రంగనాథరామాయణము/సమాలోచనము

వికీసోర్స్ నుండి

సమాలోచనము

శ్రీమద్ద్రామాయణము మహాకావ్యము. ఆదికవియగు వాల్మీకి మహర్షి ప్రణీతము. ఆదికావ్యమని దీనికిఁ బేరు. “ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్" అనునదియే దీని మహిమము. ఈ గ్రంథము శతకోటి ప్రవిస్తరము. భూలోకమున నియ్యది చతుర్వింశతి సహస్ర గ్రంథముగాఁ బ్రకాశితము. గీర్వాణ వాణి నియ్యది విరాజితము. పురుషార్థ చతుష్టయప్రదము. సకల ప్రపంచముల నీ గ్రంథము వ్యాప్తమైనట్లు శ్రుతిస్మృతి ప్రసిద్దము.

ఈ మహామహిమోపేతమగు శ్రీమద్ద్రామాయణమును దేశమునఁగల సకల భాషలయందును బూర్వులగు మహాకవులు అనువదించి గీర్వాణభాష తెలియనివారి కనువుగ నుండునట్లు కావించిరి. ప్రకృతము కావించుచున్నారు. కావింతురు. “ఎంద ఱెన్ని గతులన్ వర్ణించినన్ గ్రాలదే" యన్నట్లు సంగ్రహముగఁ గొందఱు, యథా మూలముగఁ గొందఱు, వచనరూపమునఁ గొందఱు, పద్యరూపమునఁ గొందఱు, నాటకరూపమునఁ గొందఱు, యక్షగాన రూపమునఁ గొందఱు, పదముల (జంగము కథా) రూపమునఁ గొందఱు నీ మహాకావ్యమును బ్రపంచమునఁగల యన్ని భాషలలోనికి మార్చి జన్మము ధన్యతమముం గావించియున్నారు.

తెలుఁగు బాసయందు జనులకు సుసులభముగ నవగతము కావలయునని రంగనాథుఁడను కవి ద్విపదరూపమున రచించెను. ద్విపదకావ్యమునకుఁ గల పలుచఁదనమును దన కావ్యనిర్తాణమునఁ దొలఁగించెను. అతని సమకాలికుఁడగు భాస్కరుఁడు మొదలగు కవులు పద్యకావ్యముగ రచించిరి. తర్వాత ఉభయకవి మిత్రుఁడును, కవి బ్రహ్మయును నగు తిక్కన సోమయాజి నిర్వచనోత్తరరామాయణ మను పేర రంగనాథ భాస్కరాదులు తెలిఁగింపని యుత్తరకాండము తెలిఁగించెను. ఇటీవలఁ దెలుఁగు పద్యకావ్యములుగా మూలానుసరణముగా శ్రీ గోపీనాథము వేంకట కవిగారును, శ్రీ వావిలికొలను సుబ్బరాయ కవిగారును, శ్రీ కళాప్రపూర్ణ జనమంచి శేషాద్రి శర్మగారును, శ్రీ మహామహోపాధ్యాయ కళాప్రపూర్ణ శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రులు గారును వ్రాసిరి. వీరిలో యథామూలముగఁ దెలిఁగించినవారు కొందఱు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ కవిగారును తెలిఁగించినారని యిటీవల వినవచ్చుచున్నది. ఇంక నీ మహాకావ్యమును సంగ్రహముగ అయ్యలరాజు రామభద్ర కవియు, కుమ్మర మొల్లమ్మయు, కూచిమంచి తిమ్మకవి మొదలగువారు కావ్యఫక్కిలో పస్తుభేదము గనఁబడనియట్లు నడపిరి. రంగనాథుఁడు ఈ ద్విపదకావ్యమును రచించెనని తెల్పితి. ఈ విషయమున వాదోపవాదములు విరివిగా సాగుచున్నవి. ఇవి తుదకుఁ బొడవుచేతుల పందేరమను నట్లు వ్యక్తిత్వాభిమానమును బట్టి, మొగమోటమునుబట్టి వ్యాప్తిలోఁ బడుచున్నవి. కాని యిదమిత్థమ్మని నిర్వచించువారు కనంబడరు. తాఁబట్టిన కుందేటికి మూఁడేకాళ్లను నట్లుగ నధికారప్రాబల్యమువలనఁ దమ వాదమే నిర్వివాదమనుటను ప్రతిష్ఠించు చున్నారు. ఇట్టి విమర్శకాగ్రేసరులు చారిత్రిక పరిశోధకులు నందందు మిక్కుటముగ నాశ్రయించి పదవినిగాంచి యా పదవియందుఁ దమకు నెదురులే రను స్థిర బుద్ధితో లోకమును నపమార్గముఁ ద్రొక్కించి "ఘటం భింద్యాత్పటం ఛింద్యా త్కుర్వాద్వా గార్దభస్వరమ్, యేనకేనా ప్యుపాయేనప్రసిద్ధః పురుషోభవే"త్తనునట్లు తార్మాఱు గావించుచున్నారు. ఇది పలుకుబడి గడుసుఁదనమేగాని తాత్త్వికశక్తి యుక్తము గాదు. ఇట్టి చారిత్రిక శోధకులు కవులను ఈ మూలనుండి యామూలకు, నీ గ్రామము నుండి యా గ్రామమునకు, నీ పట్టణమునుండి యా పట్టణమునకు బంతులఁబోలె నెగఁ జిమ్ముచున్నారు. పాపము ! కీర్తికాయులైన వారి యాత్మలు వీరి యస్తవ్యస్త కృత్యమునకు నెంతెంత యుమ్మలించుచున్నవో ? బ్రదికియే యుండిన నింతటి ధీరత్వ మీ విమర్శకుల కుండఁ గల్గునా? దొరతనము ఈ విషయమున నూరకుండునా ? ప్రాభవమునఁ గావించు నీ వ్రాతలను లోకము సమాదరింపక యుండుట లగ్గు.

రంగనాథుఁడు రామాయణమును తాను రచించినట్లు గ్రంథమున నెందును దెల్పలేదు. లోకమునఁ బేరు వ్యాపింపవలయునన్న నిర్హేతుకముగఁ గాఁజాలదు . ఇంచుకయైన నిదానముండవలయును. గ్రామములకు, దేశములకు, ఇండ్లకు, గ్రంథములకు నామధేయములు వాస్తవతనుబట్టి యుండుట లోక ప్రసిద్ధము. మాఘము శిశుపాలవధమున కేల ? కిరాతార్జునీయమునకు భారవియననేల? మల భూపాలీ యమను పే రెట్లు వచ్చినది ? ఆనంద రంగరాట్ఛంద మని యేల యనవలయు ? ఇట్లే ఈ కృతియు ద్విపదరామాయణ మనరాదా ? రంగనాథ రామాయణమని యననేల ? ఇందలి యవతారికయందలి "భూమిఁ గవీంద్రులు బుధులనుమెచ్చ - రామాయణంబు పురాణ మార్గమున విరచింపు" మని చెప్పటయు, "మాతండ్రి విఠలక్ష్మానాధుపేర....... శ్రీరామచరిత మొప్పఁజెప్పెద" నని బుద్ధరాజు చెప్పటయు రామాయణ రచనకుఁ గారణముగా వచియింతురు. కాండాంతములయందును. “తమ తండ్రి విఠ్ఠల ధరణీశు పేర ... ... చెలువొందు రామాయణంబు" అని యున్నది. ఈ విషయమునుబట్టి చూడఁగాఁ బండితకవు లాత్మస్తుతి చేసికొనుట యాచారములేదు. కావున బుద్దరాజు తన్ను దాను నుతించికొనియుండునాయని యనుమానము కలుగక మానదు. కాని యీ సందర్భమున మల్లినాథుఁడు, ఆదికవి యగు నన్నయభటు, అల్లసాని పెద్దన మున్నగువారు తమ గ్రంథములలో నిట్లే తమ్ముతాము నుతించుకొని యున్నారని వచ్చును గాని, యా నుతికిని దీనికిని గల భేదము విద్వద్వరు లెఱింగియే యున్నారు.

ఉత్తరరామాయణ భాగమును బుద్దరాజు పుత్త్రులగు కాచభూవిభుఁడు, విఠల భూపతి యనువారు తమ తండ్రియగు బుద్ధ భూపతి యాజ్ఞానుసారముగ ద్విపద కావ్యముగనే వ్రాసిన ట్లుండుటయు గోనబుద్ధరాజే యీ గ్రంథకర్త యగుటకుఁ గారణ మని కొందఱందురు.

బుద్ధరాజు తాను రామాయణమును రచించి తన కుమారులను బిలిపించి “నాయనలారా! నేను రామాయణమును రచించితిని. మీరు నా కుమారులు. నా కీర్తివర్ధనులు. మీరు నిపుణులై రామాయణమును జెప్పుఁ డనుటయుఁ, గుమారులు మా తండ్రి ప్రతిన చెల్లింపఁ గనుట పరమధర్మంబనియు, వాల్మీకి చెప్పినజాడ తండ్రిపేరఁ జెప్పినట్లు ఉత్తర రామాయణావతారిక యందును, గాండాంతమునను గలదు.

ఈ విషయగ్రథనము వింతగఁ గన్పట్టుచున్నది. తత్త్వదర్శకుల కియ్యది సంశయాస్పద మగుటయేగాక యిది యసంభవమనియుఁ దోఁపకమానదు.

పర్యాలోచన మొనర్పఁగా గ్రంథకర్తృత్వ విషయమున నాధునికులగు సూక్ష్మదర్శులకంటెను బ్రాచీనులగు దీర్ఘదర్శుల యూహలే సమంజస మని తోఁచగలదు. ఇతిహాసము లూరక పుట్టవు. కోనబుద్ధరాజు పదుమూఁడవ శతాబ్ది వాఁడగుట చారిత్రకకారుల మతము. ఆ కాలముననే రంగనాథుఁడను ప్రసిద్ధకవియు రాజు నాస్థానమున నుండినవాఁ డనుట స్పష్టము. రాజుగారి వాంఛ ననుసరించి ద్విపదకావ్య మగురామాయణమును రంగనాథుఁడు రచించి యాశ్రితుఁడగుట రాజుపేర వెలయించెను. అట్లే వారి పుత్రులకీర్తిని వెలయింపఁదలఁచి యుత్తరకాండమును రచించి పుత్త్రులపేర నంటఁగట్టెనేకాని బుద్ధరాజుగాని, తత్పుత్త్రులుగాని యీ కావ్యరచన గావించినట్లు గన్పట్ట దనుట నిస్సంశయము. తా నున్నస్థలమునకుఁ గీర్తిప్రతిష్ఠల నాపాదించుట విజ్ఞుల లక్షణ మగుట నిట్టి యుత్కృష్టకావ్యరచనచే స్వాశ్రయపోషణము గావించినాఁడని చెప్పుటలో నేమాత్రము లోపములేదు. ఎవరి యూహలు వారు తెల్పుటలో నేవారి కేమి భాధకము గలదు ? తండ్రివ్రాసిన గ్రంథము రంగనాథనామాంకితముగా గ్రంథము వెలయుటకుఁ గారణము కుమారు లించుకయైనఁ దెలుపకయుండుట యేల? రంగనాథుఁడు తనపేరైనను, గులగోత్రము లైనను దెలుపలే దనుటలోఁ దనకుఁ బోషకులుగా నుండువారిని గొనియాడుట యుత్తమధర్మమని ధన్యత్వమొందుట తగిన కారణమనుటలో నేలోపము లేదు. బుద్ధరాజ పుత్త్రద్వయమే యుత్తరకాండము వ్రాసియున్న సంపూర్ణముగఁ బూర్వరామాయణమున కాపేరు (రంగనాథరామాయణము అనుట) కలుగుటకుఁ గారణము వచియించి యుండకపోరు. తమగుణములు తండ్రిగుణములు, తమప్రతిభలు, తండ్రిప్రతిభలు చెప్పుటలో నింత విశృంఖలత నవలంబించియుండుట పొసఁగదు. ఆశ్రితుఁడగు రంగనాథుఁడు కావించిన యీ యవ తారికలోని స్తుత్యాదికము, కాండాంతముననుండు స్తుత్యాదికము యుక్తియుక్తముగ నున్నదని చెప్పవచ్చును. గోనబుద్ధారెడ్డిపేరను, తత్పుత్త్రులపేరను రంగనాథుఁడు రామాయణము నంతను వ్రాసియే యుండినఁ "బూర్వభాగము మాత్రము ఎక్కువ వ్యాప్తిఁలోనికి వచ్చి యుత్తరభాగ మేల వ్యాప్తిలోనికి రాక నిలిచిన"దని ప్రశ్నింపవచ్చును గాని, శ్రీ మద్ద్రామాయణములోనే యుత్తరకాండము పురాణము చెప్పుటకును, బారాయణమునకును ననువుకాని దగుటయు నందు విశేషించి సీతావియోగాదిక ముండుట మనస్సున కెక్కువ యాకులత గల్గించుననుటయు, నిదర్శనములు కాఁబట్టి, లోకమున రంగనాథరామాయణము పట్టాభిషేకమువఱకుఁ గల కథాభాగము ప్రశస్తి కెక్కినది. ఉత్తరకాండభాగము పలువురు వ్రాసికొనక వదలిరి. ఆ కారణముననే ఉత్తరకాండ గల పుస్తకములు (తాళపత్రగ్రంథములు) ఆఱుకాండలు గల గ్రంథములసంఖ్య కంటె నల్పమగుటకు హేతువని యెల్లవా రంగీకరింతు రనుట నిస్సంశయము. మొత్తముమీఁద ద్విపద రామాయణము రంగనాథుఁడు రచించి తనపేర గ్రంథము వెలయుటకును, రచన గోనబుద్ధరాజు తత్పుత్త్రులు చేసినట్లు వ్రాయుటకును ఏర్పాటు చేసికొని యుండునేకాని వేఱుకాదు. లేకయున్న బుద్ధరాజు సంస్థానాధిపతిగా నుండి తత్పుత్త్రులు కొండంతవాని పుత్త్రులుగ నుండి బుద్ధరాజు రామాయణ మని వ్యాప్తి నొందింపక రంగనాథరామాయణ మని వ్యాప్తి చేయుటలోఁ దమప్రాశస్త్యమునకు లోపము కల్పించుకొందురా? తనవస్తువు నితరుని దని యుత్తమత్వముగల దాని నీనఁ గాచి నక్కలపాలు చేయున ట్లెవ్వఁడేని చేయునా? రంగనాథుఁ డన్ననో తనకుఁ బాలకులును, నన్నవస్త్రము లిచ్చి పోషించువా రగుట తనకృతిని వారు వ్రాసిరని వారిపేర వ్రాసెను. ఇది సమంజసమే. ఉప్పు పప్పు తిన్నదోష మింత చేసెను. కృతజ్ఞుని ధర్మము గదా యిది. రంగనాథుఁడే యీ రామాయణకర్త యను నాభావము నెల్లరు నామోదింతురు గాక: ఈ వ్రాఁత ప్రాభవమని యెంచరాదు. ఇది తగిన యూహ.

ఈ విషయమయి వీరేశలింగము పంతులుగారు “ఒకవేళ రంగనాథుఁడే యాఱువేల నియోగియై యుండవచ్చును. ఆఱువేల నియోగియైన కోవెల గోపరాజు రంగనాథుని నియోగి కవులలోఁ జేర్చి యీ క్రింది పద్యమునఁ జెప్పియున్నాఁడు.


అనఘు హుళక్కి భాస్కరు, మహామతిఁ బిల్లలమఱ్ఱి పెద్దిరా
జును, బినవీరరాజుఁ, గవి సోమునిఁ, దిక్కన సోమయాజిఁ, గే
తనకవి, రంగనాథు, నుచితజ్ఞుని నెఱ్ఱన, నాచిరాజు సో
మన, నమరేశ్వరుం, దలఁతు మత్కులచంద్రుల సత్కవీంద్రులన్."


అని, వ్రాసిరి. కాబట్టి రంగనాథుఁడను కవీంద్రుఁడే లేఁడనువా రీమాట కేమందురో ?

సమకాలికులును నేఁటికి వందవత్సరములు ముందుండువారును నగు మహాకవులు రంగనాథుని ఆర్వేల నియోగి బ్రాహ్మణుఁడని రంగనాథరామాయణము రచించి నాడని నుతియించిన పద్యములన్నియు నాంధ్రసాహిత్యపరిషత్పత్రికయందు నింతకుముందే ప్రకటించియున్నాఁడను. జాతిభేదములు పాటింపక గుణగ్రహణపారీణతనే పాటించు నాకాలమున నిందఱు మహాకవులు ఇట్లు పొగడుటకు గారణ మేమి యని యాలోచించిన బుద్ధిమంతులు గ్రహింపఁగలరు. "అసతి కుడ్యే చిత్రలేఖన" మన్నట్లు ఇంతమంది మహాకవులు పొఱఁబడరని రంగనాథమహాకవి ద్విపదకావ్య మన భారతకవులప్రఖ్యాతిని గోరి రచించెనని గ్రహించుట బుద్ధిమల్లక్షణము.

ఇప్పటికిని నాముక్తమాల్యద పెద్దనప్రణీత మనువాదము నెగడుచున్నది గదా? కావున నిది రంగనాథప్రణీత మనుట నిస్సంశయము. పట్టుబట్టి యిపుడు బుద్ధారెడ్డి వ్రాసెనని పాఠ్యగ్రంథములలోను, విద్యార్థులు చదువు టిప్పణముల (Notes) లోను బలవంతముతోఁ జొప్పించి సినిమాప్రదర్శనములవలన భాషకును, గథాసంవిధానములఁ బురాణములకును విభేదము పుట్టించి నీతిని, జాతిని, తెలుఁగుభాషకుఁ గల కీర్తిని మంటఁ గలుపుచున్నట్లే యిప్పటి చారిత్రకపరిశోధకులగు పదవీసిద్ధులు చేయు యత్నములని యెంచుట విజ్ఞుల లక్షణము.

ఈ గ్రంథము మొదటి ప్రతాపరుద్రుని కాలములో రచియింపఁబడినదని తెల్పుదురు. ఈ ప్రతాపరుద్రుఁడు 1200 వత్సరప్రాంతమున రాజ్యముచేసినవాఁడు. గోన బుద్ధారెడ్డి దూపాడు పరగణా కధిపతిగా నుండిన సామంతరా జందురు. బుద్ధారెడ్డి కూఁతురు కుప్పమాంబ. బూదపూరిలో శా॥ 1198కి సరియగు 1286 ధాతృవత్సరమున లింగప్రతిష్ట చేసి యనేకభూదానములు చేసినట్లు శాసనములు గలవు.

“శ్రీ గోనవంశనిజశేఖర బుద్ధయాఖ్య, పుత్త్రీ పవిత్రచరితా భరితాగుణౌఘైః,
శృంగారసారకరణిః కరణీయదక్షా, కుప్పాంబికా౽జనిచ తస్యసతీ కళత్రమ్"

అను శ్లోకమునఁ గుప్పాంబ బుద్ధరాజు కూఁతు రగుట స్పష్టమగుచున్నది. రంగనాథరామాయణరచన కాలమున కీమె పుట్టెనో లేదో యనియుఁ బదుమూఁడవశతాబ్దియందే ఈ రామాయణము రచింపఁబడినదనియు శ్రీవీరేశలింగము పంతులుగారి మతము. ఇది నిక్కమే యగును. ఇట్టి ప్రథితయశులకృతిమాత్రము పుత్త్రు లేల విశదీకరింపరు? ఇది రంగనాథకవికృతియే గాని యితరకృతము కాదు.

కవిత్వము - చమత్కృతి

ఆబాలగోపాలమున కందుబాటులో నుండునట్లును, వినినయంతనే యర్ధావబోధమగుటకును దగినది ద్విపదకావ్యము. హరిశ్చంద్ర, నల, రాజయోగసార, పరమయోగివిలాసములు, మున్నగునవి యెంతయు సరళముగ నుండి గ్రహించుటకు ననువుగ నుండుట యంద ఱెఱింగిన విషయమే, దీనికే దేశికవిత యందురు, కొంద ఱీదేశికవిత పశ్చిమాంధ్రుల కంటఁగట్టిరి, మంచిదే. హృదయంగమముగ నెల్లరయుల్లములు పల్లవింపఁజేయు నిట్టికవిత యెంతయు సన్నుతి కెక్కును. పశ్చిమాంధ్రమని దేశమును బిలుచుటలో నంత సామంజస్య మగపడదు. దత్తమండలములవారి నిట్టిపరిభాషకు గుఱిచేయుట యుచితము కాదు. త్రిలింగదేశమువా రనవచ్చును. తెలుఁగువా రన వచ్చును. క్రమక్రమముగ నిపుడు రాయలసీమవా రనవచ్చును. ఈసీమలోఁ గల గ్రంథములు, కవులు, దేశమునం దంతటను సంస్మరింపఁదగిన యాదృతిని గడించినవా రనుటలో నతిశయోక్తి లేదు. ఇం దుత్పత్తియగు వస్తువులఁ గాపట్యము లేదు. వీనికి సహజప్రభ గలదు. మెఱుగు లనవసరము.

కవి యిప్పటి కించుమించుగ నేడువందలవత్సరముల క్రిందటివాఁడే యయినను, బద్యకావ్యము తెరువునకుఁ బోక, ద్విపదకావ్యముగనే గ్రంథమును సాగించి, నవరసభరితముగ వెలయించుటలో నీమహానుభావుని ప్రతిభ యప్రతిమ మని చెప్పవలయును. సంస్కృతాంధ్రముల నసమానపాండితీవిరాజితుఁ డనుట యతిశయోక్తి కాజాలదు. గ్రంథమును జదువువారలే యీవిషయమును నిర్ణయింపఁగలరు, అగసాలి కమ్మియచ్చునఁ దీసిన బంగరుకమ్మివలె నెగుడుదిగుడులు లేక సరళముగ స్నిగ్ధగుణము గలిగి యతిశయప్రభతో రచన యున్నదని ముమ్మాటికిఁ జెప్పవలయును,

ప్రామాణికులగు కవుల పంక్తిలో నొక్కఁ డీరంగనాథుఁ డనుటకు లాక్షణికు లగు అప్పకవి మొదలగువారు తమ లక్షణగ్రంథములలో నుదాహృతములగు గ్రంథభాగములే చెప్పుచున్నవి. అందందు దుష్టసంధులు, వ్యాకృతికి లొంగని ప్రయోగములు కనఁబడుచున్నవి. రేఫశకటరేఫమైత్రి యీమహనీయున కభిమతమా యని తలంపవలసినచోట్లు కలవు. ఒక్కొక్కచోట బమ్మెర పోతన యితని ననుసరించెనా యని యనవలసిన భాగములును గలవు.

ఇందు గ్రంథాదినుండి—“ఆదినారాయణు నఖిలలోకేశు, భావించి కీర్తించి ప్రార్ధించి సేవించి, యభిమతసిద్ది గావింప"—అనువఱకుఁగల ధ్యానయోగమును జదివినచో నీగ్రంథకర్తకుఁ గల యోగాభ్యాసవిధానము సద్గురుకృపాజనితసత్పద్ధతి యెంతయు విశదము కాగలదు. ఇందు యోగశాస్రసారమంతయు నిమిడియున్న దనవలయు. గొప్పభక్తుఁ డనియు, యోగి యనియు నీతనిఁ గీర్తింపవలయు. లేక యున్న నింతటిగ్రంథమును ద్విపదగా రచించి జనరంజన మొనరించుట కనువు పడునా? ఇష్టదేవతాస్తుతిలో శారదను, వాల్మీకిని, వ్యాసమహర్షిని, శుకబ్రహ్మను మాత్రమే వినుతి చేసినాఁడు. పూర్వకవులనుగాని, తత్కాలమంధలి కవులనుగాని పేర్కొనలేదు. ఎవరిని బేర్కొనిన నేమి తనపేరు తెలియునో యని తలంచెనో - ఆత్మజ్ఞాని యగుట తనపేరు ప్రకటించుకొనుట తగదనుకొనెనో? తనప్రభువులయెడ నపచారము చేసినట్లుగా నెంచెనో? ఇదియును గాక మీఁదుమిక్కిలి తనకుఁగల ప్రభుభక్తిని బూర్ణముగా వెలయించి ధన్యుఁడైనాఁడు.

అందందు వర్ణనలు యుక్తియుక్తముగ హృదయంగమముగ ఔచిత్యముగ నున్నవి. వీని నన్నింటిని బ్రత్యేకించి యిందుదాహరింప గ్రంథవిస్తరభీతి మానితిని. పాఠకులే చదివి యానందింతురని మనవి. కవి "అసమాన లలిత శబ్దార్థ సంగతుల… భావనల్నిండ" నని తాను బూనినరీతిని గ్రంథరచన సంపూర్ణముగఁ జేసి కృతకృత్యుఁ డైనాఁడు.

గ్రంథకర్త యింతటి యుత్కృష్టగ్రంథమును ద్విపదకావ్యమునఁ బ్రథమశ్రేణి నాశ్రయింపఁదగినదానిని రచించి, తన కులగోత్రములను, స్థలాదికమును దెలుపక పోవుట తనకుఁగల ప్రభుభక్తియే ప్రధానకారణమని మాటిమాటికిఁ దలంపఁదగును. ఈ గ్రంథము పట్టణములమాట యటుండఁ, గోడిగూసిన ప్రతిగ్రామమునందును గల దనుటకును, బురాణకాలక్షేపముగ నిదియే యాదృతిపాత్రమైన దనుటకును, బొమ్మలాట లాడువారును నిందలి కథాభాగములనే శ్రావ్యముగఁ బాడుచు నభినయించి పేక్షకుల నానందరససాగరనిమగ్నులఁ గావించుచున్నారనుటకును, నీగ్రంథమునకుఁగల మహిమ నిరుపమాన మని వేఱ చెప్పవలయునా?

కవి యిందు శ్రీ మద్ద్రామాయణమున లేని, జంబుమాలివృత్తాంతము, కాలనేమి కథ, సులోచనాచరిత్రము చదువ చదువఁ బాఠకులకు, శ్రోతలకు పరవశత్వమును గలిగించుచున్న వనుటలో వింతలేదు. ఇం దాభాగ మని యీభాగ మని చెప్పఁ బనిలేక సర్వత్ర హృద్యముగ నున్నది.

ఈ గ్రంథమును సరిచూచి (ప్రాఁతతప్పుల పుస్తకమును దిద్ది) యొక పీఠిక వ్రాసి యిమ్మని కడప రాయలు అండు కో వారు కోరగా నశక్తుడ నయ్యు, నిజమాడిన నిష్ఠురము ప్రాప్తించు నని యెఱిఁగియు, నాకుఁ దోఁచిన భావములను నిశ్శంకముగా వ్రాసి యిచ్చితి. తప్పులు పండితులు మన్నింపుఁడు. గ్రంథవిషయమున నెక్కుడుగ వ్రాయవలసిన యంశము లుండియుఁ బ్రకృతము నియమితుఁడనై విరమించితి. రాఁబోవు ముద్రణమున మరలఁ గొంతయవకాశమును బట్టి విన్నవింతు. భాషాసేవకై పూనిన యీ రాయలు అండ్ కో వారి యుద్యమమునకుఁ దోడ్పాటు చూపుట తెలుఁగుదేశమువారి సత్కృతి. వీరికిని, బాఠకులకును శ్రీ రామచంద్రుఁ డాయురారోగ్యభాగ్యములఁ జేకూర్చుఁగాక!

వశంవదుఁడు

శ్రీ లలితావిలాసము

కావ్యపురాణతీర్థ, విద్వాన్,

శ్రీ శ్రీ శ్రీ