిచెప్పితేనే గాని అర్థంకావు. ఉదాహరణానికి తిరుపతి దేవస్థానంవల్ల కుంపినీవారికి సాలున లక్షరూపాయల ఆదాయం వస్తున్నదని ఈ గ్రంథంలో వ్రాసివున్నది. ఆ కాలంలో మన ధర్మాదాయాలన్నీ కుంపినీవారే స్వయంగా పరిపాలించే వారనిన్నీ భోగములు, అర్చనలు కలెక్టర్లే చేయించే వారనిన్నీ, మిగిలిన సొమ్ము కుంపినీఖజానాలో చేరే దనిన్నీ ఆ కాలంనాటి చరిత్ర చదివితేనే తప్ప తెలియదు. ఇలాంటొ చరిత్రాంశా లన్నింటికీ తగిన వివరణములు, తబ్సిలు, సంపాదించి ఫుట్‌నోట్సుగా వ్రాశాను.

1824-1826 మధ్య కలకత్తాలో కుంపినీవారి కొలువులో ప్రధాన క్రైస్తవ మతాధికారిగా నుండిన బిషప్ హెబరుదొర భారతదేశంలో పర్యటనం చేసి తాను చూసిన సంగతులను తన దినచర్యలోను తన భార్యకు స్నేహితులకు వ్రాసిన ఉత్తరాలలోను వ్రాసియున్నాడు. అది బిషప్ హెబర్సు జర్నల్ అని మూడు సంపుట

కాశీయాత్ర చరిత్ర: తృతీయ ముద్రణం - పీఠిక

ములుగా ప్రకటించబడి ఆ కాలంనాటి హిందూదేశచరిత్రను ప్రజల స్థితిగతులను గూర్చిన ప్రమాణగ్రంథంగా పూజింపబడుతూ వున్నది. మన వీరాస్వామయ్యగారి గ్రంధం ఆగ్రంథాని కేవిధంగాను తీసికట్టుకాదు. సందర్భానుసారంగా హెబరు గారి గ్రంథంలోనుండి కొన్ని సంగతు లీగ్రంధంలో అక్కడక్కడ ఉదాహరించారు.

పూర్వముద్రణం అచ్చుప్రతులలో వదిలివేయబడి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో వున్న వ్రాతప్రతిలోని విశేషాంశాలను కొన్నింటిని సందర్భానుసారంగా వుదాహరించాను.

వీరాస్వామయ్యగారి పర్యటనమును తెలుపగల ఒక హిందూదేశ పటమును దీనిలో చేర్చారు. శ్రీ వీరాస్వామయ్యగారియెక్కయు, ప్రజాసేవయందు వీరికి తోడ్పడిన వీరి మిత్రులైన కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళగారు, వెంబాకం రాఘవాచర్యులుగారు, జార్జి నార్టనుగార్ల యొక్కయు చిత్రపటాన్ని కూడా దీనిలో చేర్చారు.

ఈగ్రంథాన్ని మళ్ళీ యిప్పుడు ముద్రించడంలో పూర్వ ముద్రణపు మూలగ్రంధంలో మార్పులు ఏమీ చేయక యథాతథంగానే అచ్చువేయించాను. అయితే పాఠకుల సౌకర్యంకోసం గ్రంధాన్ని ప్రకరణాలుగా విభజించి, విషయం మారినప్పుడల్లా పేరాలుగావిడదీసి, వాక్యాలు సులభంగా అన్యయంకావడానికి మధ్య కామాలు, మొదలైన గురుతులున్నూ, వాక్యాలచివర ఫుల్ స్టాపు చుక్కలున్నూ వుంచినాను. అందువల్లను చరిత్రాంశాలు వివరణలుగల ఫుట్ నోట్సువల్లను పూర్వ ముద్రణంలో 328 పుటలున్న గ్రంధం ఈముద్రణంలో 374 పుటలకు పెరిగింది.

కృతజ్ఞత.

కాశీయాత్ర చరిత్ర అచ్చు వేయించడానికి పూర్వముద్రణపు గ్రంధం కోసం చాలారోజులు ప్రయత్నించినా దొరకలేదు. పుస్తకం దగ్గరవున్న ఇద్దరు పెద్ద మనుష్యులు యిస్తామని ఇచ్చారుకారు. ఆఖరికి వేటపాలెం సరస్వతీ నికేతనం గ్రంధాలయంలో ఒక ప్రతి వుందని తెలియగా దాన్ని నా మిత్రులైన శ్రీ పిశిపాటి సీతాకాంతం గారు స్వయంగా వెళ్ళి తెచ్చిపెట్టారు. దానిలో కొన్నిచోట్ల అక్షారాలు చిరిగివున్నాయి. దాని కొక ప్రతి వ్రాసుకొని దానినిబట్టి ఈపుస్తకాన్ని అచ్చువేయిస్తుండగా రాజమహేంద్రవరంలో శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి దగ్గర యింకొక ప్రతి వున్నట్లు తెలిసింది. దాన్ని నామిత్రులు శ్రీనిట్టల భవానిశంకర శాస్త్రిగారు తెచ్చిపెట్టారు. ఆప్రతినిబట్టి అచ్చుపడిన భాగాన్ని మిగతా గ్రంథాన్ని సవరణ చేశాను.

పాత ప్రతిలో వున్న వీరాస్వామయ్యగారి బొమ్మకు శ్రీ నారాయణసింగుచౌహణ్ గారు ఫోటోతీశారు. దానినిబట్టి ఆంధ్రపత్రికాధిపతులు శ్రీ శివలెంక శంభుప్రసాదు గారు బ్లాకు తయారుచేయించి యిచ్చారు. వీరాస్వామయ్యగారి యాత్రామార్గాన్ని తెలిపే దేశపటానికికూడా వారే బ్లాకు తయారుచేయించి యిచ్చారు కాశీయాత్ర చరిత్ర: తృతీయ ముద్రణం - పీఠిక

వీరాస్వామయ్యగారు జార్జి నార్టనుగారు, రాఘవచార్యులు గారు కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళెగార్ల పటములుగల ఫొటోబ్లాకును శ్రీ పచ్చయ్యప్ప కళాశాల ధర్మాధికారులు యిచ్చినారు.

ఈగ్రంధంలో చేర్చిన రాజకీయ సాంఘిక చరిత్రాంశాలు, వివరణలు, ఫుట్ నోట్సు వ్రాయడానికి అనేక పురాతన పుస్తకాలు చదవవలసివచ్చింది. మద్రాసు కనామెరాలైబ్రరీలొవున్న ఆ;పుస్తకాలను బెజవాడ రామమోహన గ్రంధాలయం ద్వారా తెప్పించుకోగలిగాను.


శ్రీ నాగళ్ళ భవానీ శంకరనాయుడుగారున్నూ, శ్రీరేకపల్లి విశ్వనాధం గారున్నూ, శ్రి మాడపాటి లక్ష్మీకాంతారావుగారున్నూ, నాగుమాస్తా శ్రీ వల్లూరు వెంకట కృష్ణారాఫున్నూ యీ పుస్తకం వ్రాత వగైరాపనిలో నాకు చాలాసహాయం చేశారు.

యుద్దంవల్ల కాగితం ధర ఎక్కువ అయినది. గ్రంధముద్రణ చాలా ధనవ్యయకారణమైంది. దీనిని అచ్చువేయడాని కీక్దింద పేర్కొన్నవారువిరాళాలుయిచ్చారు.

శ్రీ పల్లేర్లమూడి పద్దయ్యగారు, యనమదల (కృష్ణాజిల్లా) రు. 50 శ్రీ మాజేటి నాగభూషణం గారి భార్యా కనకమ్మగారు, బెజవాడ " 50 శ్రీ పాటిబండ అప్పారావుపంతులుగారు, బి.ఏ.,భ్.యల్;బెజవాడ " 50 శ్రీ తోటకూర వెంకట్రాజుగారు, తాడేపల్లిగూడెం " 50 శ్రీ బసవరాజు సూర్యనారాయణరావు పంతులుగారి కుమారుడు శ్రీ సుబ్బారావు పంతులుగారు, బెజవాడ. " 30 పైవిధంగా సహాయం చేసినవారందరికి కృతజ్ఞుడను

బెజవాడ, దిగవల్లి వేంకటశివరావు, 2-9-1941 స్ంపాదకుడు. 1830-31 వీరాస్వామయ్య గారు కన్యాకుమారి మొదలు కాశ్మీరం వరకున్నూ భారత దేశ మంతటా రెండు సార్లు తిరిగి 1830-31 మధ్య తాము చూచిన సంగతులూ తమకు తోచిన సంగతులూ దినచర్య గాను, తమ మిత్రుడైన కోమలేశ్వర పురం శ్రీనివాస పిళ్ళ గారికి జాబులు గాను వ్రాస్శారు. అనాటి భారత దేశ స్తితిగతులన్నీ అందులో వర్ణించారు. దానిలో చెన్నపట్నం చరిత్ర కూడ వుంది. దానిని శ్రీనివాస పిళ్ళగారు కాశీ యాత్ర చరిత్ర అనే పేరుతో 1838 లో ప్రకటించారు.

కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళగారు

శ్రీ కోమలేశ్వర పురం శ్రీనివాసపిళ్ళగారు గడచిన శతాబ్దంలో చెన్న పట్టణంలో వుండి ప్రజాసేవ చేసిన ఆంధ్ర ప్రముఖులు. వీరి తండ్రి పేరు మునియప్పిళ్ళ. వీరు సంపన్న గృహస్థులు. చెన్నపట్నంలో క్షామ నివారణ కోసం, 1807 లో స్థాపించిన మణేగారు సత్రానికి 11 మంది దొరలతో పాటు నియమించబడ్డ 9 మంది దేశీయ ధర్మకర్తలలో వీరొకరు; చెన్నపట్నంలో కుంపిని వారి కొలువులో పోలీసు సూపరెంటుగాను, మేస్ట్రేటుగాను, పనిచేసిన వెంబాకం రామనాచార్యులుగారొకరు. ఏనుగుల వీరాస్వామయ్యగారు, వీరు కలిసి 1833లో నందననామ సంవత్సరం కరవులో బీదలకు అన్నవస్త్రాలిచ్చి కాపాడడానికి చాల పాటుపడ్డారు.

శ్రీనివాస పిళ్ళగారు చాల ధర్మాత్ములున్నూ దూర దృష్టి కలవారున్నూ అయి విద్యాభివృద్ధికి తమ యావచ్చక్తినీ వినియోగించారు. ఈయనకు సంఘ సంస్కారమంటే ప్రీతి. వీరు ఉదారమైన భావాలు కలవారు. ఆడ పిల్లలకు విద్య నేర్పవలెననే పట్టుదల కలవారు. స్వయంగా ఒక ఆడపిల్లల పాఠశాల నడిపారు. ఈ యన ప్రజలలో అక్షరజ్ఞానము వ్యాపింప చేయవలెనని చాల కృషి చేశారు. వీరు చనిపోయే టప్పుడు విద్యాదానం కోసం 70 వేల రూపాయలు ధర్మం చేయడం వల్లనే వీరి దేశాభిమానము, విద్యా భివృద్ధి యందు వీరికి గల ఆసక్తీ వెల్లడి అవుతున్నాయి. వీరు చనిపోయిన కొన్నేండ్లకు ఆనిధిలో నుంచి హిందూ బాలికా పాఠశాల యొకటి స్థాపింప బడింది. వీరు చెంద చేసిన ధర్మ నిధిలో నుంచి పచ్చయ్యప్పకళాశాలకు అంటే మూడోపాఠశాల స్థాపింప బడింది.


జార్జినార్టన్ గారు. వెంబాకం రాఘవాచార్యులు గారు

1828 మొదలు 1853 వరకూ మద్రాసు సుప్రీ కోర్టులో అడ్వకేటు జనరలు గా వుండిన జార్జి నార్టన్ దొరగారున్నూ ఇంటర్ ప్రిటరుగా నున్న ఏనుగుల వీరాస్వామయ్య గారున్నూ, శ్రీమాన్ వంబాకం రాఘవాచార్యులు శ్రీనివాస పిళ్ళ గార్లున్నూ ముఖ్య స్నేహితులు. వీరందరూ కలిసి ఆకాలంలో గొప్ప ప్రజాసేవ చేశారు.

పచ్చయ్యప్ప గారు దాన ధర్మాలకోసం చెంద చేసిన లక్షలాది ధనాన్ని వారసులు తినివేసి కూర్చోగా పాత అడ్వకేటు జనరలైన కాంప్టన్ గారు కొత్త అడ్వకేటు జనరలైన నార్టన్ గారు వీరాస్వామయ్య గారు కష్టపడి ఆ దాన ధర్మాలను బయటికి తీసి 6. ఏనుగుల వీరాస్వామయ్యగారు; వారి మిత్రులు

నాటి పరిపాలనకోసం చెన్నపట్నం సుప్ర్రీంకోర్టులో ఒక్క స్కీము తయారుచేయిచాను. ఆ ప్రకారం 1832 లో ఏర్పాటు చేయవడిన మొదటి ధర్మకర్తల బోర్డులో శ్రీనివాస పిళ్ళె గారి నొక ధర్మకర్తగా నియమించారు. ఆ బోర్డుకు శ్రీ వెంభాకం రాఘవాచార్యులుగారు అధ్యక్షులుగావున్నారు. ఆయన 1842 లో చనిపోగా శ్రీనివాసపిళ్ళెగారే అధ్యక్షులై 1852 వారుచనిపోయేవరకు ఆపదవిలో వున్నారు. జార్జినార్టన్ గారు పేట్రన్ గా వుండి పచ్చయ్యప్పకళాశాల స్తాపనకూ అభివృద్దికీ మూల కారకులలో ఒకరైనారు.

కుంపినీ పరిపాలన ప్రజల స్థితి.

1835 వరకూ యీదేశంలో ఇంగ్రీషు విద్య స్తాపింపబడలేదు. ప్రజలలో అజ్ఞానం చాలా వ్యాపించివుంది. కుంపినీవారు కేవలం రాజ్యాక్రమణంలోను వ్యాపారం లోను పన్నుల వసూలులోను మునిగి తమ లాభమే ఆలోచించేవారు గాని ప్రజల కష్టసుఖాలను గురించి యోచించేవారుకాదు. పూర్వ గ్రామ పంచాయతీల పరిపాలన తీసివేసి కలక్టర్ల పరిపాలన స్తాపించారు. ఈ కుంపినీపరిపాలనలో ప్రజలు దరిద్రులై, విద్యలేక అగ్జానాంధకారం లోను అనారోగ్యంలోను పడి వుండడము, రాక పోకలకు రోడ్లు, పల్లపు సాగుకు సౌకర్యాలు లేకపోవడము, పన్ను లివ్వలేనివారిని హింసించడము, కలెక్టరులు నిరంకుశత్వము, అధికారుల లంచగొండితనము కోర్టుల యప్రయోజకత్వము క్రైస్తవ మతబోధకుల విజృంభణములవల్లను ఇంకా ఇతర అన్యాయాల వల్లను ప్రజలు బాధపడుతూ వుండే వారు. కొంత ఉదారబుద్ధి గలిగి విద్యాభివృద్ది చేయ దలచిన చెన్నపట్నం కాస్త మంచి ప్రయత్నం కూడా ఆగిపోయింది.

మనదేశప్రజలను ఇంగ్లీషు వారిని చూస్తేనేభయం, తమహక్కులెలాంటివో తమ కష్టాలు అవిరితో చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలోకూడా తెలియదు. వీరికి దారిచూపించే రాజకీయ నాయకులున్నూ లేరు.

హిందూ లిటరరీ సొసైటీ,

ఇలాంటి పరిస్థితులలో ప్రజలలో కొంత చైతన్యమూ విజ్ఞాన్ వికాసమూ కలిగించాలని ఏనుగుల వీరాస్వామయ్య గారు, రాఘవాచార్యులు గారు, శ్రీనివాస పిళ్ళెగారున్నూ కలిసి జార్జి నార్టనుగారి నాయకత్వం కింద చెన్నపట్నంలో హిందూలిటరరీ సొసైటీ అనే ప్రజాసంఘాన్ని స్తాపించి సభలు చేసి ఉపన్యాసాలిప్పించే గొప్ప కృషిచేశారు. ఈ సభ ఆదరణకింద దేశ చరిత్రను గురించీ, ప్రజల హక్కులను గురించీ నార్టను గారు 1833-34 మధ్యకొన్నిమహోపన్యాసాలిచ్చారు. అందువల్ల చెన్నపట్నం ప్రజలలో రాజకీయ పరిజ్ఞానం కలిగింది. ప్రజలు ఇంగ్లీషు విద్య కావలెనని కుంపినీవారిని కోరడం ప్రారంచించారు.