రంగనాథరామాయణము/ఆరణ్యకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీరంగనాథరామాయణము

ఆరణ్యకాండము



శ్రీచిత్రకూటమౌ చిత్రకూటమున - వాచంయమశ్రేణి వర్ణింప నుండి
యంత రాముఁడు భరతాగమనంబు - చింతించి యిచట వసింపరా దనుచు
నిచ్చట నున్న నెల్లపౌరులును - ముచ్చటపడి దినంబును వత్తు రనియు
దంతిరథాశ్వపదాతివర్గముల - నెంతయు గాసిలె నీవనం బనియు
ఖరదూషణాదిరాక్షసకోటిబాధ - పరిహరింపు మటంచుఁ బరమసంయమలు
చెంతలఁ జేరి సూచించినా రనియుఁ - జింతించి, మఱునాఁడు చిత్రకూటాద్రి
మునుల వీడ్కొని యత్రిమునియాశ్రమమున - కనురాగమున నేగ నమ్మహామౌని
తనశిష్యులును దాను దగ నెదురేగి - కొనిపోయి పలుతెఱంగులఁ బూజచేసె.
నమ్మునిపత్నియు ననసూయ ప్రీతి - నమ్మహీతనయకు నాతిథ్య మొసగి
తెఱఁగొప్పఁ గొన్నిపతివ్రతాగుణము - లెఱిఁగించి రఘురాము నెడబాయలేక10
తనబంధుజనుల నందఱ నెడబాసి - వనముల కాసీత వచ్చుట పొగడి
పిమ్మట ననసూయ ప్రీతితో దాను - నమ్మహీతనయకు నంగరాగములు
వాడనిపువ్వులు వరుసఁ దోడ్తోడ - కూడమాయనిమణుంగులు తా నొసంగి
“రమణి నిన్ను స్వయంవరమున రాఘవుఁడు - క్రమ మొప్ప గైకొన్నకథఁ జెప్ప"మనిన
జిలిబిలిసిగ్గును జిఱునవ్వుఁ దొలుకఁ - బలికె జానకి తనపతిని వీక్షించి
“వినవమ్మ మిథిలకు విభుఁడైనయట్టి - జనకుఁ డొక్కఁడె యాగశాల దున్నింపఁ
గలిగితి నే నది కారణంబునను - కలితసీతానామకమున నొప్పితిని.
అనపత్యుఁ డౌట నయ్యవనిపాలకుఁడు - దయమీఱ నన్ను మోదంబునఁ బెనిచె,
నంత యౌవనవతి యగు నన్నుఁ జూచి - చింతించి తనయింటి శివునిచాపంబు
నెక్కుపెట్టినవాని కెలమిఁ బెం పెక్క - నిక్కన్యకామణి నిత్తు నే ననుచు20
వరబుద్ధిమై స్వయంవరము చాటింప - ధరణినాయకు లెల్లఁ దా మట వచ్చి
శైలజారమణుని చాప మెత్తంగఁ - జాలక మోపెట్టఁ జాలక చనిరి.
అంత రాఘవుఁడు విశ్వామిత్రు - గొలిచి కొంతకాలంబునకును నట వచ్చి
కరి యిక్షకాండంబు ఖండించినట్లు - హరవిల్లు విఱిచి చయ్యన వరియించె"
నని తన పెండ్లివార్తను నంతఁ దాను - వినిపింప ననసూయ విని ముదమందె,
నప్పుడు రవి పశ్చిమాంబుధి మునుఁగఁ - దప్పక సాంధ్యకృత్యము లెల్లఁ దీర్చి

శ్రీరాముఁ డత్రి పూజింప సద్గోష్ఠి - నారాత్రి గడపి సంధ్యాక్రియల్ దీర్చి

శ్రీరాముఁడు దండకారణ్యమునకుఁ బోవుట

ముదమొప్ప నయ్యత్రిముని వీడుకొలుపఁ - గదలి యమ్మఱునాఁడు కమలాప్తకులుఁడు
సరళతాలతమాలసాలహింతాల - కురవకాగరువటకుటజగణ్యంబు
చండాంశునిభమౌనిజనశరణ్యంబు - గండకహర్యక్షగవయవేదండ30
గండభేరుండాదిఖగమృగోదగ్ర - దండకారణ్యంబు దరియంగఁ జొచ్చి
వేదనాదములచే విస్తారమహిమ - వేదులచేతఁ బవిత్రంబు లైన
పర్ణశాలలచేతఁ బవనాంబుజీర్ణ - పర్ణాశు లగుచుఁ దపంబు గావించు
మునులచే మిగుల సమున్నతి నొప్పు - జననుతతాపసాశ్రమములు పెక్కు
కనుఁగొంచు వారలు గావించుపూజ - లనురక్తిఁ గైకొంచు ననుజుండు దాను
నరుగుచో నాదండకారణ్యవీథి - నురుపర్వతాకారుఁ డుగ్రలోచనుఁడు
ఘనవక్త్రనాసుండు కఠినవిగ్రహుఁడు - ఘనుఁడు విరాధుఁ డన్ కడిఁదిరాక్షసుఁడు
అట్టహాసముచేసి యాకసం బొదువ - బెట్టుగా వనమెల్ల భేదిల్ల వచ్చి
గరుడుండు బాలనాగము బల్మి నొడిసి - యిరవొప్ప నద్దివి కెగయుచందమునఁ
బటుశూలముఖచంచుబాహుఁడై సీత - కుటిలకుంతల నెత్తుకొని మింటి కెగసి40
జనకజదెసఁ జూచి చాలఁ జింతించు - ఘనుల శ్రీరామలక్ష్మణుల వీక్షించి
"యోరి! వీరులవలె నోడక వచ్చి - యీరసంబునఁ జొచ్చి యే నున్న యడవి
శరచాపహస్తులై చరియింప నెంత - బిరుదులై భుజశక్తిఁ బేర్కొన్న నెంత
తల్లి శతహ్రద తండ్రి జయుండు - తొల్లి యాయుధములఁ ద్రుంగక యుండ
బ్రహ్మచే వరములు వడసినవాఁడ - బ్రాహ్మణాశనుఁడ విరాధుఁ డన్వాఁడ
నే నల్గి చూచిన నింద్రాదిసురల - నైనను మ్రింగుదు నట మర్త్యు లెంత
యీయింతి నొప్పించి యీకాన విడిచి - పోయి మీమీప్రాణములు గాచికొనుఁడు
కాదేని నాచేతి ఘనశూలహతికి - నాదట నరమి రం" డని పేర్చి పలుక
సౌమిత్రి యప్పుడు జనకజభయము-నామహారాక్షసు నదటును జూచి
"యోరి! రామునిదేవి నురుపుణ్యసాధ్వి - ధారణినందనఁ దగ దోరి! నీకుఁ50
గొనిపోవ నెక్కడఁ గొనిపోయె దింక - నినుఁ బట్టి వధియింతు నేఁడు నాకడిమి”
నని బాణసంధాన మలుకమైఁ జేసి - ఘనబాణతతుల వక్షము గాఁడనేయ
నరుదుగా వాఁ డట్టహాసంబు చేసి - కెరలుచు శూల మంకించి వేయుటయు
ఘనఘనాఘనముసంగడిఁ బాసి పిడుగు - చనుదెంచుకరణి రా జానకీవిభుఁడు
నది రెండుశరముల నలవుమైఁ ద్రుంప - బదరి వాఁ డట సీతఁ బడవైచెఁ బుడమి
నారాక్షసునిఁ బాసి యాకాశవీథి - ధారణీసుత సీత తల్లడిల్లుచును
జలదంబు నెడఁబాసి చనుదెంచుమెఱుము - చెలువునఁ జనుదేరఁ జెచ్చెఱఁ జూచి

గరుడాస్త్రమున డించెఁ గడఁగి రాఘవుఁడు - వరబాణములు పెక్కు వాఁ డేయుటయును.
నవి లెక్క సేయక యట్టహాసంబు - భువనభయంకరంబుగ బిట్టొనర్చి
కరముల రామలక్ష్మణుల నిద్దఱినిఁ - గరమర్థిఁ బట్టి రక్కసుఁ డుక్కుమీఱి60
మూపున నిడి రయంబునఁ దోవఁబట్టి - సాపుగా నడచుట జనకజ గాంచి
వాపోవ నటఁ గొంతవడి పోయి పోయి - ప్రాపితకోపులై రామలక్ష్మణులు
మెఱుఁగుఁదీఁగెలరీతి మెఱయుఖడ్గంబు - లొర లూడ్చి వానిబాహులు రెండు దునుమ
గిరి వజ్రమునఁ గూలుక్రియ దిక్కు లదుర - నురువడి నొరలుచు నుర్విపైఁ గూలి
యసువులు విడువ నయ్యసుర యుండుటయు - నసమానపదముష్టిహతుల నందంద
ముద్దగా సముద్ధతిఁ జంపి - రద్దిరా! యని మును లాశ్చర్యపడఁగ
నతఁ డంత గంధర్వుఁడై రాముఁ బొగడి - యతులవిమానంబునం దుండి పలికె,
“నేను గంధర్వుఁడ! నేను తుంబురుఁడ! - భూనాథ! మును రంభఁ బొంది కొల్వునకు
రానిగర్వ మెఱింగి రాక్షసాకృతిగ - నేను గుబేరుచే నిటు శాప మంది
నేఁడు మీభుజశక్తి నీశాపముక్తి - పోడిగాఁ గాంచితిఁ బోయెద నింక70
నిరవొప్ప నాదేహ మిటఁ బూడ్చి చనుఁడు - శరభంగమౌనియాశ్రమమున” కనుచుఁ
బోయె మ్రొక్కుచు వాఁడు; పొలుఁపొంద వాని - కాయంబు ధరఁ బూడ్చి కడుభయంబందు
ధరణీతనూభవఁ దగఁ గౌఁగిలించి - పరమసమ్మదమున భయ మెల్ల మాన్పి
తలకొన్నప్రేమతోఁ దమ్మునిఁ జూచి - "యిలమీఁదఁ గల్గునె యిట్టిదుర్గములు?
కావున వేగ మీగహనంబు దాఁటి - పోవలె మనము భూపుత్త్రిఁ దోడ్కొనుచు”
నని యంత శరభంగుఁ డనుమునిచంద్రుఁ - గనుఁగొనుతలఁపునఁ గాకుత్స్థకులుఁడు.

శ్రీరాముఁడు శరభంగాశ్రమంబుఁ జేరుట

చనుచోట నుదయార్కసంకాశ మగుచు - నొనర నమ్మునియాశ్రమోపాంతవీథి
హరితహయాకీర్ణమై సితచ్ఛత్ర - పరివృతంబై దేవభరితంబు నగుచు
నకళంకమణిరోచు లందందఁ బర్వ - నొకవిమానము గాంచె నుడువీథి నంతఁ.
గని విమానములోని కమనీయశీలుఁ - గనుఁగొనుతలఁపునఁ గదియ వచ్చుటయు80
.నది యదృశ్యం బయ్యె! నంత రాఘవుఁడు - ముదమంద శరభంగమునిఁ గాంచి మ్రొక్కి
మునిచేత దివ్యాస్త్రములు చాలఁ బడసి - యనురాగమును బొంది యతని కిట్లనియె:—
“నేము! నిన్నిటఁ జూడ నేతెంచుచోట - నోమునీశ్వరచంద్ర! యొకవిమానంబు
చదలెల్ల వెలుఁగ నిచ్చటనుండి పోయె - నది యెందులకు వచ్చె? నది యెందుఁ బోయె?
నావిమానములోని యతఁ డెవ్వఁ" డనిన - భూవరునకు మునిపుంగవుఁ డనియె!
“దేవేంద్రుఁ డాతఁడు దేవేంద్రవంద్య! - దేవ! నాకడకును దివినుండి ప్రీతి
ననిమిషులును దాను నర్థి దీపింప - నను బ్రహ్మలోకంబునకుఁ బిల్వ వచ్చె,
వచ్చిన నోమహీవరచంద్ర! నీవు - విచ్చేయు టిచ్చ భావించి నే నిపుడు

నెఱసినకడిమిమై నిన్నుఁ బూజించి - మఱి పోవువాఁడనై మది నిశ్చయించి
యంతకు రా నని యతనిఁ బొమ్మంటి - చింతించి వజ్రియు శ్రీరాము నిన్ను90
కాంతారఖిన్ను నిక్కడఁ జూడఁ గలిగె - నింతలో విచ్చేసి తినకులాధీశ!
ధరణీశ! నీప్రసాదంబునఁ దపము - నరుదార నొకవిఘ్నమైనను లేక
సలిపితి నిష్ఠలు సఫలంబు లయ్యె; - నెలకొని శ్రీరామ నినుఁ జూడఁగంటి;
ననఘ! సుతీక్షసంయమి నింక నీవు - కనుఁగొని యతనిచెంగట నుండు; మేను
బనివినియెద నింక బ్రహ్మలోకమున” - కని చెప్పి రాముసమక్షమంబునను
ననలముఖంబున నమ్మునీశ్వరుఁడు - తనమేను మంత్రపూతము చేసి వేల్చి
యెడపక యింద్రాదు లెల్లను గొలువఁ - గడునొప్పు బ్రహ్మలోకమునకుఁ బోయె,

శ్రీరాముఁడు సుతీక్ష్ణమునిని దర్శించుట

నాయాశ్రమావాసు లైనసంయములు - వాయుభక్షకులును వైఖానసులును
వాలఖిల్యులు మౌనవంతులు పర్ణ - శాలవిహీనులు స్థండిలశయులు
మననశీలు రుదాత్తమౌను లేకాంతు - లనశనవ్రతులుఁ బంచాగ్నిమధ్యగులు100
మొదలైనతాపనుల్ మూకలు గట్టి - సదయాత్ముఁ డగు రామచంద్రునిఁ జేరి
"పితృవాక్యపాలనప్రియుఁడవు సత్య - రతుఁడవు నీవు నిర్మలయశోధామ;
రామ! నీయంతటి రాజు గల్గియును - నేము రాక్షసబాధ నిటఁ గుందఁదగునె?
వ్రతము రక్షించు నృపతికిని గల్గు - నతనిపుణ్యములోన నాలవపాలు
ఈతఱి దైత్యుల నెల్ల ఖండించి - మాతపోవ్రతములు మైత్రి నిండించు
సొరిది నీశరణంబుఁ జొచ్చితి" మనిన - శరణాగతత్రాణసదయుండు గాన
నాయాశ్రమంబులయందుండు మునుల - కాయతమతి రాముఁ డభయంబు లిచ్చి
"మీయనుగ్రహమున మేటిరక్కసుల - దాయల ఖండింతు దలఁకకుఁ" డనుచు
వారి వీడ్కొని ఘోరవనసీమ కరిగి - యారూఢమతి సుతీక్ష్ణాశ్రమంబునకు
వచ్చి యామునిచంద్రు వలగొని పేరు - గ్రుచ్చి సద్భక్తి పైకొని మ్రొక్కుటయును110
వారల కెదురుగా వచ్చి సుతీక్ష్ణుఁ - డారాము దీవించి యర్థిఁ బూజించి
“యనఘాత్మ। చిత్రకూటాద్రికి నీవు - మునివృత్తి వల్కలంబులు గట్టి వచ్చు
నునికి యాకర్ణించి యుల్లంబులందుఁ - గొనకొని మీరాకఁ గోరుచుండుదుము.
నీవు విచ్చేసితి; నినుఁ జూడఁగంటి! - మేవిధంబుల నింత నేము ధన్యులము
ఆయతభుజసత్త్వు లైన రాక్షసులు - మాయాశ్రమములకు మత్తు లై వచ్చి
హోమవేదులఁ గాల్చి యూపముల్ గూల్చి - సోమపానము గ్రోలి సురలఁ బోఁదోలి.
తపములు చెఱిచి పాదములు విఱిచి - జపమాలికలు ద్రెంచి శాటికల్ చించి
ఫలములు డుల్చి పుష్పము లెల్ల రాల్చి - కొలఁకులు కలఁచి పెక్కులు గాసిచేసి
పెక్కండ్రమునులఁ జంపిరి దురాత్మకులు; - దిక్కు లే దీపాటు దీర్ప నేత్రోవ?

నేచినదనుజుల నేము కోపించి - చూచిన నీఱుగాఁ జూడ నోపుదుము120
నెలకొని మహిమీఁద నీయట్టిరాజు - గలుగుటఁ జేసి యెక్కడ నల్గ మేము;
కావున దుష్టరాక్షసుల మర్దించి - నీవు మాతపములు నిష్ఠఁ బాలింపు"
మనిన రాముఁడు “రాక్షసాధీశవరుల - ననిలోనఁ జంపెద" నని యూఱడించి
శరభంగునాశ్రమస్థలమున మునుల - కిరవొప్ప నభయంబు నిచ్చుట తెలిసి
రక్కసులను జంపఁ బ్రతినలు పలికి - యక్కడ సుఖగోష్ఠి నారాత్రి నిలిచె
మఱునాఁడు పెక్కండ్రు మౌనులు వచ్చి - మఱియును దమయాశ్రమములకుఁ బిలువ
దిననాథకులుఁడు సుతీక్ష్ణు వీడ్కొనుచు - మునులపుణ్యాశ్రమంబులు చూడఁ గోరి

సీత శ్రీరామునిఁ బ్రశ్నించుట

చనుచోట రఘురాము జానకి చూచి - “యనఘ! రాజ్యము మాని యడవికి వచ్చి
సముచితవృత్తిమై జడలును వల్క - లములు ధరించి మెలంగుచు నుఱక
యసురులదెస మీకు నలుగ నేమిటికి? - పొసఁగ వీమాటలు బుద్ధిఁ జింతింప;130
మునులతో రాక్షసముఖ్యులఁ ద్రుంతు - నని యూఱడించిన యంతనుండియును
గలఁగుచున్నది మది కాకుత్స్థతిలక! - వల దీతెఱంగులు వర్జింపవయ్య
ప్రాణులఁ జంపఁ బాపము రాదె? తొల్లి - ప్రాణేశ! యొకముని బహుతపోనిష్ఠ
నుండుచో భటరూపయుక్తుఁడై వజ్రి - యెండుఖడ్గము మౌనియొద్ద దాపుచును
ఇదె పోయివచ్చెద నే నని చనియె! - తదనంతరమున నాతఁడు ఖడ్గ మంది
యూరకుండక తీవ లొకట వృక్షముల - సారెఁ ద్రుంచుచును హింసారతుం డగుచు
జడమతియై తపశ్చర్యకుఁ బాసి - కడపట నతఁడు దుర్గతిఁ గూలెఁ గానఁ.
దప మేడ? మఱి రాజధర్మంబు లేడ? - విపులాయుధము లేడ? విడువవే దేవ!"
యనవుడు విని నవ్వి యధిపతి సీతఁ - గనుఁగొని “విప్రమార్గంబు నీపలుకు
క్షత్రమార్గము గాదు సాధ్వి; నావలని - మైత్రిఁ బల్కెదవు నామత మెఱింగియును,140
దరుణి! యుత్తమరాజధర్మైకపరులు - శరచాపములు దాల్చి చరియించు టెల్ల
శరణాగతులఁ గావఁ జర్చింపఁ గాదె? - పరికింప వె య్యేల పరమధర్మములు?
నమ్మహామునులతో నాడినప్రతిన - యిమ్మెయిఁ గావింతు నిదియె నిశ్చయము.
విడుతుఁ బ్రాణము నైన విడుతు ని న్నైన - విడుతుఁ దమ్ముని నైన విడువ నేఁ బ్రతిన"
ననిన నూరక యుండె నవనిజ యపుడు - విని లక్ష్మణుఁడు చాల విస్మయం బందె
నటమీఁద నొక్కొకయాశ్రమంబునను - బటుధర్మనిధి రామభద్రుండు ప్రీతి
మూఁడేసినెలలు నిమ్ముల నాల్గునెలలు - పోడిగా నిలుచుచుఁ బుణ్యాశ్రమముల

మందకర్ణి వృత్తాంతము

ధీయు క్తిఁ జూచుచు తెరువున యోజ - నాయతంబైన మహాతటాకంబుఁ

గని గీతవాద్యమంగళనినాదములు - దనర నయ్యుదకమధ్యమున మించుటయుఁ
గడుఁ జోద్యపడి తటాకము చేరి దానిఁ - గడుధర్మరతుఁడు తాఁ గని మ్రొక్కి పలికె.150
"నిది యేమి మునినాథ! యీతటాకంబు - నుదకంబులో ఘోష ముబ్బుచున్నదియుఁ
గడుఁ జిత్ర" మనుఁడు రాఘవుఁ జూచి పలికె - నడరెడువేడుక నాధర్మరతుఁడు
“కదలక మును మందకర్ణి యన్ మౌని - యుదకమధ్యంబున నురునిష్ఠ నిలిచి
యెనసినమహిమ ననేకవర్షములు - తనియక యత్యుగ్రతప మాచరింప
నాతపంబునకు నింద్రాదిదేవతలు - భీతిల్లి మునిపతి పెంపెల్లఁ గలఁగ
నమ్మునికడ కేవు రప్సరస్త్రీల - నిమ్ములఁ బుత్తేర నేతెంచి వార
లతనికి భార్యలై యంబుమధ్యమున - నతఁడు నిర్మించిన హైమసౌధముల
మునినాథుముందఱ ముదమొప్ప నిలిచి - యనురక్తి వా రిప్పు డాడుచున్నార
లదిగాన గొలను పంచాప్సరం బయ్యె - నిది వారి బహువాద్యహృద్యశబ్దములు”
అనవుడు విని రాముఁ డతిభక్తితోడ - ఘనపుణ్యుఁ డగు మందకర్ణికి మ్రొక్కి160
మఱియు మహాటవిమార్గంబునందు - నెఱసినకడిమిమై నెఱి నేగునపుడు
మునులకు మ్రొక్కుచు మును లున్నపుణ్య - వనులకుఁ జొక్కుచు వనజకహ్లార
సరసులఁ దేలుచు సత్కథాలాప - సరసుల నేలుచుఁ జల్లనిగాలి
రాకలఁ బొగడుచు రణితఝల్లికల - జోకలఁ దెగడుచు శుకమయూరాది
ఖగములఁ బట్టుచుఁ గరివరాహాది- మృగములఁ గొట్టుచు మేఘాస్త్ర మేసి
తపములు నడపుచుఁ దముఁ జూచువారి - భవములు నడపుచు పరువంపులతల
పువ్వులు చిదుముచుఁ బొదలుతుమ్మెదల - నవ్వలఁ గదుముచు నభమంటఁ దాఁకు
శైలంబు లెక్కుచు జానకి యలయ - మేలంబు దక్కుచు మృదురీతి గుహల
మెల్లనె దార్పుచు మెలఁతకు నెక్కు - డల్లన నేర్పుచు నచటిచెంచెతల
బీరముల్ మెచ్చుచు భేదింపరాని - యీరముల్ చొచ్చుచు నినరశ్మి లేని170
కోనలఁ గానలఁ గ్రుమ్మరు చట్లు - జానకి తాను లక్ష్మణుఁడు కొన్నేండ్లు
పుణ్యతీర్థంబులు పుణ్యవాహినులు - పుణ్యతపోవనభూములఁ గలయఁ
దిరుగుచుఁ బదియేండ్లు దీరినపిదప - మరలి సుతీక్ష్ణాశ్రమమునకు మఱియు
వచ్చి యమ్మునిచంద్రువద్దఁ గొన్నాళ్లు - మచ్చిక నుండి రామక్షితీశ్వరుఁడు.

అగస్త్యులఁ గాంచుట

ఒకనాఁడు ఘను నగస్త్యునిఁ జూడఁగోరి - యకళంకభక్తి సంయమికి నిట్లనియె.
"నెందు నగస్త్యమునీశ్వరుఁ డుండు - నందునెందొక్కొ తదాశ్రమభూమి?
తెలుపవే" యనిన సుతీక్ష్ణుండు గుఱుతు - లలవడఁ దన్మార్గ మంతయుఁ దెలిపి
దీవించి యనుప గాదిలితమ్ముతోడ - దేవితో దక్షిణదిక్కుకై నడచి
చనిచని నాల్గుయోజనములు దాఁటి - వనముల ఘనశైలవాహినుల్ పెక్కు

గనుఁగొంచు నరిగి యగస్త్యానుజన్ము - ననఘాశ్రమంబున కరిగి సంప్రీతి180
నాయతీశ్వరచంద్రునడుగుల కెరఁగి - యాయాశ్రమంబున నారాత్రి నిలిచి
మునితోడ సుఖగోష్ఠి మొగిఁ జేయుచుండి - యినకులాధీశ్వరుం డిట్లని పలికె.

అగస్త్యముని మహిమ

"నియ్యగస్త్యమహామునీశుండు దొల్లి - యియ్యెడ వాతాపి నెబ్భంగిఁ జంపె"
ననిన నమ్మునిచంద్రుఁ డారామచంద్రుఁ - గనుగొని యాపుణ్యకథ చెప్పఁదొణఁగె,
“నురుతాపి వాతాపియును నిల్వలుండు - ధరణిపై నిరువు రుద్దండరాక్షసులు
గల రందు వాతాపి ఘనమేషమూర్తి - యిల్వలుండును నొక్కబుషియు నై నిలిచి
యిచ్చటఁ బెనుత్రోవ కెదురేగి మిగుల - దచ్చనఁ దమయింటఁ దద్దినం బనుచు
మునులను నియమించి ముదమొప్పఁ దెచ్చి - యెనయంగ మేషంబు నేర్పడఁ జంపి
ప్రీతిఁ గూరలు చేసి పెట్టి భుజింప - వాతాపి రమ్మని వడిఁ జేరఁ జీరఁ
దడయక యపుడు వాతాపి యమ్మునుల - కడుపులు వ్రచ్చి యగ్గలికతో వెడల190
నీవిధి మునుల ననేకులఁ జంపి - రావికృతాకారు లడరి యందుండుఁ
గొనికొని యొకనాఁడు కుంభసంభవుఁడు - చనుదేరఁ గపటభోజన మొప్పఁబెట్ట
వాతాపిఁ బిల్వ నిల్వలుఁ జూచి నగుచు - “వాతాపి యెందుండి వచ్చు జీర్ణించె"
నని యగస్త్యుఁడు పల్క నాయిల్వలుండు - కనలి కర్కసుఁ డయి కదియవచ్చుటయుఁ
గలశసంభవుఁడు హుంకారమాత్రమున - బలియు నిల్వలుఁ జూచి భస్మీకరించి
మునులకు నెల్లఁ బ్రమోదంబు చేసె - విను మదియును గాక వింధ్యం బణంచె
సరిగాఁగ దక్షిణాశాస్థలి నిలిచె - నరుదుగా నంబుధి నాపోశనించెం
బెనుబాముగాఁగ శపించె నానహుషు - మునిమాత్రుఁడే పుణ్యమూర్తి కుంభజుఁడు
మునివేషమున నున్న ముక్కంటి గాక" - యన విని రఘురాముఁ డానంద మంది
మఱునాఁడు మునిపతి మార్గంబుఁ జూప - తెఱఁగొప్పఁ బూజించి దీవింప వెడలి200
చనిచని యొక్కయోజన ముత్తరించి - పనసదాడిమశమీబదరికాశ్వత్థ
పాలప్రియాళురసాలతమాల - మాలూరఖర్జూరమందారతరుల
తరులఁ గ్రిక్కిరిసిన తావిక్రొవ్విరుల - విరులతేనియ లాని వెలయుతుమ్మెదల
మెదలు నింపగునట్టిమేటిపూపొదలఁ - బొదలలోఁ బగలేక పొదలు మృగముల
కలకంఠకలకుహూకారనాదముల - విలసిల్లు బహుళాస్త్రవేదనాదములఁ
జెలఁగుచుఁ గిన్నరసిద్ధగానముల - కలిమి దీపించు నగస్త్యునాశ్రమము
గనుఁగవ విందుగాఁ గాంచి యం దొక్క - మునిచేతఁ దమరాక ముని కెఱిఁగించి
చని చొచ్చి యమ్మునిచరణపద్మముల - కనురాగమున మ్రొక్క నక్కునఁ జేర్చి
దీవించి వేవేలుతెఱఁగుల భక్తి - భావించి సంతుష్టిపరులఁ గావించి
“యోరామ! శుభనామ! యుత్పలశ్యామ! - క్రూరదానవభీమ! గుణధామ! నీవు210

మునులభాగ్యంబున మునివృత్తి మోచి - వనమునఁ దపసివై వర్తింప వచ్చి
యరుదారఁ జిత్రకూటాద్రి కేతెంచి - వరమతి నొక్కసంవత్సరం బుండి
శరభంగమౌనియాశ్రమము కేతెంచి - శరణు చొచ్చిన మునీశ్వరులను గాచి
దనుజులఁ జంపెదఁ దలఁకకుఁ డింక - నని ప్రీతి మునులకు నభయంబు లిచ్చి
కరుణించి తని విని కాకుత్స్థతిలక - పరమసంతోషసంపన్నుఁడ నైతి”
యర్థిఁ బూజించి యతులదివ్యాస్త్ర - ఘనశస్త్రకోదండకవచాదు లిచ్చె
నిచ్చినఁ గైకొని యినకులాధీశుఁ - డచ్చట సుఖగోష్ఠి నారాత్రి నిలిచె,
ఘటసంభవుఁడు భావికార్య మూహించి - పటుతరవాక్యుఁడై పలికె నిట్లనుచు.

గోదావరీతీరమున శ్రీరాముఁడు నివసించుట - జటాయువుతో మైత్రి

"శ్రీరామ! గోదావరీసరిత్పుణ్య - వారిశీతలగంధవాహకుమార!
ఘటితనర్తనవనాంగణలతాతటికి - జటికృతపూజ ధూర్జటికి నాపంచ220
వటికిఁ బొ" మ్మన రఘువంశుఁ డచ్చటికి - ఘటసూతి వీడ్కొని కదలిపోవుచును,
నడుత్రోవ నొకపక్షినాథుని ఱెక్క - లుడివోని కులగిరులో యని చాలఁ
గని దైత్యుఁ డనుబుద్ధి గదసి నీ వెవ్వఁ - డనుటయు ముదమంది యాపక్షి పలికె.
“గరుడాగ్రజాతుండు కశ్యపతనయుఁ - డరుణసారథి యైన యరుణుండు ఘనుఁడు
మాతండ్రి మఱియు సంపాతి మాయన్న - మీతండ్రిసఖుఁడ సుమీ! యేను రామ!
యితరుండఁ గాను మీహితకార్యపరుఁడ - నతులసాహసుఁడ జటాయు వన్వాఁడ.
నీవనంబును నసురేంద్రసేవితము - గావున వైదేహి గావుఁ దేమఱక”
ననవుడు శ్రీరాముఁ డట్లుగా నతని - మనమున యోజించి మైత్రిఁ బూజించి,
యటఁ బంచవటి కేగి యందున్నమునులఁ - బటుతపోధనుల సంభావించి మ్రొక్కి
కరమర్థి వారు సత్కారముల్ సేయ - ధరణీతనయఁ జూచి తమ్మునిఁ జూచి230
పొలుపొంద నెందును బుణ్యాశ్రమములు - గలయఁ బెక్కులు పొడగందుముకాక
యీగౌతమీగంగ యీసరోవరము - లీగిరు లీతరు లీయాశ్రమములు
ఎందును బొడగంటిమే యిటఁ గ్రింద - నిందుండెదము మన కింపొందు ననుచు
నానందమును బొంది యందున్నమునుల - యానతిఁ గైకొని యాప్రొద్దె కదలి
తాను లక్ష్మణుఁడును దగుపర్ణశాల - యూనిన క్రమముతో నొప్పారఁ గట్టి
తమ్ముఁడు దానును దానిఁ బూజించి - యమ్మహీసుతఁ గూడి యనురాగ మెసఁగ
నాపర్ణశాలలో నం దాఱునెలలు - దీపించి పేర్మి వర్తించుచునుండె

హేమంతవర్ణనము

అంత నీహారధరాక్రాంతదశది - శాంతమై హేమంత మవనిఁ బర్వుటయు
వేకువ నొకనాఁడు వెలఁదియుఁ దాను - తేకువ గౌతమిఁ దీర్థ మాడంగఁ
జనుచు రాముఁడు మైత్రి సౌమిత్రిఁ జూచి - కనుఁగొంటివే శీతకాలంబు మహిమ240

దిశ లెల్లఁ జలికి భీతిలి వెలిపట్టు - ముసుకు పెట్టినయట్లు ముంచె హిమంబు,
హేమంత మనుమేఘ మెల్లెడ నిండి - వామిగా వడగండ్లు వర్షించె ననఁగఁ
గురిసిన పెనుమంచు కుంభిని నెల్ల - నెరసి యొప్పారె ఘనీభవించుచును
ఉర్విపై నామంచు నొక్కొక్కచోట - దూర్వాంకురంబుల తుదలఁ జూచితివె?
పచ్చమిన్నసలాక పౌఁజుపై వేడ్కఁ - గుచ్చిన ముత్యాలక్రోవలై యొప్పెఁ
గాముసమ్మోహనకాండంబు లనఁగఁ - హైమయుగ్వాయువు లలతిమై సోఁక
వెఱపున వణఁకెడు విరహిణు లనఁగఁ - దెఱఁగొప్పఁ గదలు పూఁదీఁగె వీక్షింపు;
మంచున జారు తామరలకన్నీరు - ముంచినవిరహుల మోములఁ గేరు
పొదిగొన్న యకరువుల్ పొట్టుగా మీఁదఁ - గదలు తేటులపొగల్ గా చలికొన్న
కొలనుదేవతలకుఁ గుంపట్లఁ బోలె - విలసిల్లు కెందమ్మివిరులఁ జూచితివె?250
యడవియేనుఁగులు నీరాస నీనదికిఁ - దుడిఁ దుడి వచ్చి తత్తోయంబు దొడరి
అడరి గిఱ్ఱనుచు దండములు వేవేగ - ముడిచి పాఱెడిని తమ్ముఁడ విలోకింపు!
ఇట్టికాలంబున నే నున్నయట్ల - పట్టంబు నామీఁది భక్తిమై మాని
నారచీరలు జడల్ నవతమైఁ దాల్చి - నారాకఁ గోరుచు నమ్మహాఘనుఁడు
పరమపావనుఁడు సౌభ్రాత్రభావనుఁడు - వరపితృవాక్యమద్వాక్యతత్పరుఁడు
చిరకీర్తినిరతుఁ డాశ్రితలాభరతుఁడు - భరతుఁ డుషఃకాలపరిచితి నెట్లు
స్నానంబు సేయునో సరయువులోన? మౌనియై యెట్లొకో మహిఁ బవ్వళించు?
నాతండ్రి సత్యంబు నాపూన్కి యతని - చేత నింతయుఁ బ్రకాశించె లోకముల;
నేతల్లిపనుపున నెల్లసంయముల - చేత దీవెనలు గాంచితి నీడ నేను
అట్టికైకను నొవ్వనాఁడునో తెలియ? - దట్టేల కావించు ననఘాత్ముఁ డతఁడు;260
ఫట్టంబు దొలఁగి తాపసి నైతి నేను - బట్టంబు గలిగి తాపసి యయ్యె నతఁడు;
అన్నదమ్ములపాడి యాపుణ్యుఁ జూచి - యెన్న నెవ్వరికైన నిఁక నేర్వవలయు
నట్టియాభరతుని ననుఁగుఁదల్లులను - చుట్టాల నెన్నఁడు చూతుమో మనము?
అని వారిఁ దలఁచుచు ననివారితముగఁ - దనివార నిష్ఠ గౌతమివారిఁ గ్రుంకి
యినునకు నర్ఘ్యంబు లెత్తి గాయత్రి - పనుపున జపియించి బ్రహ్మయజ్ఞంబు
తమ్ముఁడు దాను సీతయుఁ బర్ణశాల - కిమ్మెయిఁ జనుదెంచి హితగోష్ఠి నుండె.

సౌమిత్రి ఖడ్గముఁ గొనుట

నొకనాఁడు లక్ష్మణుం డుదయకాలమున - నకళంకచిత్తుఁడై యన్నకు మ్రొక్కి
కందమూలఫలాదికములు దెచ్చుటకు - నందంద వనముల నరయుచు నరిగి
యున్నతం బగుచున్న నొకగిరిఁ గాంచి - మిన్నక యచ్చోట మెలఁగుచున్నంత
మహియెల్ల దేదీప్యమానమై వెలుఁగ - నహిమాంశుకల్పితం బగు ఖడ్గ మొకటి270
భీషణజలదగంభీరఘోషములు - ఘోషించుచును వచ్చి "కో" యని పలికె.

“నందుకొ మ్మింక దైత్యాధీశతనయ; - పొందుఁగా నీతపంబునకును మెచ్చి
భానుండు పనిచె నీపగిదిగ నన్ను - మానక కొను”మన్న మఱి వాఁడు పలికె.
"మెల్లనే తా వచ్చి మెచ్చి నా కీక - యెల్లపోకలు చేసె నొల్లఁబో నిన్ను
నలఘుతపం బెల్ల నవనిపైఁ గలిసె - వలసినకడ కేగు వనజాప్తుహేతి"
యని పల్కి తొల్లిటి యచలసమాధిఁ - దనరంగ నుండె నంతట లక్ష్మణుండు
విపులాద్భుతం బంది వెసఁ దానిఁ జూచి - యుపమతో డగ్గరి యొడిసి చేపట్టి
నిపుణుఁడై పరికించి నృపకుమారుండు - తపసుల కెల్ల నాధారమైనట్టి
ఫలవృక్షములు ద్రుంపఁ బాడిగా దనుచుఁ - గలయఁ గ్రుమ్మరుచు నగ్గలికమై నచట
భావించి భావించి బాగొప్పఁ జూచి - భావంబునందును బ్రమదంబుఁ గొనుచు280
నీఖడ్గ మిందుండ నేమి కారణమొ? - యీఖడ్గ మిచ్చటి కేల వచ్చినదొ?
యని యని ఖడ్గంబు నాదృతిఁ జూచి - పనిగొని దానిఁ జేపట్టుచు మఱియు
విలసిల్లు నొకగొప్పవెదురుజొంపంబు - మలసి ఖండింపఁ దన్మధ్యభాగమునఁ
దెగి యొకమౌని మేదిని గూలుటయును - నిగిడెడుమూర్ఛ మునింగి సౌమిత్రి
యటఁ గొంతసేపున కల్లనఁ దెలిసి - కటకటా! సకలలోకములు నిందింప
బ్రాహ్మణుఁ జంపితిఁ బరికింపలేక - బ్రహ్మహత్యాదోషభరితుండ నైతి!
నే నేల వచ్చితి నింతదవ్వులకు? - నే నేల యీఖడ్గ మిట్లు గైకొంటి?
ననుపమధర్మాత్ముఁ డగురామచంద్రు - ననుజుండ నగు నాకు నధికపాపంబు
సమకూరె; నీమునీశ్వరుఁ డెవ్వఁ డొక్కొ? - సమయఁజేసితి నింక జానకీవిభుఁడు
విని నన్ను నే మని విడనాడునొక్కొ?- పెనుపేది మునులు శపింతురో పట్టి290
చెప్పకుండఁగ రాదు చెప్పక పోదు - తప్పెఁ గార్యముత్రోవ దైవమా యనుచు
నడలుచు నల్లన నడుగులు వణఁక - సుడివడి బ్రమయుచుఁ జొప్పుఁ దప్పుచును,
నడతెంచి దశరథునకు గురుభక్తుఁ - బడనేసి చంపిన పాపంబు వచ్చెఁ;
దండ్రికి వలెనె నందనునకు వచ్చె - నండ్రు భూపతు లెల్ల నని తల్లడిలుచుఁ
దమయన్నఁ జేరి గద్గదకంఠుఁ డగుచుఁ - గ్రమ మేది వగచుచుఁ గడఁగి మ్రొక్కుటయు
ననుజుని నెత్తి యొయ్యన గారవించి - కనుఁగవఁగన్నీరు గ్రక్కునఁ దుడిచి
యనుకంప మదిఁ బర్వ ననియె రాఘవుఁడు -"అనఘః! యేఁ గలుగ నీ కడల నేమిటికి?
ధర్మవర్తనుఁడవు దానశూరుఁడవు - నిర్మలాత్మకుఁడవు నీతిమంతుఁడవు
దశరథక్ష్మాపాలతనయ! మాన్యుఁడవు - పశుపతివిక్రమప్రకటశౌర్యుఁడవు,
అన్న! నీముఖ మేల యటు చిన్నవోయె? - నున్నది యేర్పడ నొగిఁ జెప్పు" మనిన300
జయశాలి యైన లక్ష్మణుఁ డిట్టు లనియె - "భయనివారణ! నీదుపంపునఁ బోయి
వనమూలఫలములు వలయునన్నియును - గొని యేను మెలఁగుచోఁ గ్రూరఖడ్గంబు
నొక్కటి మింట రా నొడిసి చేపట్టి - వెక్కసం బగు నొక్కవెదురుజొంపంబు

నఱికితి దాన నున్నతుఁ డొక్కమౌని - యొఱలుచు ధరఁ గూలె నుగ్రుఁడో యనఁగ,
నానేరమికిఁ గుంది నరనాథచంద్ర - రానేరకుండియు రానేరవలసె;”
ననవుడు రఘురాముఁ డాశ్చర్య మంది - యొనర కార్యము మది నూహించుచుండె.
నంత నక్కడిమును లందఱుఁ గూడి - యెంతయు నత్తెఱం గెఱిఁగింత మనుచుఁ
జనుదెంచి రఘురామచంద్రు దీవించి - ఘనతరమృదువాక్యగరిమ నిట్లనిరి.
‘‘అఖిలేశ! వినుము నీయనుజన్ముఁ డిప్పు - డఖిలలోకద్రోహి యైనరావణుని
చెలియలికొడు కగు జృంభుని నేఁడు - తులువను నిర్జించె; దోషంబు లేదు;310
మును లెల్ల సంతసంబును బొంది రధిప!" - అనవుడు రఘురాముఁ డనియెఁ మౌనులకు.
“నేవేల్పుఁ గూర్చి వాఁ డిట్టితపంబు - గావించె? ఖడ్గ మెక్కడనుండి వచ్చె?
చీటికి మాటికిఁ జెడుదురే బుధులు? - నాటికి హతుఁడుగా నజుఁ డేల వ్రాసె?
నెంతకాలము చేసె నీయుగ్రతపము? - సంతుష్టుఁ డయ్యెనే సరసిజాప్తుండు?
అంతయు నెఱిఁగింపుఁ" డనిన నాభూమి - కాంతునితో మునిగ్రామణు లనిరి.
"తొల్లి దశాస్యుండు దోర్బలశక్తి - నెల్లదిక్కులు గెల్వ నెచ్చోట మదిని
సొరిది నమ్మఁగలేక సోదరిమగని - నురుపరాక్రముని విద్యుజ్జిహ్వుఁ బిలిచి
మన్నించి లంక యేమఱకుమీ యనుచు - సన్నుతి గావించి చనియె నంతటను;
ఏను మాయలు నేర్చి యేదశకంఠు - రానీను; లంకాపురంబుఁ గైకొందు"
ననుచు విద్యుజ్జిహ్వుఁ డపుడు పాతాళ - మున కేగి రాక్షసముఖ్యులదండ320
పాయక వారిచే బహుళంబు లైన మాయలు నేర్చుచు మదవృత్తినుండి
అచ్చట రావణుం డఖిలదిక్పతుల - విచ్చలవిడి గెల్చి వెస లంకఁ జొచ్చి
ఘనత విద్యుజ్జిహ్వు కథలెల్లఁ దెలిసి - కనుఁగవలను నిప్పుకణములు రాల,
“నాయాజ్ఞ నుండక నలి రేగి వీఁడు - పోయి మాయలు నేర్వఁ బోలుఁ గా కేమి?
మాయ లన్నియు నేఁడు మాయమై పోవఁ - జేయుదు" ననుచు నజేయుఁడై యరిగి
అస్మయనగరవాసాసురుల్ బెగడ - విస్మయకోపుఁడై వెస హేతిఁ బెఱికి
మఱఁది నాచెలియలిమగఁ డీతఁ డనక - తఱిమి విద్యుజ్జిహ్వు తలఁ ద్రెళ్ల నేసి
క్రమణ వేగ లంకకు నేగుదెంచి - ర మ్మని చెలియ శూర్పణఖ నూరార్చి
యనియె “నీ విచ్ఛావిహారిణి వగుచు - మనమున నీకు సమ్మత మైన పురుషుఁ
బొందుము; వెఱవక పూని లోకముల - యందుఁ జరింపు పొ" మ్మనిన నార్నెలల330

మునులు జంబుని తపఃప్రభావంబు దెల్పుట

గర్భిణియై యున్నకతనఁ బైనెలలు - నిర్భరగతి నుండి నెలఁతుక గాంచెఁ;
జటులోగ్రబలుఁ డైన జంబుకుమారు - నట వాఁడు పెద్దయై యాతల్లిచేతఁ
దనజనకునిచావు తప్పక దెలియ - విని తండ్రిపగ దీర్ప వెరవుఁ జింతించి
"బ్రహ్మను గూర్చి తపంబుఁ జేసినను - బ్రహ్మ వరం బీఁడు భవువిఁ గోరినను

అతఁడు భక్తుఁడు గాన నలుగఁ డాతనికి - నతులితగతి విష్ణు నర్థింతు నేని
చాల నాతఁడు మెచ్చి చనుదెంచి వరము - పాలించు టెపుడు? నాపగ దీరు టెపుడు?
అరయఁ ద్రిమూర్తుల హరిహరబ్రహ్మ - లరవిందహితరూప మై యుండు నండ్రు.
కావున రవిఁగూర్చి కడునిష్ఠఁ దపము - గావించి మెప్పించి కదనరంగమున
దనుజనాయకుఁ డైన దశకంఠుఁ ద్రుంతు"- నని యెంచి తపము సేయఁగఁ బూనునంత,
వనరుహాప్తుఁడు మెచ్చి వరఖడ్గ మొకటి - పనిచె దానవునకుఁ బగ దీఱుటకును,340
దానిఁ గైకొనఁడయ్యె దర్పాంధుఁ డగుట - నానిమిత్తమున నీయనుజున కబ్బె
నాహేతి యటుగాక యసురచేఁ బడిన - సాహసంబున నేఁచు జగము లన్నియును
దైవకృతంబున దైత్యుండు మడిసె - నీవిచారం బేల? యినవంశతిలక!
కలన రావణుఁ గెల్చెఁ గార్తవీర్యుండు - చలమొప్ప నాతనిఁ జంపె భార్గవుఁడు;
నట్టి భార్గవరాము ననిలోనఁ బట్టి - కొట్టితి బీరంబు క్రొవ్వును నణఁగ
నట్టినీచే రావణాదిరాక్షసులు - గట్టిగా దురమునఁ గడతేరఁగలరు "
అనవుడు రఘురాముఁ డాశ్చర్య మంది - వినతుఁడై మౌనుల వేడ్కతో ననిచె

శూర్పణఖ కుమారుని గూర్చి శోకించుట

నంత శూర్పణఖ నిత్యము దెచ్చినట్లు - వింతిగా నన్నంబు వివిధభక్ష్యములు
పొసఁగ నించిన బోనపుటికె చేఁ బూని - వెస వచ్చి తునిసిన వెదురుజొంపంబు
నడుమ ఖండంబులై నలిఁ బడియున్న - కొడుకుఁ గనుంగొని కుంభిని వ్రాలి350
తెలిసి యత్తునుకలు దృఢముగాఁ గూర్చి - పలవించి పలవించి పణఁతి యిట్లనియె.
“నోకుమారకచంద్ర! యుచితమే నన్నుఁ - గైకొన వది యేమి కన్నులు దెఱచి
తగుమామ యనక ప్రతాపలంకేంద్రుఁ - డగు రావణునిఁ జంప నాత్మఁ గోరినను
నీ కొనఁగూడునే? నేరవై తకట - యాకార్తవీర్యుచే నణఁగెనే యతఁడు?
అనరణ్యుశాపాగ్ని నణఁగెనే యతఁడు? - వనజసంభవుచాపవహ్నిచేఁ దెగెనె?
నలకూబరునిచేత నడఁగెనే యతఁడు? - అల నందికోపానలార్చులఁ బడెనె?
శాండిల్యమౌనిరోషంబునఁ జెడెనె? - యొండేల? ధననాథుఁ డుండెనే లంకఁ?
బగ వల దన్న నాపల్కుఁ గైకొనక - తెగితి రావణుఁ డేలఁ దెగును నీచేత?
ధర్మదేవతమాట తల్లిమా టండ్రు - నిర్మలాత్మక విన నేరవై తకట!
తపము పండె ననంగఁ దగ నీకు బుద్ధి - గపటించె దైవంబు కత లేల యింక?"360
నని యని శోకించి యక్కుమారకునిఁ - గనుఁగొని యగ్నిసంస్కారంబు చేసి
యనతిదూరంబున నచలసమాధిఁ - దనరుచు నున్న పెద్దలఁ జేరఁబోయి
“యోరి! కన్నులు మూసి యుడుగక నిష్ఠ - ఘోరతపంబు గైకొని సేయురీతిఁ
దలను మోపెడుజడల్ ధరియించి బూది - యలఁది జన్నంబున నందఱుఁ గూడి
తొలఁగక మేఁకపోతులమెడల్ విఱిచి - పొలుపార నుడికించి పొట్టల నిండ

నెట్టన నమలి యెండినకళాసములు - గట్టి యేమియు నెఱుంగనియట్ల యుండి
కొవ్వి నాశిశువును గుమతులై పట్టి - యెవ్విధిఁ జంపితి రెఱిఁగింపకున్న
దాపసాధములార! తాపంబు దీర - వేపట్టి మ్రింగుదు విడువక మిము"
నని యహహారావ మడర డగ్గరిన - మును లెల్ల భీతిల్లి ముదిత కిట్లనిరి.
“విను శూర్పణఖ! మునివేషుఁ డొక్కరుఁడు - చనుదెంచి నీపుత్రు సమయంగఁ జేసి370
ఫలములు గొని యల్ల పర్ణశాలకును - జలియింప కేగి యచ్చట నున్నవాఁడు
ముక్కు మో మేర్పడ మునికార్యమునకు - దిక్కు గల్గితి గాన తెఱవ యం దరుగు"
మని చూపి చెప్పిన నాదుష్టబుద్ధి - కనలుచు నపుడు లక్ష్మణుఁడు చన్నట్టి
యడుగులచొప్పున నరుగ నమ్మనులు - పొడమినభీతిచేఁ “బులి నాకి విడిచెఁ
దప్పక దీనికిఁ దగినట్టి బుద్ధి - చెప్పి పంపుదు రింక చెలఁగి రాఘవులు
నాదట సకలదైత్యక్షయంబునకు - నాదికారణ మిది" యని ముదమంద
నత్తటి దరిలేచి యసురేంద్రుచెలియ - లుత్తుంగనాసియు నుగ్రభావంబు
గురువిలోచనములు కోఱదౌడలును - పఱ పైన కడుపును బల్లవెండ్రుకలు
తెఱనోరు కరిమేను దీర్ఘజిహ్వయును - విఱి వైనరూపును విషమదృష్టియును
నరుదార ధరియించి యాడురూపమున - గర ముగ్రముగ వచ్చుగరళమో యనఁగ380
నొడిసి లోకము లెల్ల నొగి మ్రింగఁ జాలి - పొడమిన నొకమహాభూతమో యనఁగ
దఱి వేచి దైత్యసంతతినాశకాల - మెఱిఁగి భూస్థలిఁ దోఁచు మృత్యువో యనఁగ
నడచుచు వెస శూర్పణఖ యనునాతి - కడఁకతో రాముడగ్గఱ జేరఁబోయి

శూర్పణఖ రామునిఁ జూచి మోహించుట

యిందీవరశ్యాము నినకోటిధాము - సౌందర్యజితకాము జగదభిరాము
రాము దైతేయవిరాము వీక్షించి - కామభూతము సోఁకఁ గనుఁగొన రాక
తామసగుణ మేచి తన్ను లోకాభి - రాముగాఁ దలఁచి యారక్కసి నిక్కి
తనపెద్దమొగము నాతనిముద్దుమొగము - తనమహోదరము నాతనితనూదరము
తనతప్పుఁగన్ను లాతనిగొప్పకన్ను - లెన యంచుఁ దన కితఁడే తగు నంచు
మొగము చేటంతగా ముసిముసి నగవు - లిగురింప రఘురాము నీక్షించి పలికె.
“శరచాపములు పూని చరియింప నేల - యరుదైనయడవుల నతివయు నీవు390
నీవేషమున నుండ నేమి కారణము? - నీ వెవ్వఁడవు మఱి నీకుఁ బే రేమి”
యనవుడు రఘురాముఁ డల్లన నవ్వి - దనుజకామినితోడఁ దగ నిట్టు లనియె.
“రామాభిరామ యోరామ నాపేరు - రాముఁడు దశరథరాజు మాతండ్రి
యాపర్ణశాలవాఁ డతఁడు నాతమ్ముఁ - డీపద్మలోచన యిల్లాలు నాకు
నేను దండ్రియుఁ బంప నీయరణ్యములఁ - బూని చరింతుఁ దపోవృత్తి నిపుడు
నీ వెవ్వతెవు? మఱి నీకుఁ బే రేమి? - నీ వేల వచ్చితి నేఁడు మాకడకు

నీవిలాసంబును నీవయోరూప - లావణ్యమును నింతులకు నెందుఁ గలదు?"
నావుడు నాశూర్పణఖ రాముఁ జూచి - వావిరిఁ బల్కె దుర్వారయై నిలిచి
“యావిశ్రవసుకొడు కఖిలకంటకుఁడు - రావణుఁ డుగ్రవిక్రమయశోధనుఁడు
నాపటుసత్త్వున కనుఁగుజెల్లెలను - నాపేరు విను శూర్పణఖ యండ్రు తెలియ,400
నీరూపురేఖలన్నియు సరి చూచి - కూరిమి నీకు నాకును దగు నంచు
కామించి వచ్చితిఁ గడు నొప్పురూపుఁ - గామించినప్పుడె కైకొన నేర్తు;
నెందైనఁ జన నేర్తు; నేవస్తు వైనఁ - బొందుగాఁ దే నేర్తు; భోగింప నేర్తు;
నున్నది యేల నాయొప్పు భావించి - నన్నుఁ బాణిగ్రహణంబు గావింపు
మిది కులగుణహీన యిది వికృతాంగి - యిది నీకు మఱి తగునే? యటుగాన,
నీమెలఁతుకఁ బట్టి యిప్పుడే మ్రింగి - రామ నీకోరిన రతి సల్పుదాన;"
ననవుడు తనుఁ జేర నాసీతఁ దిగిచి - కొని రాఘవుఁడు దానికోర్కికి నవ్వి
కొంత హాస్యముఁ జేయఁ గోరి యాదనుజ - కాంతవికారంబుఁ గనుఁగొని పలికె,
“నే నింతి గలవాఁడ నిది నన్ను నమ్మి - పూని నాతో వనంబునకు నేతెంచెఁ
దగిలి నీ కొప్పింపఁ దగ దీలతాంగిఁ - బగగొని సవతితోఁ బడఁజాల వీవు;410
ఈనాతి లేకున్న నింతకు మున్నె - యే నినుఁ గైకొందు నిప్పు డేమాయె;
వాఁడె నాతమ్ముఁడు వరతపోధనుఁడు - వాఁడు నాకంటెను వరరూపధరుఁడు
తన కొక్కచక్కనితరలాయతాక్షి - ననుకూలవతిని నిత్యముఁ గోరుఁ గాన
నినుఁ బొంద నాతఁడు నేర్చు నం దరుగు" - మనవుడుఁ గాఁబోలు నని డాయఁబోయి
“నెలకొని లక్ష్మణ! నిన్నుఁ గామించి - కలయ వచ్చితి నన్నుఁ గైకొను" మనుడు
నారామునుద్యోగ మతఁడును తెలిసి - ధీరుఁడై దానితోఁ దెఱఁగొప్పఁ బలికె,
"మెలఁత మాయన్నఁ గామించితి తొలుత - దలఁపున నటుగానఁ దగదు నిన్ బొంద,
సీత నిన్ బోలదు చెలువంబునందు - నీతఱి దీటును నీమురిపెంబు
భాతి నింకొకసారి పరికించెనేని - సీత నొల్లక నిన్నుఁ జెందు రాఘవుఁడు
రాముసన్నిధికి నో రమణి! పొమ్మనిన - సౌమిత్రిమాటలు సత్యంబు లనుచుఁ420
దామసి తనరోఁత దలఁపక మఱియు - రామునికడ కేగి రతికిఁ బ్రార్థించె.
“వలవ దాతనిఁ బొందు వనిత! నీ" వనిన - జలజాక్షి మఱియు లక్ష్మణునిఁ బ్రార్థించెఁ
దమ్ముఁ డన్నను నన్న తమ్మునిఁ జూప - ద్రిమ్మరి తనకోర్కి తీదీపులాడ.
మఱి మన్మథునిసూత్రమహిమచేఁ దిరుగు - తెరబొమ్మయో యనఁ దిరిగెఁ బేరాస,
విరసవర్తనముల వెలఁది యిబ్భంగి - నిరువురసన్నిధి కెడఁదాకి తాఁకి
వేసరి యన్యోన్యవివశవర్తనల - గాసిల్లి యెంతయుఁ గడు నల్గి పలికె.
"నోరిమానవులార! యొకపేదరాలి - గాఱించుతెఱఁగునఁ గాఱింపఁ దగునె?
యేను గోపించిన నింద్రాదిసురలు - నైనను మ్రింగుదు నట మర్త్యు లెంత?

పొదివి యీయింతితో భువనంబు లెల్ల - జదిమి మ్రింగుదు" నని సంరంభ మెసఁగ
నది మృత్యువును బోలి యట్టహాసంబు - పొదలి డగ్గఱ వచ్చు పూనికఁ జూచి430
జానకి దలఁకెడు సౌమిత్రి యింక - దీనిమేలము చాలు దీని శిక్షింపు;"
మని రాఘవుఁడు పల్క నాలక్ష్మణుండు - విని పర్ణశాలకు వెలుపల నిలిచి
"పడఁతి! నీ కింత కోపం బేల రమ్ము- కడముట్ట నీకోర్కిఁ గావింతు నిపుడె”
యని లక్ష్మణుఁడు పల్క నాశూర్పణఖయుఁ - దనమది నుప్పొంగి డగ్గఱఁ జేర
ఘనవిషజ్వాలోరగము పుట్ట వెడలు- ననువున నొరబాపి యదరులు చెదరఁ
దనఖడ్గ మంకించి దానవురాలి - ఘననాసికము చెవు ల్గరమునఁ బట్టి
యేసీమసరసమో యిది యన నతఁడు - మాసీమసరస మోమగువరో యనుచుఁ
“జే యొడ్డి వలచి వచ్చినఁ జెవు ల్ముక్కు - పోయె" నన్ సామెత పుడమిఁ బుట్టించి
ముక్కును జెవులును మొదలంటఁ గోయ - వెక్కుచు వేసారి వివశాత్మ యగుచు
శృంగంబు పగిలిన జేవురుఁగొండ - భంగి రక్తము లొల్క భయమంది పాఱి440.
చని చతుర్దశసహస్రనిశాచరేంద్ర - జననవిరాజితస్థానంబు నైన
ఖరునియాస్థానంబుకడకు వచ్చుటయు - ఖరుఁడును దానియాకారంబుఁ జూచి
వెఱగంది "యిది యేమి వెలఁది! నీరూపు - వెఱవక యెవ్వఁడు వికృతంబు సేసె
నెవ్వఁడు కాలాహి నెఱిఁగియుఁ ద్రొక్కె - నెవ్వఁడు మృత్యువు నిత్తఱిఁ జెనకె?
వాని నెఱింగింపు వానిరక్తములు - వానిమాంసంబులు వడి నీకు నిత్తు"
నని పేర్చి ఖరుఁడు త న్నడిగినఁ జూచి - వినుపింపఁ దొడఁగె నవ్వెలఁది యేడ్చుచును
మునుకొన్నసిగ్గున మో మరవాంచి - వినుపింపఁ దొడఁగె నవ్వెలఁది యేడ్చుచును
“విను మరణ్యమునందు వెఱవక యేను - చనుచోట నాజనస్థానంబునందు
నాసుతుఁ డైనట్టి నాకేశసదృశుఁ - డాసూర్యునిం గూర్చి యట నిష్ఠ నుండ
వాని వధించిరి పౌరుష మొప్ప - వానికిఁ గర్మముల్ వడిఁ జేసి పిదప450
విను మరణ్యమునందు విపులసాహసులు - మునివేషధారులు మోహనాకృతులు
రామలక్ష్మణు లను రాజనందనులు - కామించి యేను డగ్గరుటయుఁ జూచి
పటుశక్తి న న్నంటఁ బట్టి నావేష - మిటు చేసి విడిచిరి యేను దుఃఖించి
నినుఁ గానవచ్చితి నీ వింకఁ బోయి - యెనసిన కడఁకమై నిద్దఱఁ జంపి
వారిమాంసంబులు వడి నాకు నిచ్చి - వారక నాలోని వగలార్పు" మనుడు
“నింతమాత్రమునకై యే నేల వారి - పంత మ దెంత నాపంపుఁ గైకొమ్ము"

ఖరుఁడు తనసేనల శ్రీరామలక్ష్మణులపైకిఁ బంపుట

అని పదునలువుర నంతకోపముల - ననలోగ్రతేజుల నప్పుడు పిలిచి
"యీశూర్పణఖవెంట నేగి యానరుల - నాశంబు నొందించి నాసహోదరికి
వారిశోణితము ద్రావఁగఁ జేయుఁ" డనిన - వారును దుర్వారవారివాహములు

గాలితో వచ్చినకరణి నాజంత - తో లోల శూలకాంతులు మెర్పు లట్ల460
చనుదెంచి రామలక్ష్మణసూర్యచంద్రు - లను గప్పి గర్జితాలాపముల్ చూప
దినకరకులుఁ డంత దేదీప్యమాన - ధనురాదిసాధనోద్దాముఁడై యెదిరి
వారును తనమీఁద వైచిన యశని - దారుణశూలముల్ ధారణిఁ గూల్చి
వారి నందఱ భూరివజ్రానుకారి - నారాచములఁ గంఠనాళముల్ చిదుమఁ
బరిపక్వఫలశిరోభాగము ల్వాసి - నిరుపమాశుగహతి నిట్టరా ళ్ళనఁగఁ
బుడమిపై గెడసి రప్పుడు సుప్పనాతి - మడెమెత్తుపరువున మఱియును బాఱి
ఖరునకు లోకభీకరునకు వారి - మరణంబు రఘురాము మహితరణంబు
నుగ్గడించుటయు నాహుతి వెగ్గలముగ - భగ్గుభగ్గున మండు పావకుఁ డనఁగఁ
గోపించి యపుడు మిక్కుట మైనకడిమి - దీపించి దూషణత్రిశిరులు మొదలు
వీరులు పదునాల్గువేలరాక్షసులు - ఘోరసత్త్వులు గొల్వ కొమరు దీపించి470
తెరలిన సురలతో దివి తల్లడిల్లఁ - బొరలిన గిరులతో భువి పెల్లగిల్ల
రణభేరి వేయించి రత్నశైలాభ - గణనీయశబళాశ్వకలితవైడూర్య
మణికూబరసువర్ణమయచక్రదశక - రణజయప్రదధనుర్బాణాసిపూర్ణ
రణితకింకిణియైన రథ మెక్కి వెడలె - రణబలోదగ్రుఁడై రఘురాముమీఁదఁ;
ద్రిశిరుండు కంకపత్రశరుండు విలస - దశనికల్పుఁడు దిక్కు లదర నార్చుచును
వాసవవారణోజ్వలభాస మైన - భాసురరాసభప్రకరసంభరిత
హాటకస్థగితశతాంగంబు నెక్కి - మేటికయ్యమునకు మే నుబ్బి వెడలె;
బర్హిణవర్ణనిబర్హణపవన - గర్హణచణకాంతిఘనవేగతురగ
సందోహసంభృతస్యందనోత్తమము - ముందుగాఁ దోలించి ముదము గీలించి
సేనాముఖంబునఁ జెలఁగి దూషణుఁడు - నానాముఖంబుల నలువొప్ప డించె.480
ప్రేమతో మఱి పృథుగ్రీవుండు సైన్య - గామియు నవ్విహంగముఁడును మేఘ
మాలియు నగు మహామాలియు మఱియు - నాలోకభీకరుం డగు మహాసర్ప
ముఖుఁడును కాలకార్ముకుఁడు దుర్జయుఁడు - మఖశాత్రవుండును మఱి పరుషుండు
కారుణ్యదూరుఁ డాకరవీరనేత్రుఁ - డారుధిరాశనుం డన నొప్పువాఁడు
ద్వాదశదైత్యు లత్తరి ఖరుఁ గొల్చి - ద్వాదశాదిత్యప్రతాఫులై చనిరి
త్రిశిరుండు మఱి ప్రమాథియు రణోదగ్ర - యశమునఁ జేర్చు మహాకపాలుండు
స్థూలాక్షుఁడును రణోద్యోగులై సేన - నాలుగుముఖముల నడచి రేమఱక
భీషణకరిఘటాబృంహితతురగ - హేషారథస్వనానేకపదాతి
పటుతరహుంకారపటహభాంకార - పటుకేతుపటపటస్ఫారనాదములఁ
గ్రుంగె భూతలము దిక్కులు వ్రక్క లయ్యె - పొంగెఁ బయోధులు భూతము ల్వణఁకె490
బలముల కెంధూళి భానుమండలము - కలదు లే దనఁ గప్పె గగనంబు నిండ

ఖరునికేతనముపై గ్రద్దలు వాలె - తురగముల్ మ్రగ్గె నెత్తురువాన గురిసె.
నక్కలు వాపోయె నభము భేదించెఁ - జుక్కలు డుల్లె పక్షులు చుట్టు నఱచె
మఱియు నుత్పాతము ల్మహి నాకసమునఁ - దఱుచుగాఁ దోఁప నింతయు భీతిలేక
ఖరుఁ డీతెఱంగునఁ గడఁకతో నడచి - యరు దైన యాదండకాటవిఁ జొచ్చె
ననుపమాకృతి రాముఁ డక్కలకలము - విని పర్ణశాలకు వెలుపల నిలిచి
యవనిపై దివముపై నపశకునములు - వివిధములనుఁ గొంచు వెసఁ దమ్ముఁ బిలిచి
"సౌమిత్రి! సమరసూచకనిమిత్తములు - భూమిపైఁ బెక్కులు పుట్టుచున్నవియు
రట్టడి ముక్కడి రక్కసి మఱియు - దిటయై బలములఁ దెచ్చెఁ గావలయు
నదె సైన్యఘోషంబు లట్ల కానోపు - నదె మహాబలధూళి యఖిలంబుఁ గప్పె500
నవ మైన రణ మబ్బె నా కటుగాన - నవహితమతిఁ బూని యాలస్య ముడిగి
జనకజ నిక్కడఁ జన దుంప నింకఁ - గొనిపోయి యగ్గిరిగుహ నుండు" మనిన
“నినవంశవల్లభ! యే నెట్లు పోదు - నినుడించి యటుఁగాన నీవు సీతయును
బర్వతగుహఁ జేరి పరికింపు మేను - దుర్వారదనుజులఁ దుంతు మీకృపను“
అన విని "వీరితో నాలంబు సేయ - నెనసె వేడుక నాకు నీ వుండవలదు;
జనకజ తలఁకెడుఁ జను" మన్న సీతఁ - గొనిపోయి పర్వతగుహఁ జొచ్చి యుండె.
అంత రాముఁడు ప్రళయాంతకుపగిది - నెంతయుఁ గోపించి యేపు దీపించి
యమితమునిత్రాణ మగు కృపాణంబుఁ - గ్రమ మొప్పగా వజ్రకవచంబుఁ బూని
శరశరాసనములు చతురుఁడై తాల్చి - యురుతరతూణీరయుగళంబుఁ బిగిచి
కొండపొల్లుగ వచ్చు కుండలీకుండ - లుం డన విల్లు పెల్లుగ నెక్కుపెట్టి510
యగణితధ్వనులు మిన్నంతయుఁ బగుల - తగిలి చాపము గుణధ్వని చేయుచుండె.
నింద్రుండు మొదలుగా నెల్లదేవతలు - సాంద్రరత్నవిమానసహితులై నపుడు
చద లెల్ల నిండి యెంచఁగ రాముఁ డొకఁడు - పదునాల్గువేల నప్రతిమవిక్రముల
ఖరదూషణాదిరాక్షసుల నేరీతిఁ - బొరిఁగొనునో చోద్యముగఁ జూత మనుచుఁ
గనుఁగొనుచుండిరి కపటదానవుల - ఘనుఁడు రాముఁడు ద్రుంచుఁగా కంచు సారె
దేవర్షిగణములు దివినుండి తాము - దీవించుచుండిరి దివిరి పల్మాఱు
పదివేలకోటులభానుతేజములు - పొదిగొను లోకము ల్పొదివిన యట్లు
రామునితేజ మరణ్యభూజములు - భూమియు నభము నబ్ధులు గప్పుటయును
జడమతులై సర్వసంభ్రమం బుడిగి - మిడుకుచుఁ గన్నులు మిఱుమిట్లు గొనఁగ
కడునంధులైన రాక్షసులను జూచి - కడఁకతోఁ బల్కె నాఖరుఁడు దూషణుని520
"ఇది యేమి దూషణ! యీసేన నడవ - బెదిరెనో? పరసేన యే దడ్డపడెనొ?"
యనిన దూషణుఁ డేగి యటఁ జూచి వచ్చి - “దనుజేశ! రాము నుద్దండతేజంబు
కలయఁ బర్వుటయుసు గతి దప్పె" ననుడు - నలుకమై ఖరుఁడు సైన్యములఁ దిట్టుచును

ఖరుని సేనలు రాము నెదుర్కొనుట

నరద మత్యుగ్రత నటఁ దోలుకొనుచు - నరుగుచో రాక్షసు లందఱుఁ గూడి
భుజబలాటోపవిస్ఫురితప్రతాప - గజరథభటవాజికలితులై యకట!
మండుకార్చిచ్చుపై మలయుచు మిడుత - తండంబు లొక్కటఁ దార్కొన్నకరణి
గడునుగ్రవేగులై కాకుత్స్థరాము - వడిఁ జుట్టుముట్టి దుర్వారులై కదిసి
శరచాపపట్టసశక్తిత్రిశూల - కరవాలకుంతముద్గరభిండివాల
పరశుతోమరగదాప్రాసఖడ్గములు - గురిసి యార్చి దేవకోటి భీతిల్ల.
నప్పుడు రఘురాముఁ డంబుదపంక్తిఁ - గప్పిన చండాంశుగతిఁ గానబఁడక530
కొంతసేపునకు రక్షోగణముక్త - కుంతాదిబహుశస్త్రకుటిలాస్త్రతతులు
నన్నియు మాయించె నైంద్రజాలమునఁ - జెన్నునఁ దను సురశ్రేణి కీర్తింప
మఱియుఁ దోడ్తో దైత్యమండలి గురియుఁ - దఱుచుగా నస్త్రశస్త్రములఁ ద్రుంచుచును
ముందట నిరుపార్శ్వములఁ బిఱుందటను - సందడించిన దైత్యసైన్యంబుమీఁద
గరలాఘవము మీఱఁ గవదొనలోన - శరములన్నియు నొక్కసారె సంధించి
పదియు నూఱును వేయుఁ బదివేలు లక్ష - పదిలక్ష పదికోట్లు పదినూఱుకోట్లు
మండితపరివేషమధ్యందినార్క - మండలపరివేషమహితానుకారి
కుండలీకృతచండకోదండదండ - భండనాత్యుత్సాహబాహుఁ డై వేయఁ
దునియ గంభీరవేదులును జోదులును - దునుకలై పడెడు వీరులును రౌతులును
ద్రుంగెడు బహుపదాతులును హేతులును - ముంగలఁ బడు శరంబులు శిరంబులును540
మ్రొగ్గెడు యోధాంగములు రథాంగములు - మగ్గెడు సగుణధర్మములు వర్మములు
తూలెడు రథికజాతులును సూతులును - గూలెడి వెలిగొడుగులుఁ బడగలును
నలి యైన మాంసఖండములు మొండెములు - గలిగి లోకైకభీకర మయ్యె రణము
అంత భానునిదీప్తి కంధకారంబు - పంత మంతయుఁ బటాపంచ లైనట్లు
అతులవిక్రమధాముఁ డగు రామునకును - హతశేష మగుసైన్య మంతయు విఱిగి,
ఖరునకు శరణన్న ఖరుఁడును వారిఁ - బురికొల్పి దూషణుఁ బోరికై పనుప
వాఁడును హతశేషవాహినులను - వేఁడిమి సూపుచు వేవేగ పొదివి
తాలసాలశిలావితాననానాస్త్ర - జాలవర్షము రామచంద్రుపైఁ గురిసెఁ
గురిసినఁ దనమేనఁ క్రొన్నెత్తు రొలుక - నరుణారవిందాక్షుఁ డై రాముఁ డలుక
గాంధర్వశరము రాక్షసులపై నేయ - సైంధవసింధురస్యందనసుభట550
వీరుల కమ్మహావిశిఖరాజంబు - తేరిచూడఁగ రాక దేదీప్యమాన
ధారాకరాళమై దనుజవర్గములఁ - గాఱించి నొంచి చీకాకు గావించి
దండించి ఖండించి తల లుత్తరించి - చెండాడుచో రణక్షితి యెల్ల నిండి
యెందుఁ జూచిన తురంగేభఖండములు - ఎందుఁ జూచిన నింగి కెగయు మొండెములు

నెందుఁ జూచినఁ బ్రేవు లెఱచియు మెదడు - నెందుఁ జూచిన నెత్తులేర్లునై యుండె
శాకినీభూతపిశాచభేతాళ - డాకిను లంతఁ దండంబులై యపుడు
"నేనుంగుతలకాయ లెసఁగ గుండలుగఁ - బూని యందలిముత్యములు దండులముగ
దండి రామునిరణధర్మసత్రమున - వండినా రిదె రండు వరుస భుజింప"
నని వేడ్కఁ బైకొన్న యధికారముద్ర - గొని రొదగాకుండఁ గూర్చుండఁబెట్టి
రక్తచందనమును రక్తాక్షతములు - రక్తసంకల్పపూరంబును దాల్చి560
శరవహ్నిపక్వమాంసంపుటన్నములు - పొరలినమెదడు పప్పును గొవ్వులందు
వరదలై యాజ్యప్రవాహముల్ కండ - లెరిగి కారిజము లనేకశాకముల
పాలప్రేవులు శాపపాశముల్ మేలి - వాలుగుండెలు పిండివంటలు మఱియు
నెత్తురు తియ్యనినీరుగాఁ దలఁచి - యత్తఱి విప్రయోగ్యాహార మగుచు
నానందతృప్తులై యధికసమ్మతము - చేనూని సభ గూడి శ్రీరామచంద్ర
"ధీవిజయో౽ స్త"ని దీవించి కొన్ని - యావలఁ గొన్ని “తథా౽స్తని” పల్క
నింతలో మఱికొన్ని యేనుంగుజీవ - దంతము ల్చేతను తాళము ల్పూని
పొలసుటెమ్ములు సంకుపూసలపేర్లు - కళుకుకామాక్షులుగా ధరియించి

శ్రీరామునితో ఖరదూషణులు యుద్ధము చేయుట

కరఘంటికాతాళగతుల కుబ్బుచును - దరిఁ జేరి కావు లత్తఱిఁ జూపెఁ గొన్ని
అంత దూషణుఁడు మత్తారిభీషణుఁడు - వంత నొందుచుఁ దనవద్దియోధులను570
విజయశీలుర నైదువేలఁ బంపుటయు - త్రిజగము ల్వణఁక నెదిర్చి వారపుడు
చాపవిద్యాప్రౌఢి సకలంబుఁ జూపఁ - జూపులు గోపంబు చూపుచు నృపుఁడు
నొక్కొక్కశరమున నొక్కొక్కదనుజుఁ - దక్కకఁ ద్రుంచి విచారించి విభుఁడు
కొందఱ నందంద గుదులుగాఁ గ్రుచ్చి - యందఱఁ దెగటార్చి యార్చినఁ జూచి
దూషణుం డప్పు డత్యుగ్రతఁ బరుష - భాషణుండై రాముపైఁ దేరుఁ బఱపి
దశదిగంతంబును దట్టంబు గాఁగ - నశనికాలాహితుల్యంబులై యొప్పు
నమ్ములు నిగుడింప నవి ద్రుంచి నాల్గు - నమ్ముల రథమును హయములఁ ద్రుంచి
వెరవొప్ప నొకకోల విలు ద్రుంచుటయును - దురమున విరథుఁడై దూషణుం డలుక
దారుణపాణి విదారణవిజయ - కారణాంతకగదాకల్పమై యొప్పు
పరిఘంబుఁ ద్రిప్పుచుఁ బరతేర రాముఁ - డురుశరద్వయమున నురుబాహుయుగము580
నరుదుగాఁ దెగనేసి యామ్యబాణమున - నుర మేయుటయు దైత్యుఁ డొరలుచుఁ గూలెఁ
దంతము ల్విరిగిన దారుణభద్ర - దంతావళేంద్రంబు ధరఁ గూలినట్లు
గూలినఁ జూచి ముగ్గురు దండనాథు - లాలోఁ బ్రమాథి మహాకపాలుండు
స్థూలాక్షుఁడును బరశువు త్రిశూలంబు - కేలఁ బట్టిసము లంకించి వైచుటయు
వారిశస్త్రంబులు వారిమస్తకము - శ్రీరాముఁ డొక్కఁడె చెండి చెండాడె.

నప్పుడు ఖరుఁడు సేనాధినాయకుల- ముప్పిరి గొను రోషమునఁ బురికొల్పి,
వారిపన్నిద్ద రవార్యశౌర్యమున - వీరరాఘవుఁ దాఁకి వేర్వేఱఁ బోరఁ
గులిశధారాకారఘోరబాణములఁ - గలిమిఁ జూపుచు సైన్యగామి నుక్కణఁచి
కాలకార్ముకుఁ ద్రుంచి కరవీరనేత్రుఁ - దూలించి సర్పాస్యు త్రు ళ్ళడంగించి
యావిహంగము నొంచి యజ్ఞశాత్రవుని - చేవ యడంచి శిక్షించి దుర్జయుని590
కేలి మహామాలి గెడపి యామేఘ - మాలిని వధియించి మర్దించి పరుషుఁ
బృథుకంఠుకంఠంబు పృథ్విపైఁ గూల్చి - రుధిరాశనుని జంపి రోషంబు మిగుల
ది క్కేది ఖరుఁడును ద్రిశిరుండు దక్క - తక్కినవారి నందఱ నేలఁ గూల్చె.
నీలీల రాముచే నెల్లసైన్యములు - గాలిచేఁ గూలిన కారాకు లనఁగఁ
గూలినకోపంబు గొని కాలత్రిశిరుఁ - డాలోన రాముపై నరదంబుఁ బఱపి
సింహనాదముఁ జేసి సింధురోత్తమము - సింహంబు నెదిరిన చెలువున నెదిరి
గుణనాద మెసఁగ రక్షావీరుఁ డకట - గణనాపరంపరల్ గడవ నందంద
నతులబాణము లేయ నలిగి రాఘవుఁడు - ప్రతిబాణతతులచే బలువిడిఁ ద్రుంచె.
వాఁడును మఱి పేరు వాఁడి వాఁడిమిని - మూఁడుబాణముల రామునిఫాల మేసె
నావాఁడిబాణంబు లళికంబు దాఁక - నవ్వుచుఁ గినుకమై నళినాప్తకులుఁడు600
త్రిశిరుని నేసినఁ ద్రిశిరము ల్కుసుమ - దశ దాల్చె నిఁకఁ జతుర్దశభువనములు
దూరిన నినుఁ బట్టి తునుమాడునట్టి- దారుణతరచతుర్దశసాయకముల
నే నేయువాఁడ సహింపుమీ యనుచుఁ - దా నేసెఁ బదునాల్గుదారుణాస్త్రములు
అవి ఱొమ్ము గొని గాడి యవ్వల వెడల - నవనీస్థలము గాడె నంత రాఘవుఁడు
అరదంబు మఱి నాలుగమ్ముల విఱిచి - యురువడి పదియింట నుర మేయుటయును
సురవైరి కోపించి శూలంబు వైవ - నరనాథుఁ డది ద్రుంచె నాలుగస్త్రములఁ
ద్రుంచి మూఁడమ్ములఁ దుద మూఁడుతలలఁ - ద్రుంచినఁ ద్రిశిరుండు దురమునఁ గూలె
మూఁడుకొమ్మలతోడ మొదలంటఁ ద్రవ్వి - పోడిమి చెడి కూలు భూజంబుపోలె
త్రిశిరుండు గూలఁగ దృష్టించి ఖరుఁడు - దశరథరాముచేఁతకుఁ జోద్య మంది
మఱి చాలఁ గోపించి మహనీయరథము - దఱిమి యుగ్రాస్త్రసంతతు లేయఁ జూచి610
శరలాఘవము మెచ్చి జానకీవిభుఁడు - ఖరునిపైఁ బ్రతిసాయకములు వేయుటయు
ఖరునిబాణములు రాఘవునిబాణములు - ధరణీతలము వియత్తలమును బొదివె
నప్పు డర్కునిదీప్తు లన్నియు మానెఁ - గప్పెను నిబిడాంధకారంబు దిశల
ఖరుని రాఘవుఁడు రాఘవుని నాఖరుఁడు - సరకుగాఁ గొని రాజి జయకాము లగుచుఁ
గాసరయుగళంబు కలభద్వయంబు - కేసరియుగళంబు కెరలి యొండొండఁ
బోరెడుగతిఁ దోఁప భుజబలాటోప - భూరిప్రతాపులై పోరాడుచోట
ఖరుఁ డప్పు డలిగి రాఘవుచేతివిల్లు - సరి ద్రుంగు వెస నర్ధచంద్రబాణమునఁ

ద్రుంచి జోదును ద్రుంచఁ దోడ్తోడ మఱియు - ముంచె రామునిదేహమున నంపవెల్లి
నాయంపతండంబు నాతఁడు సరకు - సేయక తనుసురశ్రేణి కీర్తింప
నుష్ణాంశుకులుఁ డగస్త్యునిచేతఁ గొన్న - వైష్ణవచాపంబు వడి నెక్కువెట్టి620
శింజిని మ్రోయించి శితసాయకముల - భంజించె రాక్షసప్రవరుకేతనము
మఱి వాఁడు రాముమర్మము లుచ్చిపాఱఁ - గఱుకుటమ్ములు నాల్గు గద్దించి యేయ
రక్తసిక్తాంగుఁడై రాఘవుం డంత - నక్తంచరుని నొంచె నారాచనిహతిఁ
బటుబాణ మొకట చాపము దుంచి వైచె - యట నాలుగిట వానిహయములఁ జంపి
సారథిఁ బడనేసి సాయకవహ్ని - కారథం బపుడు పూర్ణాహుతి చేసె
విలు గోలుపడి యిట్లు విరథుఁడై ఖరుఁడు - ప్రళయకాలాంతకప్రతిముఁడై కేలఁ
జలమునఁ గడగొంచుఁ జనుదెంచుటయును - జలియించె గిరులతో జగతి యంతయును
నప్పుడు రఘురాముఁ డాదుష్టదైత్యుఁ - దప్పక గనుఁగొని దర్పించి పలికె.
"నోరిరాక్షస! వినరోరి! నాచేత - శూరత నీ కేల చొప్పడు నింక?
నీబలంబులు సచ్చె; నీవారు తెగిరి; నీబాణసంపద నిర్మూల మయ్యె;630
నరుదుగా నీదండకాటవిఁ దొల్లి - పెరిగి సన్మునులఁ జంపినపాపఫలము,
కుడువఁ గాలము వచ్చెఁ; గుడుతుగా కింక; - నడరి వధింతు ఘోరాజిలో నిన్ను;
ననవుడు ఖరుఁ డప్పు డారాముఁ జూచి - కనలుచుఁ బలికె దోర్గర్వంబు మెఱసి
“యేల రాఘవ! నీకు నింత గర్వింప? - నాలంబులోఁ గొంద ఱల్పులఁ జంపి
కెలయుచు నిను నీవె కీర్తించుకొనెదు - కులజుండు తను దానె కొనియాడుకొనునె?
కదిసి పోరాడు నాకడిమియుఁ జూడు; - ఇదె గదాధరుఁడనై యేతెంచినాఁడ
దేవతలకు నైన తీరదు గెలువ - నీవు నాముందఱ నిలువ శూరుఁడవె?
యొండొండఁ గడఁగి నీయొడలిమాంసములు - చెండాడి నేఁడు నాచెలియలి కిత్తు.”
నని మహాగదఁ ద్రిప్పి యడరి వైచుటయు - ననిలునివేగంబు నర్కుతేజంబు
ననలునివేఁడిమి యశనిబెట్టిదము - ఘనగదారూపమై కదసినయట్లు640
చనుదేర నుద్దండచండకాండములఁ - గనల కారాముఁ డాగదఁ ద్రుంగనేసి,

ఖరుఁడు శ్రీరాముల నెదుర్చుట

"యోరి! నీగర్వోక్తు లుబ్బును మదము - దీరెనె? బింకముల్ దీరెనే?" యనుడు
గద్దించుచును వాఁడు కడువడితోడ - నద్దనుజుండు మహారోషమునను
గ్రక్కున వృక్ష మొక్కటి పెల్లగించి - చిక్కినభుజశక్తిఁ జిరజిరఁ ద్రిప్పి
"చావు" మటంచును జయ్యన వైవ - నావృక్షమును ద్రుంచి యపుడు రాఘవుఁడు
ఖరునిపై ఖరకరకరసహస్రాభ - శరసహస్రము లేసి చాల నొప్పింప
నొచ్చియు వాఁడు తనూరక్తధార - పిచ్చిలఁ దెచ్చుకో ల్బీరంబు మీఱ
నెదురుగాఁ జనుదేర నీక్షించి రాముఁ - డదయుఁడై భువనంబు లన్నియు వణఁక

నురువడి నైంద్రాస్త్ర మొకటి సంధించి - యుర మేయుటయు దైత్యుఁ డుబ్బెల్లఁ బొలిసి
పిడు గడచినఁ గొండ పృథివిపైఁ గూలు - వడువున ఖరుఁ డంత వసుధపైఁ గూలె.650
అని ముహూర్తము ముహూర్తార్ధంబులోన - దను నెదిర్చినచతుర్దశసహస్రముల
ఖరదూషణాదిరాక్షసుల నీరీతిఁ - బొరిగొనుటయు రాముఁ బొగడిరి సురలు;
మునులు దీవించిరి; మొగిఁ బుష్పవృష్టి - యనిమిషు లురియించి రారాముమీఁద
ఘనశైలగుహనుండి కడఁకతో నంత - జనకజఁ గొని వచ్చి సౌమిత్రి మ్రొక్కి
యభినుతు లొనరించి యప్పు డారామ - విభునిచే శోభిల్లు వి ల్లందుకొనియె.
నూనినసంతోష ముల్లంబు నిండ - జానకీపతి పర్ణశాల కేతెంచి
కలహించి తెగిన రాక్షసుల భూమిజకుఁ - దెలియఁ జెప్పుచు వినోదించుచునుండె.
అప్పు డకంపనుఁ డఖిలకంపనుఁడు - విఫులార్తి లంకకు వేగంబె పోయి
·యారావణునిఁ గాంచి “యసురాధినాథ! - వీరులు పదునాల్గువేలరాక్షసులు
ఖరదూషణాదులు కాకుత్స్థరాము - శరవహ్ని నీఱైరి సత్యం" బటన్న660
అక్కజంబును బొంది యాయకంపనుని - దిక్కు చిక్కని రోషదృష్టిఁ జూచుచును
“నేమేమి యిది వింత! యెట్లురా యోరి! - రాముఁ డెవ్వఁడు రాజరాజొ? స్వారాజొ?
యమరాజొ? వారైన నామహాఖరుని - సమరాన ద్రిశిరదూషణులను గెల్వఁ
జాల రట్టి ప్రతాపశాలుర నొక్కఁ - డేలీలఁ గెల్చె? మా కెఱిఁగింపు తెలియ
నిదె యభయంబు నీ కిచ్చితి" ననినఁ - బదరక మఱి యకంపనుఁడు రాఘవుని
చరితంబు ధైర్యంబు శౌర్యంబు నతఁడు - ఖరదూషణాదుల ఖండించుటయును
సౌమిత్రియందంబు జానకియంద - మామూలముగఁ జెప్ప నతఁడు రోషించి
యుద్ధంబు సేయ నుద్యోగింప నతఁడు - బద్ధమైత్రిని నకంపనుఁ డిట్టు లనియె.
“రాక్షసేశ్వర! విను రఘురాముఁ గెలువ - పక్షివాహనశూలపాణులవశమె?
మాటమాత్రంబున మహియు నాకసము - మీటను నాట నమ్మేటియే నేర్చుఁ!670
గార్చిచ్చు నైనను గరువలి నైన - నార్చను గూర్చను నాతఁడే నేర్చు;
భువనంబు లన్నియు బూది గావింప - నవి బోది గావింప నాతఁడే నేర్చుఁ!
బాల్పడ బ్రహ్మాండభాండంబు నైన - నిల్పఁ బగుల్ప నానిపుణుండె నేర్చు;
నదిగాన నొకయుపాయంబును గలదు - కదనంబువలవ దాకాకుత్స్థకులుని
దేవి లావణ్యవార్ధిని దెచ్చితేని? - నావియోగాగ్నిచే హతుఁ డగు నతఁడు,”
నావిని రాక్షసనాయకుం డదియ - భావించి యాతనిఁ బదినోళ్ళఁ బొగడి
హాటకరథ మెక్కి యాయబ్ధి దాఁటి - తాటకేయుని మంత్రిధౌరేయుఁ జేరి
యతనితో ఖరదూషణాదిరాక్షసులు - హతులౌటయును దాను నారాము దేవి
సీతఁ దెచ్చుటకు నాసించి వచ్చుటయు - ప్రీతిఁ జెప్పుటయు మారీచుఁ డిట్లనియె.
"నిది యేమి! రావణ! యెల్ల భోగములు - కొదలేక సుఖమునఁ గుడిచి కూర్చుండి680

యిట్టిదుర్బుద్ధి నీ కెట్లొకో పుట్టె? నెట్టిదుర్మతియొ నీ కీబుద్ధి చెప్పె
వాని నీ వటు పగవానిగా నెఱుఁగు - మే నీకుఁ బోరాని హితమతి గాని
యితరుండఁ గాను నీ కీబుద్ధి గాదు! - క్షితిఁ బతివ్రతల కాశించుట తగదు!
ఆశించితేని నీయన్వయం బెల్ల - నాశమౌఁ గాన దానవనాథ! నీవు
చనుము లంకకు సుప్రసన్నుఁడ వగుము - గనుము సౌఖ్యము నీదుకాంతలవలన”
ననిన మారీచువాక్యంబు లప్పటికి - విని లంక కేతెంచె వింశతిభుజుఁడు,

శూర్పణఖ రావణునితోఁ దనభంగపాటును జెప్పుట

అంత నాఖరదూషణాదిరాక్షసులు - పంతంబు చెడి రాముబాణాగ్నిఁ బడుట
యంతయు నటఁ జూచి యాచుప్పనాతి - సంతోష మెడలినఁ జని లంకఁ జొచ్చి
యాసుధర్మాస్థానమందుఁ జింతామ - ణీసింహపీఠి నుండెడి యింద్రుఁ డనఁగ
మానితం బగు సభామంటపవేదిఁ - బూన్కి సింహాసనంబున నున్నవాని690
గరుడోరగామరగంధర్వయువతు - లురుమతిఁ గొల్వఁ గొ ల్వున్నరావణుని
ఐరావతోగ్రదంతాగ్రసంఘట్టి - తోరస్స్థలస్థగితోరుభూషణుని
సకలలోకైకభీషణుని సంగ్రామ - వికటభాషణుని విద్వేషదూషణునిఁ
చారులయందును జనవరులందుఁ - గోరి బొక్కసమందుఁ గోరికలందు
గని మ్రొక్కి యేడ్చుచుఁ గరములు మొగిచి - తనలోని ఘనవిషాదము తోఁపఁ బలికె.
“అసురేంద్ర! లోకంబు లన్నిటియందు - నసమానసత్త్వుండ ననుకొందు వీవు!
కడిమిమై మూఁడులోకంబుల రిపులఁ - గడఁగి చంపితి నని గర్వింతు వీవు;
కడఁక నారాజ్య మకంటకం బనుచు - నొడివి పెల్లుబ్బి వినోదింతు వీవు;
గూఢచారులయందు గుప్తంబులందు - రూఢిగాఁ దెలియుచు రూపించువాఁడె
సకలలోకములకు స్వామి నాఁ బడును - వికటంబు లైన నీవిద్యలకలిమి700
నీవిక్రమంబును నీభుజాబలము - నీవిభవంబు లన్నియు మున్నెకాక
యింకఁ జెల్లునె? యిది యెట్లంటి వేని? - కొంకక విను భానుకులపావనుండు
తనతండ్రి దశరథధరణివల్లభుఁడు - తనుఁ బంప రాముఁడు తాపసవృత్తి
తనకు గాదిలిసహోదరుఁడు లక్ష్మణుఁడు - తనదేవి సీతయుఁ దాను నేతెంచి
మును దండకావనంబునకును వచ్చి - యనుకంప మునులకు నభయంబు లిచ్చి
వచ్చి యిమ్ములఁ బంచవటి నున్నచోట - నిచ్చలోఁ గామించి యేను డగ్గరినఁ
గర మల్గి నన్నిట్లు గాసిసేయుటయు - ఖరునితోఁ జెప్పిన ఖరుఁడు బిట్టలిగి
రోషించి లయకాలరుద్రుండువోలె - దూషణత్రిశిరులతో దండు వెడలి
నరభోజనులు పదునాలుగువేలు - వరవీరభటులతో వడి నేగుదెంచి
బలువడి రఘురాముబాణాగ్నిశిఖల - బలములు దానును భస్మమై మడిసి;710
రటు గాన నాభంగ మంతయు నీగ - నిట నీవె కాక ది క్కెవ్వరు గలరు?

ఇదె నాదుముఖభంగ మీక్షింపు; నాదు - కొదవ నీకొదవగాఁ గోర్కి భావింపు"
మనిన నచ్చెరువంది యాత్మ భావించి - దనుజాధినాథుఁడు దానవి కనియె.
“జ్ఞాతివధంబు నీచన్నవిధంబు - ఖ్యాతి వింటిని గంటి నది యటు లుండె!
నోరామ! యారామునురుసత్త్వ మెంత? - యేరూప? మేప్రాయ? మెంతటివాఁడు?
అతనితమ్మునిరూప మది యెట్టి? దతని - సతి యైనసీత యేచందంబురూపు?
చెప్పుమా; నీవు చూచినతెఱం గెల్ల - దప్పి తీరుతు రక్తధారల నీకు”

శూర్పణఖ శ్రీరాములరూపాతిశయముఁ దెల్పుట

నా విని యాశూర్పణఖ యిచ్చఁ బొంగి - రావణుతోడ నేర్పడ నిట్టులనియె.
“నున్నతోన్నతవక్షుఁ డుత్పలశ్యాముఁ - డిన్నిలోకములకు నెక్కుడువాఁడు
మిగులఁ జక్కనివాఁడు మిహిరమండలము - దెగడు తేజమువాఁడు ధీరవర్తనుఁడు720
నాజానుబాహుఁ డుదగ్రవిక్రముఁడు - రాజీవనేత్రుండు రామచంద్రుండు
నతఁడె పో ఖరదూషణాదిరాక్షసులఁ - గృతమతి నొంటిగా గెలిచినజోదు
హేమవర్ణుఁడు గాని యిన్నిచందములు - సౌమిత్రి రఘురాముచందంబువాఁడు
వాఁడెపో నా కీయవస్థ గావించి - నాఁ డింక సీతసౌందర్యంబు వినుము
తెఱఁగొప్పఁ జూచితి దేవకామినులఁ - దఱిగొని చూచితి దనుజకన్యకల
కేలిమైఁ జూచితిఁ గిన్నరాంగనలఁ - బోలించి చూచితి భోగికామినులఁ
గలయంగఁ జూచితి గంధర్వసతుల - నలవడఁ జూచితి యక్షకామినులఁ
జూచితిఁ బార్వతిఁ జూచితి రతినిఁ - జూచితి భారతిఁ జూచితి లక్ష్మిఁ
జూచితి రంభను జూచితి శచిని - జూచితి భూలోకసుందరు లెల్ల
మునుకొని చూచితి మునికన్యకలను - బనివడి చూచితి బ్రాహ్మణస్త్రీల730
నాచన్ను లాకన్ను లాముద్దుపల్కు - లాచెక్కు లాముక్కు లాసోయగంబు
లాతరు లాకురు లావాలుచూపు - లాతొడ లాయొడ లాయొయారంబు
లామందహాసంబు లావిలాసంబు - లామృదుగమనంబు లాసుమనంబు
నే ముందు పొడఁగాన నేయింతులందు - భూమిజ నేమని భూషింతుఁ జెపుమ,
నెగడ లోకము లేలు నీయట్టిపతికిఁ - దగుఁగాక యాయింతి తగునె యన్యులకు?
నాయిందుబింబాస్య యాచకోరాక్షి - యాయెలజవ్వని యాకుందరదన
యామత్తగజయాన యాలతకూన - యామానినీమణి యాపద్మగంధి
యాయింతి నీయింతి యై యుండెనేని - నీయాన దనుజేశ! నీరాజ్య మొప్పు"
ననిన రావణుఁడు కామాతురబుద్ధి - మును నకంపనుమాట ముద్దియమాట
విన నొక్కతేఱఁ గంచు విస్మయం బంది - గొనకొన్న ప్రేమమైఁ గొలువు చాలించి740
తనపాలివిధి తన్నుఁ దగిలి ప్రేరేపఁ - జని యేకతంబున సారథిఁ బిలిచి
యరదంబుఁ దెమ్మన్న నతఁ డట్ల సేయ - ఖరకరసదృశంబు కామచారంబు

ననుపమాయుధపూర్ణ మగురథం బెక్కి - దినకరకోటీరదీప్తుఁ డై మెఱసి
గగనమార్గమున సాగరమధ్యవీథిఁ - దగినవస్తువిశేషతతులు చూచుచును
దమకించి వడి సముద్రము దాఁటిపోయి - క్రముకమరీచికాగరునారికేళ
సాలతక్కోలరసాలవిశాల - వేలావనంబులు వేడ్కఁ గన్గొనుచు
గరుడుండు మును సుధాకలశంబు దేరఁ - గర మర్థిఁ బోవుచో గజకచ్ఛపముల
భక్షించుకొఱకునై పద మూదినట్టి - వృక్షంబు పక్షీంద్రవృతలక్షణంబు
శతయోజనాయతశాఖంబు మౌని - వ్రతము సుభద్రాఖ్య వెలయు వటంబు
సుముఖుఁడై కనుఁగొంచు సురుచిరమహిమ - నమరిన యాసుచంద్రాశ్రమభూమి750
గ్రమ మొప్ప జడలు వల్కలములు దాల్చి - సమచిత్తుఁడై కడుసౌమ్యభావమున
భూరితపోనిష్ఠఁ బొలుపారుచున్న - మారీచుఁ జేరి సన్మానంబు వడసి
యతిదీనవదనుఁ డై - యాపంక్తికంఠుఁ డతనితోఁ దనదు కార్యముఁ జెప్పఁదొణఁగె
"మారీచ! నీ వాప్తమంత్రివి గాన - వారక మఱియును వచ్చితి వినుము
తరణివంశుఁడు రామధరణివల్లభుఁడు - ధరణి యేలఁగ నీక తండ్రి పొమ్మనిన
ననుజన్ముఁడును దాను నతివయుఁ గూడి - వనమునఁ దపసులై వర్తింప వచ్చి
తనసత్త్వమునఁ బేర్చి దండకారణ్య- మునులకు నభయ మిమ్ముల నిచ్చి వచ్చి
నడుకంగ మనశూర్పణఖముక్కుఁజెవులు - కడునల్కఁ గోసే నక్కట! యకారణమ
ఖరదూషణాదిరాక్షసుల ఖండించె - దరమిడి మఱి చతుర్దశసహస్రములఁ
దెగినబంధులకుఁ బ్రతీకార మేను - నెగడి సేయకయున్న నెంజిలిపోదు760
నీవు మున్ గఱపిన నీతి నట్లున్న - నావల నభిమానహాని గాకున్నె?
తగ నటు గాన నాతనిదేవి మాయ - పొగడొందఁ గొనితేరఁ బోవుచునుండి
యలవడ నొకయుపాయము గంటి నేను - దలకొన్న నది నాకుఁ దగిలి సిద్ధించు
నడరెడు కడఁకతో నాపర్ణశాల - కడ కేగి మాయామృగంబవై నీవు
చెలఁగుచు వర్తింప సీత నిన్ జూచి - మెలుపొంద రామసౌమిత్రులఁ బిలిచి
నినుఁ బట్టి తెమ్మన నీవును వారిఁ - గొనిపోయి మృగవృత్తిఁ గుశలత మెఱసి
పోయి దుర్గాంతరంబులఁ గాడు పఱచి - మాయమై నీయాశ్రమము వచ్చి చొరుము
ఏనును జానకి నిట లంకలోని - కూనినవేడ్కమై నొగిఁ దెచ్చుకొందు;
నారాముఁడును విరహాగ్నిచేఁ గుందు - గోరి యేనునుఁ గోర్కి కొనసాగియుందు
నిది యిట్ల కావింపు మేను నారాజ్య - పదవిలో సగఁబాలు పంచి నీ కిత్తు!770
ననవుడు మారీచుఁ డానీచుఁ జూచి - ఘనభీతి నెంచి శోకసముద్రవీచి

మారీచుఁడు శ్రీరాముని ప్రభావముఁ దెల్పుట

మునిఁగి మూర్ఛిలి లేచి మోమోట ద్రోచి - “దనుజేశ! మఱియు నీతలఁ పెట్టు పుట్టెఁ?
గూడునే యిటు పల్కఁ గోరి యీత్రోవ - యోడక నీ కెవ్వఁ డుపదేశ మెచ్చె?

సుకసుకంబున నుండి సుతసోదరాది - సకలబాంధవులతోఁ జావఁ గోరెదవు;
కటకటా! యెవ్వనిఁగాఁ జూచినావు - కుటిలరాక్షనలోకకులభీము రాము
నేను బాల్యంబున నెఱుఁగుదుఁ గొంత - యానిత్యకల్యాణుఁ డసమసాహసుఁడు
అడరి విశ్వామిత్రుయాగంబుఁ గావఁ - గడగి యాతఁడు వచ్చి కా పున్నచోట
బలిమిమై నేను సుబాహుండు పోర - నలుక సుబాహు నొక్కమ్మునఁ ద్రుంచె;
నొకకోలఁ బుచ్చి పయోధిమధ్యమునఁ - బ్రకటితగతి నన్నుఁ బడవైచె నుఱక
నకృతాస్త్రుఁడై బాలుఁడై పిన్ననాఁడె - యకలంకుఁ డిట్టిశౌర్యముఁ జూపినాఁడు780
నేఁ డస్త్రబలశౌర్యనిధి రామచంద్రు - వాఁడిమిఁ జెనకి యెవ్వరు నిల్చువారు;
ఇప్పటిశౌర్యంబు నెఱుఁగుదుఁ గొంత - తప్పక విను ముగ్రదానవాగ్రణుల
నిరువురతోఁ గూడి యేపూర్వరోష - ధరమున వ్యాఘ్రరూపముఁ దాల్చి యేను
దపమునఁ గృశుగాఁగఁ దలఁచుచుఁ బోవ - నపు డేమి చెప్ప మూఁడంబకంబులను
ముగ్గురి నేసిన మ్రొగ్గి యిద్దఱును - మ్రగ్గి రాయుశ్శేషమహిమ యెట్టిదియొ?
యే నొక్కవిధమున నిక్కడఁ గూలి - ప్రాణంబు లుండుటఁ బట్టి చూచుకొని
యంతనుండియు రాము నతులవిక్రమము - చింతించి నాలోనిచేవఁ బోవిడిచి
రవ మన్న రథ మన్న రమణీయ మన్న - రవి యన్న రతి యన్న రత్నంబు లన్న
మఱియు రేఫాదినామము లెవ్వి విన్నఁ - దఱుచైనభీతి నాతనిగ నెన్నుచును
ఈవిధిఁ దపసినై యిట్లున్నవాఁడ - రావణ! యెఱుఁగవు రాముపౌరుషము;790
తలఁపక తనరోఁత దలఁప కింతయును - నలి మీఱి మనశూర్పణఖయ తాఁ బోయి
యనుపమగుణధాము నభిరాము రాముఁ - గనుగొని యీరీతి కామింపఁ దగునె?
తనకు నీవేషంబు తానె కావించి - కొనియె నిందుకు మదిఁ గ్రోధించి పోయి
పరుషత రఘురాముబాణాగ్నిశిఖల - ఖరదూషణాదిరాక్షములు నీఱైరి;
వీరికై నీ వేల విపరీతబుద్ధి - శ్రీరాముఁ బగ గొని చెడు దలంచెదవు
ఇది విచారంబు గా దిది బుద్ధి గాదు - ఇది నీతి గా దింక నీతలం పుడుగు;
నీవు లంకకుఁ బోయి నెమ్మది నుండు - పోవ రామునిచేతఁ బోవు బ్రాణములు;
ఏను నీ కపకార మెన్నఁడు చేయ - నే నేమి చెప్పిన హితముగాఁ గొనుము
ఒచ్చె మెంచక కార్య మొనరించి తేని - యిచ్చెద సగరాజ్య మీ వంటి విపుడు
చెచ్చెఱ రఘురాముఁ జెనకి యే బ్రతికి - వచ్చుట కిందు కెవ్వఁడు పూట చెపుమ?"800
యని యిట్లు మారీచుఁ డాడువాక్యములు - విని రావణుఁడు క్రోధవివశుఁడై పలికె
“లోకైకభర్త! త్రిలోకభీకరుఁడ! - నా కెక్కు డని యొకనరునిఁ జెప్పెదవు;
కడుఁ బ్రాణభయమునఁ గాఱులాడెదవు - విడువక నా కొక్కవెఱపు చెప్పేదవు;
నన్ను రా జనుచు మనంబునఁ గొనవు - చిన్నఁబుచ్చెద వేను జెప్పినపనులు;
నీ వేమిటికిఁ దోడు నినుఁ దోడు వేడ- నీవిధి వచ్చెనే యిప్పుడు నీకు"
నని చంపఁదొణఁగిన నతనిరోషంబు - కనుఁగొని మదిలోనఁ గడు విచారించి

మారీచుఁ డీనీచమరణంబుకంటె - నారాముచేఁ జచ్చు టది యొప్పు ననుచు
దనుజాధిపతిఁ జూచి “తగునీతి నీకుఁ - గొనకొని చెప్పినఁ గోప మేమిటికి?
మఱి బుద్ధిచెప్పిన మంత్రులఁ బట్టి - నఱకఁదలంచు భూనాయకు ల్గలరె?
నీ వేమి చెప్పిన నీచెప్పినట్లు - గావింపఁగలవాఁడఁ గడముట్ట" ననఁగ810
ననురాగమును బొంది యతని మన్నించి - తనరథం బెక్కించి తద్దయుఁ బ్రీతి
నసమానవేగుఁడై యతఁడును దాను - నసురాధిపతి వచ్చె నటఁ బంచవటికి
అట్టిద కాదె కామాతురబుద్ధి - యెట్టును జెడుత్రోవ నేటికిఁ ద్రోయు
నాయెడ మారీచుఁ డరదంబు డిగ్గి - యాయసురాధిపుఁ డపుడు ప్రార్థింప
మాయావి గాన నమానుషమహిమ - మాయామృగాకృతి మది విచారించి
మేలైనకనకంబు మేనును రుచిర - నీలనీలాయతనేత్రయుగ్మంబు
పవడంపుబొమలును భాసిల్లు వజ్ర - నివహకర్ణంబులు నీలవాలములు
పొలుచు పచ్చనిశృంగములు ముత్తియంబు - తొలుకులరత్నబిందువు లైన పొడలు
రాజిల్లు నవపద్మరాగోదరంబు - రాజితఖురములు రమణమై యమర
జగతిపై రోహణాచల మొప్పు మిగిలి - మృగరూపమై వచ్చి మెలఁగుచున్నదియొ!820
కాదేని రాక్షసక్షయముఁ గావింప - నాదట చింతించి యజ్ఞసంభవుఁడు
మెఱుఁగు లెల్లను గూర్చి మృగముగాఁ జేసి - కఱటియై పుత్తేరఁగా వచ్చినదియొ?
జానకి నెఱివేణి శక్రనీలములు - నానాతిదంతంబు లాణిముత్యముల
భామినికెమ్మోవి పవడంపులతలఁ - గామినిచెక్కులు కడిమివజ్రముల
వైదేహితనుకాంతి వైడూర్యమణుల - నాదేవినూఁగారు హరితరత్నముల
భామపాణిద్యుతుల్ పద్మరాగములఁ - గోమలిముఖకాంతి గోమేధికములఁ
బటుతేజమునఁ జాలఁ బ్రహసించుటయును - నటులఁ గీడ్పడి వచ్చి యఖిలరత్నములు
రత్నగర్భాత్మజారత్నంబు నలఁప - యత్నంబుతో మృగం బై వచ్చినవియొ?
సీతకై తనవిల్లు చేకొని విఱిచె - నీతఱి రఘురాము నెలయింతు ననుచు
హరుఁడు పుత్తేరఁగా నాతనిచేతి - హరిణ మిచ్చోటికై యరుదెంచినదియొ?830
సీతమోమున కోడి సీత భ్రమింప - శీతాంశుఁ డనుప వచ్చిన మాయలేడొ?
యని చిత్రవర్ణంబు లైనదీధితులఁ - బెనఁగొని యందందఁ బేర్చి శోభిల్లఁ

మారీచుఁడు మాయామృగరూపధారియై వచ్చుట

గపటసారంగమై కదియ నేతెంచి - యుపమింప నరుదైన యొప్పుల నొప్పి
నెమకుచుఁ బులు మేయు నిజవాలరుచుల - రమణమై వనమయూరముల నాడించుఁ
దఱమిడి యొకమాటు తనపార్శ్వరుచుల - బఱపైనవన మెల్లఁ బసిఁడి గావించుఁ
గుదియక యొకమాటు కుప్పించి దాఁటి - త్రిదశేంద్రచాపంబు తెఱఁగు గావించు
నొకమాటు చెంగున నుప్పరం బెగసి - ప్రకటించు నతులశంపాలతారుచులఁ

దఱిగొని యొకమాటు తనపార్శ్వరుచుల - నెఱి చంద్రకాంతముల్ నీఱు గావించు
మృగయూథములఁ గూడి మెలఁగుచు మేయు - మృగముల బెదరించు మెల్లనె డాగు
నంతంత బొడచూపు నటఁ జేరవచ్చు - నంతలో బెదరి చుట్టదరి కుప్పించుఁ840
దరులనీడల కుల్కుఁ దగఁ బర్ణశాలఁ - జొరబాఱు నంతనె స్రుక్కి క్రేళ్లుఱుకు
వసుధ మూర్కొని చూచు వాల మల్లార్చు - దెసలకు జెవి చేర్చుఁ దెలియ నాలించు
గంచు మించై పాఱఁ గ్రమ్మఱఁ జేరుఁ - గుంచితాకృతి చెవి కొనఁ గదలించు
బచ్చికపట్లపైఁ బవళించి లేచు - మచ్చిక నచ్చోట మౌనులఁ జేరు
ఖురములఁ జెవి గోకుఁ గొమ్ములతుదల - విరులతీఁగె గదల్చి విరు లెల్ల రాల్చు
నందంద నందమై యాపర్ణశాల - ముందఱ మృగ మిట్లు మోదించుచుండె.
నావేళ సీతయు నలరులు చిదుమ - లావణ్యశీల యల్లనఁ బర్ణశాల
మంజుళశింజానమంజీరరవము - రంజిల్ల వెడలి సౌరభములఁ బొదలు
పొదల డాయుచు విరుల్ పొసఁగఁ గోయుచును - మదికి విస్మయమంది మాయంపులేడిఁ
గనుఁగొని వై దేహి కడుఁజోద్య మంది - యినకులాధిపుఁ జూచి యిట్లని పలికె.850
"చూపుల కింపార సొంపు గల్పింప - నేపారి యున్నది యేమి చోద్యంబు
నీపొంత వింతయై యిది యొక్కమృగము - భూపాల! చూచితె పొదలుచున్నదియు
నెన్నడుఁ బొడగాన మిన్నిచందముల - వన్నెలమృగముల వనభూములందు
జగతీశ! యీమృగచర్మంబునందుఁ - దగిలి సుఖింప నెంతయు వేడ్క పుట్టె.
దిననాథకులనాథ! దీని వెన్ దగిలి - చని వేసి వెస దీనిచర్మంబు దెమ్ము.
అది యేల నీయుపాయంబున దీని - చెదరక పట్టి తెచ్చెదవేని మిగుల
మంచిది ప్రాణేశ! మనవనవాస - మెంచఁగ నిది తీరె నీపైఁడిమృగముఁ
బురికి వేడుకఁ గొనిపోయి యత్తలకు - భరతాదులకు వేడ్క పఱుపంగవచ్చు”
నని సీత ప్రీతిమై నాడువాక్యములు - విని లక్ష్మణుఁడు రామవిభుఁ జూచి పలికె.
“మృగరాజునకు నిట్టి మేను లే దుర్వి- మృగమాత్రమున కిట్టి మే నెందుఁ గలదు?860
మాయామృగము దీని మఱి నమ్మఁదగదు - మాయావు లసురలమాయ గానోపు!
నది గాక నిచటిసంయములు మారీచుఁ - డదయుఁడై మాయావియై యిందు మెలఁగు
నని పల్క వినమె యాయసురగాబోలు - మనల భ్రమింప నీమాడ్కి నేతెంచెఁ
జిత్తంబు దీనిపైఁ జేరిచి మీర - లుత్తలపడి పట్ట నూహింపవలదు.
ఆరయ వైదేహి యతిముగ్ధయైన - మీరలు ముగ్ధులే మేదినీనాథ!"
యనిన రాముఁడు సీతయాననాంబుజము - కనుఁగొని నవ్వి లక్ష్మణుఁ జూచి పలికెఁ
"జలియింప నేటికి సౌమిత్రి! యింత - యిల రాక్షసులమాయ లెదురునే నన్ను?
మృగ మేని కొనివత్తు మేటిరక్కసులు - దెగ నేను పొలివుత్తుఁ దెలిసి యీరెండు
మగుడ నెక్కడఁ బోవు మాయామృగంబు - దెగువమై లక్ష్మణ! దీని వెన్ దగిలి

చంపి చర్మముఁ దెచ్చి జానకి కిత్తు - నింపార లక్ష్మణ! యిప్పుడే దీని870
యిన్నినాళ్ళకు సెల వీకోర్కి వేఁడ - జిన్నఁబుత్తునె సీత చెప్పినచేఁత?
హితమతివై పూని యీపర్ణశాల - నతివ నేమఱకు మీ" వని యొప్పగించి
యల్లన రఘురాముఁ డనుజుచే నున్న - వి ల్లంది మోపెట్టి వెరవొప్పఁ గదలి
యాగమృగంబు ము న్నర్థి వెన్కొనిన - యాగజాసురవైరియనఁ జెన్ను మిగిరి
కొంకుచుఁ బొదమఱుంగునఁ బొంచి పొంచి - క్రుంకుచు నంతంతఁ గూడదాఁటుచును
మగిడి చూచుటయును మఱుఁగున నిలిచి - తగులునఁ బట్టంగఁ దమకమందుచును
విల్లునమ్ములు వెన్క వ్రేలిచి పట్టి - యల్లనఁ జరణంబు లవనిపై నిడుచు.
జప్పుడు గాకుండఁ జనుచుఁ బట్టుటకుఁ - జొప్పడు నొప్పును జూచి డాయుచును
నదె చేరి పట్టెద నదె చేరె ననుడు - నదియె లోపడియె నా కని చెలంగుచును
నివ్విధంబునఁ బోవ నేచి యామృగము - దవ్వులఁ బొడచూపుఁ దనుఁజేరవచ్చుఁ880
బట్టఁబోయిన మిట్టిపడి పాఱిపోవుఁ - గట్టల్క రామునిఁ గన్నంత నిలుచుఁ
బలుదెసలకుఁ బాఱు బాళితోఁ గూడి - సెలవుల పులురాల్చుఁ జేష్టలు మాను
నెసఁగి వీక్షింపఁ బై కెగసి క్రేళ్లుఱుకుఁ - బస మించి మిన్నులపైఁ బాఱుచుండుఁ
గుప్పించి దాఁటుఁ జెంగునఁ దీఁగమెఱుఁగుఁ - ద్రిప్పినగతి జిహ్వ ద్రిప్ప నందంద
కొఱవి ద్రిప్పినరీతిఁ గుమ్మరిసారె - తెఱఁగున బ్రమసి దిర్దిరఁ దిరుగుచును
బడలినగతి మ్రొగుఁ బజ్జ కేతేర - వడి సాళువంబుకైవడి మింటి కెగయు
నలసి రాముఁడు వెఱఁ గంది నిల్చుటయుఁ - గెలఁకులఁ బొడచూపుఁ గికురించి మెలఁగుఁ
దెగి యేయఁ దలఁప నదృశ్యమై పోవు - మగిడి రాఁదలఁచిన మఱి మ్రోల నిలుచు
గలగొని యీభంగి గాకుత్స్థముఖ్యు - నలయించి యలయించి యవలకు నవల
గొనిపోయి పోయి యాఘోరదుర్గములఁ - గనుఁబ్రామి యటఁ బోవఁ గడగినఁ జూచి
మాయామృగం బని మఱి రాముఁ డెఱిఁగి - దాయ నీ వెక్కడ దప్పిపోయెదవు

మాయామృగము రామునిచేఁ గూలుట

అగపడి తంచు బ్రహ్మాస్త్రంబు దొడుగ - నగములు వడఁకెఁ; బన్నగభర్త దలఁకె
జగములు బెదరె; దిక్చక్రంబు లదరెఁ - దెగఁగొని దృష్టి సంధించి యేయుటయు
నాలోన నొఱలుచు నారూప ముడిగి - హాలక్ష్మణా! యను నార్తరావమున
దెస లద్రువఁగ మహాదీర్ఘదేహమున - నసువులు పెడవాసి యసురయై పుడమిఁ
గూలె; రాక్షసలక్ష్మి గూలె; రావణుఁడు - గూలె; లంకాపురి గూలె నన్నట్లు.
అంత మాయామృగ మవనిఁ దెళ్లుటయు - సంతోసమున దాని జానకీవిభుఁడు
గనుగొని మారీచుఁగా నిశ్చయించి - తనతమ్ముమాటలు దలఁచి మెచ్చుచును
సౌమిత్రి సీత నీచపలరాక్షసుని - యీమహారవమున కెంత వేగెదరొ?
యని తలంకుచు నుండ నాయార్తరవము - విని సీత భీతిల్లి వెస నుర్విఁ ద్రెళ్లి.900

తెలిసి దిక్కులు చూచి ధృతి దీర డించి - లలిఁదూలి యెలుఁగెత్తి లక్ష్మణుఁ జూచి
"సౌమిత్రి! యిది యేమి చందమో? నేఁడు - రాముఁడు ని న్నార్తరవమునఁ జీఱె;
ననఘ! నీ వాపలు కాలింపలేదు - విననొల్లవో కాక వినరాదొ నీకు?
నులుకవు భీతిల్ల నొకకొంత గలఁగ - వలయవు శోకింప వది యేమి నీవు?
నానావిధంబుల నాయంతరంగ - మూనినవగలఁ బెల్లుడుకుచున్నదియు,
నడవుల కొంటిమై నటు పోయినాఁడు - తడవాయె రాఁడు యుద్ధంబున నేఁడు
కడిఁది రక్కసుల కెక్కడఁ జిక్కినాఁడొ - తడయక పో వన్న ధరణీశు వెదుక"
నని యశ్రుపూరంబు లందందఁ దొరుగు - జనకనందనకు లక్ష్మణుఁ డిట్టులనియెఁ
“దల్లి! నీ వేటికిఁ దలఁకెదు రామ - వల్లభునకుఁ గీడు వచ్చుట లేదు,
ఎఱుఁగవే నీకూర్మిహృదయేశుమహిమ - లెఱిఁగి యీవెడమాట లి ట్లాడఁదగునె?910
నివ్వటిల్లెడివగ నిన్నింత గలఁప - నెవ్వఁడో రాక్షసుం డిటు చీఱెఁ గాక
యినకులాధిపుఁ డేడ? నీదైన్య మేడ? - జనకజ నీ వేల చంచలించెదవు?
దలమీఱి రఘురామధరణీశుఁ దొడరి - పొలియక నిలుతురే పోర రాక్షసులు?
మిడుతలు కార్చిచ్చుమీఁద గర్వించి - పడి నిల్వ నేర్చునే భస్మంబు గాక;
కావున రామాజ్ఞఁ గడఁచి నిన్ డించి - పోవఁజూచుట నాకు బుద్ధి గా దింక;
నీకానలోపల నే డించిపోవ - నేకీడు వచ్చునో యేఁ బోవ వెఱతు,
నలయక నామాట లాత్మలో నమ్ము - తలఁకకు" మనవుడు ధాత్రీతనూజ
యొలసినకోపాగ్ను లొగి మండుచుండ - నలయుచు సౌమిత్రి నటు చూచి పలికె.
"నీవు రామునిదెస నెఱయ భక్తుఁడవు - నీ వేల నేఁ డింత నీచుండ వైతి?
శ్రీరాముఁ డిట నిన్నుఁ జీరుట వినియు - దారుణమతిఁ బగదాయచందమున920
నెమ్మది నున్నావు; నీ కిది దగునె? - తమ్ముఁడు ప్రాజ్ఞుఁ డుత్తముఁ డీతఁ డనుచు,
భూపతి నిను నమ్మి పోయినచోట - నీపాపవర్తన మేల కైకొంటి?
వగు నెఱింగితి రాముఁ డసురులచేతఁ - దెగుట నిక్కముగాఁగఁ దెలిసి నీ వర్థి
ననుచితమతిఁ బూని యాలస్య ముడిగి - ననుఁ బొందఁ దలఁచెదో నాన వో విడిచి?
కాదేనిఁ గొనిపోయి కైకేయిసుతుని - కాదట నొప్పింతు నని తలంచెదవొ?
ఏను నాదగు జీవ మీశరీరమునఁ - బూనఁ దలంచుట బుద్ధి గా దింకఁ,
దడయక పోయి గోదావరిలోనఁ - బడి ప్రాణము ల్విడ్తుఁ బలుకు లింకేల?"
యని బెడిదపుమాట లవనిజ పలుక - విని లక్ష్మణుఁడు చాల వేదనఁ బొంది,
రాముఁ బేర్కొని కర్ణరంధ్రముల్ మూసి - దీమసంబున నాల్గుదిక్కులు చూచి
"తెలియ వింటిరె ? వనదేవతలార - పలుమఱు పాపముల్ పలుకుచున్నదియు.930
మీ ఱందఱును సాక్షి మేదినీతనయ - ఘోరభాషల నన్నుఁ గ్రూరతఁ బలికె”
నని బాష్పలోచనుం డై లక్ష్మణుండు - తనమది నిఁక నిల్వఁ దగవు గా దనుచుఁ

"దల్లి! యే నిదెపోయి తడయక నీదు - వల్లభుఁ గొనివత్తు వగవకు" మనుచుఁ
బర్ణశాలకుఁ జుట్టుఁ బరు లేడు వ్రాసి - వర్ణించి యీబరుల్ వడి దాఁటకమ్మ!
ఎవ్వఁడే నీబరుల్ వెస దాఁటివచ్చు - నవ్వీరవరు తల లవియు నాక్షణమె;"
యని పల్కి యనలుని నపుడు ప్రార్థించి - వనిత నేమఱకు నీ వని యెప్పగించి
జగతీతనూజకు సద్భక్తి మ్రొక్కి - పొగలుచు రాముచొప్పునఁ బోయె నంత.
నత్తఱి రావణుం డరుదార వేచి - యుత్తలంబునఁ జిత్త ములుకుచునుండఁ

రావణుఁడు భిక్షుకవేషధారియై సీతాదేవియొద్ద కేతెంచుట

గరమున దండంబు ఘనకమండలువు - నురులలాటంబున నూర్ధ్వపుండ్రంబు
కొలఁదులౌ వ్రేళ్లను గుశపవిత్రములు - పొలుపొందు పేరురంబున జన్నిదములు940
నరుదార వలకేల నక్షమాలికయు - సరిఁ బూని యున్న కాషాయవస్త్రములు
తులసిపూసలపేర్లతోడ ముందటికి - వలనొప్ప నొకకొంత వ్రాలినమెడయు
బడుగుదేహంబును బావలు చింపి - గొడుగును వెడముడిగొన్నట్టిశిఖయు
నలవడఁ గపటసన్న్యాసివేషంబు - విలసిల్ల వెడవెడ వ్రే ళ్లెన్నికొనుచుఁ
గొన్నిమంత్రంబులు గొణఁగుచు మునులు - త న్నెఱింగెద రని తత్తఱించుచును,
దలకొన్న ముదిమిచేఁ దల వడంకంగ - నలయుచు నొలయుచు నసు రుసు రనుచు
నంతంత నిలుచుచు హరి హరి యనుచు - శాంతిఁ బొందుచుఁ బర్ణశాల కేతెంచు
తనుఁ జూచి వనదేవతలు జగద్రోహి - చనుదెంచె వీఁ డని సభయులై యొదుగ,
నిక్కపుమునివోలె నిలిచినఁ జూచి - యక్కపటాత్ము సంయమిఁ గాఁగ దలఁచి
క్రక్కున వై దేహి కడుభక్తి మెఱసి - మ్రొక్కి హస్తాంబుజంబులు ముకుళించి950
సౌమిత్రి వ్రాసిన చక్కనిబరులు - నమరంగఁ గడఁచియు నతిభక్తితోడఁ
బొలఁతి యభ్యాగతపూజ గావించి - కలఁగుచు నట్లున్నఁ గల్యాణిఁ జూచి
"యోభామ! నీ విట్టి యుగ్రదుర్గముల - నేభంగిఁ జరియించె ది ట్లొంటి నిలిచి
రతివొ? శ్రీసతివొ? భారతివొ? కాకున్న - క్షితి మర్త్యసతుల కీచెలువంబు గలదె?
నీమోము పండువెన్నెలపిండుఁ దెగడు - నీమోవికెంపు తానిగ్గులఁ దెగడు
నీమేను సౌదామినీలతఁ గేరు - నీమాట సుధతేటనీటులఁ దేరు
నీవేణి జలదవేణికలఁ దరుము - నీవిలాసంబు వర్ణింప నాతరమె?
తరుణి నీకౌఁగిటఁ దవిలి సుఖించు - పురుషుఁడే తలపోయఁ బురుషో త్తముండు
కామిని నీపొందు గలవాఁడె పూర్ణ - కాముఁ డాతఁడు నిత్యకల్యాణుఁ డరయ
నిచ్చట నీయున్కి కెంతయు వగపు - నచ్చెరు వయ్యెడి నబ్జాక్షి! మాకు960
నెలఁత! నీ వెవ్వరు? నీ వేల యింత - నలఁగెద విక్కాననములోన నిలిచి
యంతయు నెఱిఁగింపు" మనిన నాసీత - యెంతయు భక్తితో నిట్లని పలికె.
”ననఘాత్మ! రఘురామునతివ; మాతండ్రి - జనకుండు; దశరథేశ్వరుఁడు మామామ;

నాపేరు సీత; యున్నతకీర్తి రామ - భూపతి తమతండ్రి పొ మ్మన్న వెడలి
కాననంబుల నుండఁ గడఁగి వచ్చుటయు - నేను లక్ష్మణుఁడు తో డేగుదెంచితిమి.
ఈయాశ్రమంబున నేము మువ్వురము - పాయని నియతిఁ దాపసులమై యుండ
నొలసి మాముందఱ నొకపైఁడిమృగము - పొలయుచుండఁగఁ జూచి భూనాథుఁ జూచి.
దాని నేగతినైనఁ దనకుఁ దెమ్మనినఁ - బూని రాముఁడు వోయెఁ బోయినపిదప
హాలక్ష్మణా! యను నార్తరావంబు - శూలమై నాచెవి సోఁకి గాడుటయుఁ
బొగిలి లక్ష్మణు నేను బొమ్మన్నఁ బోయె - మగిడి రాఁ డిది యేమి మాయయో? యెఱుఁగ"970
నని పల్కి మునిఁ జూచి “యనఘ! నీపేరు వినుపింపు; మిం దేల విచ్చేసి?"తనినఁ
గొంకక తనదైన కుహకత్వ ముడిగి - లంకాధినాథుఁ డాలలన కిట్లనియె.
“వనజాక్షి! విను మేను వనధిమధ్యమున - నెనయ లంకాపుర మేలెడివాఁడ;
రాక్షసాధిపుఁడ; విశ్రవసునందనుఁడ - యక్షేశు ననుజుండ; నఖిలదిగ్జయుఁడ;
రావణుం డనువాఁడ; రణములోపలను - దేవాసురుల నైనఁ దెగటార్చివైతు
వనిత! నీరూపలావణ్యసంపదలు - విని, చూడ వచ్చితి వేడ్క లుప్పొంగ
నవయుచుఁ బేదమానవునితోఁ గూడ- నువిద! నీ కడవుల నుండ నేమిటికి?
నారాజ్య మంతయు నలినాయతాక్షి! - కోరి యేలుచు నీవు కొమరు దీపింపఁ
బొగడొందుపెంపునఁ బుష్పకంబాది - యగువిమానములందు హర్మ్యంబులందు
సురగరుడోరగాసురసిద్ధసాధ్య - వరకన్యకలు గొల్వ వర్తింతుగాక!980
నీయంఘ్రిరుచులు నానిలయభూములకు - మాయని మణికుట్టిమము లగుఁగాక!
చెలియ! నీచూపులసిరులు నామేడఁ - గలువలతోఁ జాలఁ గలహించుఁగాక?
నీమందహాసంబు నిత్యంబు నాదు - ప్రేమాంబునిధికిఁ జంద్రిక లగుఁగాక!
రమ్ము నాలంకాపురంబున" కనుడు - నమ్మాట విని సీత యతిభీత యగుచు
ధీర గావున వానిఁ దృణముగాఁ జూచు - తీరునఁ దనచేతితృణము చూచుచును
“సారపతివ్రతాచారగా యనక - యోరి! న న్నిటు లాడ నుచితమే? నీదు
ననిమిషయోగ్యపూర్ణాహుతి శునక - మునకు దుర్లభమైనపోల్కి భావింప,
శ్రీరామచంద్రునిఁ జెందిననన్నుఁ - గోరి కామింప నీకును నెన్నితలలు?
పొమ్ము గుట్టున నీదు పురవరంబునకు; - నెమ్మదిఁ బోక దుర్నీతి నేమేని
దలఁచితి వేని? నాధవుఁడు రాఘవుఁడు - విలసితశస్త్రాస్త్రవిదితలాఘవుఁడు990
హరచండకోదండహరణవినోది - ఖరదూషణాదిరాక్షసశిరశ్ఛేది
నిన్ను నీవంశంబు నీఱుఁ గావించు - నెన్నంగ నీకు నాయినకులాగ్రణికి
నక్కకు సింహంబునకును దోమకును - దిక్కరికిని బయోధికిని గాల్వకును
వాయసంబునకును వైనతేయునకు - నేయంతరము పెద్ద లేర్పరింపుదురొ?
యాయంతరము గల దటుగాన నీవు - ధీయుక్తి లంకకుఁ దిరిగిపొ మ్మింక.”

నన విని రావణుం డాగ్రహోదగ్ర - జనితోగ్రదృష్టిమై జానకిఁ జూచి
యనుపమాటోపుఁడై యారూప ముడిగి - తనమనోవీథిఁ గందర్పుండు వెలుఁగ
బదియవస్థలు దోఁచి భాసిల్లు పగిదిఁ - బదితలల్ మణిజూటపంక్తుల నొప్ప
నాయవస్థలఁ గోర్కు లవి యిన్మడింపఁ - బాయనిగతి నొప్ప బాహు లిర్వదియుఁ
గొన లిన్మడింపఁ గోర్కులు పల్లవించె - ననఁ బద్మరుచులైన హస్తంబు లొప్ప
లలి దోఁచుకోర్కి పల్లవములఁ బుష్ప - ములఁ బోలు నాయుధంబులు పొల్పు మిగుల1000
బరఁగ దివ్యాంబరాభరణౌఘకాంతు - లరుదార మదనాగ్నులై మండుచుండ
నతిభీకరాకారుఁ డై నిల్చుటయును - ధృతి దూలి సీత భీతిల్లి మూర్ఛిల్లి .
వడి గాలిఁ బడియున్న వనలత వోలెఁ - బడియున్నఁ గనుఁగొని పంక్తికంధరుఁడు.
గ్రమ్మి యశ్రువు లొల్కఁ గౌఁదీగ యుల్కఁ - గ్రొమ్ముడి ముడివీడఁ గుచము లల్లాడ
నందందఁ దెగి రాల హారరత్నములు - పొందిన భయశోకముల మేను వడఁక,
నచ్చారులోచన నదయుఁడై యెత్తి - తెచ్చి రథంబుపైఁ దెఱఁగొప్పఁ బెట్టి
దైవంబు ప్రేరేపఁ దనపాలిమృత్యు - దేవతఁ గొనిపోవుతెఱఁగు దీపింప
నమరారి గొనిపోవ నాకాశవీథిఁ - గమలలోచన దేరి కను విచ్చి చూచి
పెదవులు దడపుచు బిగిచన్నుదోయిఁ - బ్రిదిలినపయ్యెద బిగియఁ జేర్చుచును1010
నెలుఁగెత్తి కొదమకోయిల గూసినట్లు - పలుమాఱు విధి దూఱి ప్రాణేశుఁ జీఱి

జానకి శోకించుట

యలఁతయుఁ గోపంబు నతివిషాదంబు - వెలవెలపాటునై విలపింపఁ దొడఁగె.
“నోరాఘవేశ్వర! యోరామచంద్ర! నీరజహితవంశ! నీదేవి నన్ను
ననదచందంబున నక్కటా! యిపుడు - గోనిపోవుచున్నాఁడు కుటిలరాక్షసుఁడు
వేవేగ చనుదెంచి వీని మర్దించి - కావవె; నాలజ్జ కావవే నన్ను;
నేలరా రాక్షస! యీనింద నీకు; - నీలంక నేలరా నీవె కాల్చెదవు?
తగదురా నీకు నీదారుణక్రమము - దెగటార్చురా నిన్నుఁ దివిరి రాఘవుఁడు;
కనకమృగము నేల కనుఁగొంటి నేను - నినవంశవల్లభు నేల పొమ్మంటిఁ;
గాదన్నపలుకేల కైకొన నైతి? - మేదినీవిభుఁ డేల మృగము దేఁబోయె?
జగతీశులా వేల చర్చింప నైతిఁ - బొగిలి లక్ష్మణు నేల పొమ్మంటిఁ దిట్టి?1020
నాపాలివిధి యేల ననుఁ బోవ నిచ్చు? - నీపల్కు లేటికి? నిటు సేయకున్న
నన్న లక్ష్మణ! నిన్ను నభిమానధన్యుఁ - గన్నతల్లిగ నన్నుఁ గరమర్థి నెన్ను
నున్నతగుణమాన్యు నుదితసౌజన్యు - నన్నితెఱంగుల నాడినఫలము
గుడిచితి; వేవేగ కోపంబు దక్కి - కడువేగమున వచ్చి కావవే నన్ను;
నక్కటా! కైక నీవడిగినవరము - లిక్కడఁ జేకూరెనే యిటమీఁద?
నీకుమారుండును నీవును గూడి - యేకాతపత్రత నేలుఁ డీవసుధ."

నని రామవిభుఁ జీరి యసురేశు దూఱి - తనశాంతిఁ బొగడి యాదైవంబుఁ దెగడి
కాకుత్స్థతిలకు లక్ష్మణుఁ గొనియాడి - కైకఁ బోనాడి శోకంబున మఱియు
“మిథిలేశుకూఁతుర మేదినిఁ బంక్తి - రథునకుఁ గోడల రామునిదేవి
వలతుఁలై కావ నెవ్వరు లేనిచోటఁ - బొలదిండి చెఱఁగొని పోవుచున్నాఁడు1030
తరులార! నాసహోదరులార! మీరు - ధరణీశ్వరునితోడఁ దగఁ జెప్పరయ్య!
సురలార! మీరైన సురవైరిఁ దాఁకి - వెరవొప్ప నాచెఱ విడిపింపరయ్య!
నిండినభక్తితో ని న్నాశ్రయించి - యుండితి; ననుఁ గావ నుచిత మీవేళఁ;
దగిలి నీవైన గోదావరీదేవి - జగతీశ్వరునితోడఁ జని తెల్పవమ్మ!
పల్లదుచేఁ జేఱఁబడి చిక్కువడితిఁ - దల్లి! నీవైనను దగఁ గావవలదె?
భూదేవి! రఘురామభూపాలమణికి - నీదురవస్థ పెం పెఱిఁగింపవమ్మ!
వీరు వా రనక యివ్విధమునఁ జీర - నో రెండె ధృతిఁ దూలి నొచ్చెఁ బ్రాణములు;
ననుఁ గావరయ్య! కిన్నరులార! పుణ్య - తనులార! ఘనులార! తాపసులార!
కృతులార! హతులార! ఖేచరులార! - వ్రతులార యతులార! వనపక్షులార!
కరులార! హరులార! గంధర్వులార! - నరులార! సురలార! నాగేంద్రులార!"1040
యని పెక్కుభంగుల నమ్మహితనయ - పొనుపడి శోకింప భూదేవి వడఁకె;
గౌతమి వారక గ్రక్కున నిలిచె - నాతఱి సకలభూతాక్రోశ మెసఁగె;
నన్యాయ మన్యాయ మని మునుల్ కపట - సన్యాసి రావణుచందంబు దెలిసి
పొగిలిరి శోకాశ్రుపూరముల్ దొరుగ - మృగములు వినుచుండి మేతలు మఱచెఁ;
బక్షులు వాపోయెఁ, బవనంబు లడఁగె - వృక్షముల్ వాడె నావిల మయ్యె నభము
దిక్కులు పగిలె నాదినమణి నొగిలె - ది క్కేది యని ధర్మదేవత పొగిలె;
వనదేవతలు చాల వగచిరి సాధు - జనులెల్ల నేడ్చిరి జానకిఁ జూచి;
యత్తఱి విహగేంద్రుఁ డరుణతనూజుఁ - డుత్తమసాహసుం డొకకొండ నుండి
యొక్కలుం డగు జటాయువు బిట్టు వినియె - నక్కట రఘురామ యను నార్తరవము
విని సంభ్రమించి నివ్వెఱఁగంది దిశలు - గనుఁగొని మొగమెత్తి గగనంబుఁ జూచి1050
“యదయుఁడై రావణుం డారాముదేవి - పొదివి యిమ్ములఁ గొనిపోవుచున్నాఁడు.
నాఁ డీవనంబున ననుఁ గన్నమొదలు - పోఁడిమి ఘనమైత్రిఁ బ్రోచు రాఘవుఁడు
తగ దింక వర్జింప దైత్యు నిర్జించి - తెగువమై వైదేహిఁ దెత్తు నొండేని,
యినకులాధిపునకు నింకఁ బ్రాణములు - ననిమొన నొప్పింతు నని నిశ్చయించి
కులిశంబుధార తాఁకునకు నేభంగి - నలవిగా కెగయు మహాద్రిచందమున
నురుశక్తి మైఁ బెంచి యుంకించి యెగసి - పొరిఁబొరి గిరిశృంగములు నుగ్గుగాఁగ
మరలించి పుక్కిటిమాంసఖండములు - ధరణిపై నుమిసి యుదగ్రభావమున
ఖరనఖంబుల నున్న కరిసింహశరభ - శిరము లంతంత కచ్చెరువుగాఁ దొరుగఁ

బటుతుండరోచులు పక్షదీధితులు - చటులకోపోగ్రలోచనములు దనరఁ
బక్షానిలంబులఁ బర్వతాగ్రముల - వృక్షము ల్విఱిగి దిగ్వివరముల్ నిండఁ1060
బరఁగు రావణుతమఃపటలంబు నడఁప - నరుదెంచు మధ్యందినాదిత్యుకరణి
నాసన్నబలరావణాదిత్యు మ్రింగ - రాసి యుగ్రత వచ్చు రాహుచందమున
వడిఁ బేర్చి కదియు రావణరాహు మ్రింగఁ - దడయక చనుదెంచు తార్క్ష్యునిభంగి
"నిలు నిలు నిలు పోకు నిలు పోకు పోకు - నిలు నిలు రఘురామనృపచంద్రుదేవిఁ
గుటిలరాక్షస! యెందుఁ గొనిపోయె దింక - నెటు పోయె దెటు పోయె దెందుఁ బోయెదవు?
పోయినఁ బోనీను బోనీను నిన్ను - వేయుదు ఖండింతు విదళింతుఁ ద్రుంతు
దండింతు, దండింతుఁ, దల లుత్తరింతుఁ - జెండు బెండుగ" నంచు సీత నీక్షించి
“యోడకోడకు దేవి! యుగ్రరాక్షసుని - నీడాడి నీచెఱ నే విడిపింతు"
ననిన నాపల్కు మహానిదాఘమున - వనమయూరికి ఘనధ్వనియును బోలె
వేడుక కొంత గావింపఁగా నలరి - వాడినమోముతో వగలఁ గుందుచును1070
నాసీత పల్కె “జటాయువా! నన్ను - నీసురకంటకుం డెత్తి యుద్వృత్తి
మాయచే రామలక్ష్మణుల వంచించి - యోయన్న! కొని యేగుచున్నవాఁ డిదిగొ!"
యని పల్క విని యంత నరుణనందనుఁడు - ఘనమైనకోపంబు కడిమియుఁ దోఁప
నలుకమై రథమున కడ్డంబు వచ్చి - ప్రశయాభ్రనిర్ఘోషపటుభాషణములఁ
బలుమాఱు దశకంఠు భర్జించుకొనుచు - నిలిచి యిట్లనియె నూనినధైర్య మెసఁగ
"బరమపావనుఁడైన బ్రహ్మమన్మఁడవు - వరపుణ్యనిధి విశ్రవసుతనూజుఁడవు
ధనదానుజుండవు దానవాగ్రణివి - విను మిట్టికృత్యంబు విహితమే నీకు?
జగదేకపతి రామజననాథుదేవిఁ - దగ దోరి! కొనిపోవఁ దగ దోరి! నీకు;
ముదలించి తేక రాముని డాఁగురించి - సుదతి నీభంగిఁ దెచ్చుట బంటుతనమె?
నీలంకయును నిన్ను నీబంధుజనులఁ - గాలుచు రోరి రాఘవుకోపవహ్ని1080
యెఱిఁగియు విష మిట్టు లేల క్రోలెదవు? -ఎఱగొన్న పెనుబాము నేల త్రొక్కెదవు?
అఱువదివేలేండ్ల యతివృద్దు నన్ను - నెఱుఁగుదో యెఱుఁగవో యే జటాయువును
నీపుణ్యసాధ్వి నీ విప్పు డొప్పించి - పోపొమ్ము పోకున్నఁ బొరిపుత్తు నిన్నుఁ

రావణునితో జటాయువు పోరుట

దుండాగ్రమున విల్లు తునుకలు చేసి - మండితవర్మమర్మములు భేదించి
యడరి నీదైన ప్రాణాభిమానములు - విడిపించి జానకి విడుపింతు" ననిన
నరదంబు నిలిపి యుదగ్రుఁడై దైత్య - వరుఁ డల్గి విలుగుణధ్వనిఁ జేసి పేర్చి
ఘోరబాణము లేయఁ గోపించి విహగ - వీరుఁడు తద్బాణవితతులు విఱిచి
యురుపక్షయుగమున నురము ధట్టించి - పొరి ఫాలములు చీరి భుజములు దన్ని
తరమిడి ఖరనఖతతుల నొప్పించి - కరము కోపించి రాక్షసకులేశ్వరుఁడు

ఖగరాజునెఱకలు గాఁడ నుగ్రంబు - లగుబాణము ల్పది యడరి యేయుటయుఁ1090
దుండాగ్రమున విల్లు తునుకలు చేసి - ఖండించి వడిఁ బతాకలు నేలఁ గలిపి
దనుజేశుమకుటముల్ ధర డొల్ల వ్రేసి - పెనఁచి సారథిఁ జంపి ప్రేవులు చీల్చి
తల మీఱి దనుజురథ్యములఁ జెండాడి - చలమొప్ప నరదంబు చదియ మోదుటయు
విరథుఁడై రాక్షసవిభుఁడు కంపించి - ధరణిపైఁ బడి లేచి ధరణిజఁ గొనుచు
మాయాబలంబున మఱి మింటి కెగసి - పోయెఁ బోయినఁ జూచి పోనీక పేర్చి
యడ్డగించి జటాయు వాకాశవీథి - నొడ్డినగతిఁ దాఁకి "యోరి పాపాత్మ!
జుణిగి యేలోకంబుఁ జొచ్చిన నైనఁ - దృణముగాఁ బట్టి వధింతు ని" న్ననినఁ
దిరిగి రోషమున దైతేయవల్లభుఁడు - గర ముగ్రమైన ముద్గరము వైచుటయు
నది తుండమునఁ ద్రుంచి యతనిమస్తకముఁ- జదియంగ నడిచి కేశములు ద్రుంచుటయు
సురవైరి కోపించి స్రుక్కక కదిసి - యురువడిఁ బక్షీంద్రు నొడిసి రాఁదిగిచి,1100
మొగిఁ బట్టి యందంద ముష్టిఘట్టనలఁ - దగిలి నొప్పించె నుద్ధతశక్తి మెఱసి
దనుజేంద్రవిహగేంద్రదారుణయుద్ధ - మనిమిషాదులు చూచి యాశ్చర్యపడిరి;
యరుదైనకడిమిచేత రావణుఁడు - కర ముగ్రమగునట్టి ఖడ్గ మంకించి
యెఱకలు పదములు నెగసి త్రుంచుటయు - నెఱిఁ దూలిఁ ఖగపతి నేలకు వ్రాలె;
వ్రాలిన వైదేహి వగ నొక్కవృక్ష - మూలంబు చేరి రామునిఁ బేరుకొనుచు
వాపోవుచుండ రావణుఁ డంకసీమ - నాపరమపతివ్రతాంగన నునిచి

సీత యాభరణముల ఋష్యమూకపర్వతమునఁ బడవేయుట

యంత సంతోషించి యాకాశవీథి - నెంతయు రయమున నేగె రావణుఁడు,
అప్పుడు బ్రహ్మాదు లగుసురల్ మునులు - తప్పఁడు రాముచే దశకంఠుఁ డీల్గు
మనమనోరథములు మనకు సిద్దించు - నని చెప్పికొని యుబ్బి రందఱు ప్రీతి;
ననిమిషపథమున కంత రావణుఁడు - చన రయంబున సీత చరణనూపురము1110
సురవైరి కుత్పాతసూచకం బగుచు - నురువడిఁ జనుదెంచి యుల్కయై పడియె
జగతిపై జాహ్నవి జలధార లొలుకు - పగిది నయ్యాకాశపథమున నుండి
చెలువకుచంబులఁ జెందుహారములు - దెలియ కందంద మేదినిఁ దెగిపడియె.
నాలోన సీత హాహారవం బంది - లోలోనఁ గడునడలుచుఁ బోయి పోయి
యట ఋశ్యమూకంబునందు వానరులు - పటుసత్త్వు లేవురఁ బరికించి కాంచి
తనవస్త్రమునఁ గొంత తగఁ జించి పుచ్చి - తనభూషణంబులు దానె బంధించి,
వీరైన రామభూవిభున కీవార్త - లారయఁ దెలుపరే యనుబుద్ధి నపుడు
దడయక రాముచే దశకంఠుఁ డింకఁ - జెడు నంచు ముడియు వైచిన విధంబునను
వారిమధ్యంబున వైచుచుఁ బోవ, - వారును దాఁచిరి వడిఁ బుచ్చి దాని
దనుజాధిపతి యంత దశరథాత్మజులు - తనవెంట వత్తురన్ దల్లడం బొదవ1120

వెలవెలఁ బాఱుచు వెనుకఁ జూచుచును - దలఁకుచు వడి సముద్రము దాఁటి పోయి
జడిగొన్న మరణసూచకనిమిత్తములు - పొడచూపఁ గని రయంబున లంకఁ జొచ్చి
యనుపమవివిధభోగాస్పదం బైన - తననగరికి వచ్చి తగురాజసమున
జనకపుత్రికిఁ దనసకలసంపదలు - మునుకొని యెంతయు ముదముతోఁ జూపి

జనకజను అశోకవనమునం దుంచుట

"యివె నానివాసంబు; లివె నాధనంబు - లివె నాతురంగంబు! లివి నాగజంబు;
లివి యేను దివిజుల నెల్ల భంజించి - తివుటమైఁ గైకొన్న దివ్యభూషణము;
లిదె కుబేరుని గెల్చి యేను గైకొన్న - మది కింపు గావించు మణిపుష్పకంబు;
వీరె నా కుడిగముల్ వేర్వేఱఁ జేయు - చారణామరసిద్ధసాధ్యకామినులు
వారె నామాట గర్వమునఁ గైకొనక - కారాగృహంబుల గాసిల్లుసతులు;
అవె నాట్యశాల; లల్లవె కేళివనము; - లివి చంద్రశాల లోయిందీవరాక్షి;1130
కరమర్థి నింతకుఁ గర్తవై నీవు - నరుదార భోగింపు మఖిలసంపదల;”
ననవుడుఁ దృణఖండ మతివ చేఁబట్టి - కొని పల్కె వానిఁ గైకొనక యెంతయును
"యోరి! నీ కీపాప మూరక పోదు - ఘోరాగ్నియై నిన్నుఁ గొని కాల్చుఁ గాని,
నిడివిగాఁ బ్రతుకరు నీవు నీవారు - చెడిపోవఁగలవారు సిద్ధ మీపలుకు
రాముబాణానలరాశిలో మునిఁగి - నీమేను వడిఁ గాలి నీఱు గాకున్న
ఘనమైన యీపాతకము లెట్లు దీరు?" - నని పల్కి వైదేహి యందందఁ బొగిలి
"యిట్టి మద్వాక్యంబు లీవు నాచెవులఁ - బెట్టితి నేఁడు నాపెం పెల్లఁ బొలిసె,
నామాన మిటు చేసె న న్నింత చేసె - నే మని విలపింతు నింక నావిధికి”
నని మహారోదన మందందఁ జేయుఁ - దనమదిఁ గోపించి దనుజవల్లభుఁడు
తెఱఁగొప్ప నప్పుడు త్రిజటాదులైన - తెఱవలఁ బిలిచి ధాత్రీపుత్రిఁ జూపి1140
"యెందు నేమఱక మీరందఱు గాచి - పొందుగా ననుఁ బొంద బోధింపుఁ" డనుచు
"నెనసిన కడఁక నియ్యింతి నశోక - వనములో నిడుకొని వర్తింపుఁ" డనుచుఁ
బనిచి కాఁపులు పెట్టి పంక్తికంధరుఁడు - దనమది మదనాగ్నిదగ్ధుఁడై యుండె.

శ్రీరాముఁ డాశ్రమమునకు మరలివచ్చుట

మాయామృగముఁ జంపి మఱి రామవిభుఁడు - ఆయెడ మఱియొకయన్యమృగంబు
జంపి తన్మాంసంబు జర్మంబు గొనుచు - నింపొంద మరలి తా నేతెంచుచోట
మ్రోయు జంబుకరవంబులకుఁ గుందుచును - నాయాస మందుచు వట వచ్చివచ్చి
రామభూపాలుఁ డరణ్యమధ్యమున - సౌమిత్రిఁ బొడఁగని చాల భీతిల్లి
"యకట! లక్ష్మణుఁడ! నాయాజ్ఞ గైకొనక - వికలదైర్యమున వివేకివై యుండి
యత్తన్వి సీత నయ్యడవిలో డించి - వత్తురే? యి ట్లేల వచ్చితి వీవు;

జగతిపైఁ గలుగురాక్షసు లెల్ల మనకుఁ - బగ యౌట యెఱుఁగవే పరికించి చూడఁ1150
గులహాని గుణహాని గురుధర్మహాని - తలపోయవలదొకో? తమ్ముఁడ! నీవు"
అన విని లక్ష్మణుం డతిభీతిఁ బొంది - యనయంబు కంపించి హస్తముల్ మొగిచి
"జగతీశ! నా కిటు చనుదేరఁ దగదు - తగ కున్కి యెఱుఁగుదుఁ ద్రైలోక్యనాథ!
మాయామృగాకృతి మఱి మిమ్ముఁ ద్రిప్పి - పాయక మీదివ్యబాణాగ్నిశిఖలఁ
గూలుచు నుండి యాకుటిలరాక్షసుఁడు - హాలక్ష్మణా! యన్నయార్తరావంబు
సీతామహాదేవి చెవి సోఁక మిగుల - భీతిల్లి మీదైన పెంపెల్ల మఱచి
“యన్న! మీయన్న చొ ప్పరయఁ బొమ్మన్న - నెన్నఁడు నెఱిఁగింపఁ డీదీనవృత్తి
సౌమిత్రి!” యనవుడు జానకిఁ జూచి - యామహీతనయ కిట్లంటి నే నపుడు
“పనివడి మనయందు భయముఁ బుట్టింతు - నని రాక్షసుఁడు క్రూరుఁడై చీఱెఁ గాక!
యినకులాధిపుఁ డేడ? నీదైన్య మేడ? - జనకజ! నీ వేల చంచలించెదవు!"1160
అనవుఁడుఁ గోపించి యద్దేవి నన్ను - వినరానిపలుకుల వెస దూఱి పలుక
నేను నామదిలోన నెంతయు వగచి - దానికి వనదేవతల సాక్షిఁ జేసి
యిట కేను వచ్చితి నిక్ష్వాకుతిలక - యటుగానఁ దప్పుగా నవధరింపకుము.”
అని బాష్పలోచనుం డై మ్రొక్కియున్న - యనుజుని కరముల నల్లన నెత్తి
కనుఁగవఁ దొరఁగెడు కన్నీరుఁ దుడిచి - యనయంబు వగచి యిట్లనియె రాఘవుఁడు
“ఆజన్మశుద్ధుఁడై యఖిలజ్ఞుఁ డైన - యాజనకునిపుత్రి యై వార్త కెక్కు
నాపుణ్యవతియు నిట్లాడుట యెల్ల - నాపదలకు మూల మని విచారించి
నిలువక వత్తురే నీయంతవాని - కలుగంగఁ దగునయ్య! యతివమాటలకు"
ననుచు సౌమిత్రి నూరార్చి యెంతయును - జననాథుఁ డట నిజాశ్రమభూమిఁ జొచ్చి
“యిది యేమి లక్ష్మణ! యీయాశ్రమంబు - తుదముట్ట శూన్యమై తోఁచుచున్నదియు;1170
వనదేవతానందవచనఘోషములు - వినరావు వినరావు విహగనాదములు,
ఏలొకో మునివరు లిట సంచరింప? - రేలొకో సీత నా కెదురుగా రాదు?
కడుదీనమై బుద్ధి గలఁగెడు నాకు - నెడమక న్నదరెడు నేమొకో నేఁడు?
ఇక్కానలోపల నేనును నీవు - నక్కట! యేదుఃఖ మనుభవించెదమొ?"
అని పర్ణశాలకు నటు చేరవచ్చి - దినకరురుచి లేని దినలక్ష్మి వోలి,
రేరాజుకళ లేని రేయును బోలి - శారిక లేని పంజరమును బోలి,
యెనయుకోయిల లేని యెలమావిఁ బోలి - కనుఁగొన విన్ననై కడువాడఁ బాఱి,
యున్నచందముఁ జూచి యుల్లంబు గలఁగి - విన్ననై ధృతిఁ దూలి వెలవెలఁ బాఱి,
పన్ని శోకరసంబు ప్రవహించె ననఁగఁ - గన్నుల బాష్పాంబుకణములు దొరుగ
బెదవులు దడపుచు భీతిఁ బ్రాణములు - చెదరఁ దమ్మునిఁ జూచి శ్రీరాముఁ డనియెఁ1180
"బోలఁ జూచితి నేను భూమిజ పర్ణ - శాలలోపల నున్న చందంబు లేదు.

పొదలఁ బూవులు గోయఁ బోయెనో లేక - వెదుక నొండొకజాడ వెడలెనో కాక?
సరసులఁ గ్రీడింపఁ జనియెనో కాక - కర ముగ్రమగుభీతిఁ గ్రాఁగెనో కాక?
డాసినపులులకై డాఁగెనో కాక- యీసునఁ గొని యొక్కఁ డేగెనో కాక?
యేచందమో నాకు నింతయుఁ దెలియ - దేచందమున సీత యిందులో లేదు?"
అని వితర్కించుచు నాపర్ణశాలఁ - జనఁ జొచ్చి లోపల సకలంబు వెదకి
జానకి నాపర్ణశాలలోపలను - గానక ప్రాణముల్ కలఁగి కంపించి
మన సెల్ల చెడి మేను మ్రాన్పడి బోధ - మనురవి శోకాబ్ధి నస్తమించుటయు
భ్రాంతియన్ చీఁకటి ప్రబలమై పర్వి - యంతరంగము గప్పి యక్షులు గప్పి
మరలెడి ధృతిఁ గప్పి మానంబుఁ గప్పి - నెరసిన వికలుఁడై నేలకు వ్రాలి1190
“వదలక సీతకై వగచెడి నన్నుఁ - బ్రిదిలి పోనీక నొప్పించె నీవగలు;
యీవల నా కిపు డేత్రోవ వచ్చె - నేవెంట ధరియింతు నింక నీవగల?
నేమెయి వచ్చితి మిక్కాననముల - కేమాట లాడుదు నితనితో నింక
నే నన్న నితనికి నితఁడు నాతమ్ముఁ - డేను నీతఁడు గూడి యెట్లు వ్రేఁగెదము?"
అని విచారము బుద్ధి నణుమాత్ర మైన - నునుపనేరక రాముఁ డుల్లంబుఁ గలఁగి

శ్రీరాముఁడు ప్రలాపించుట

మదనవేదనల నున్మత్తుచందమునఁ - బెదరి చూచుచుఁ దనపెం పెల్ల మఱచి
తనుమధ్య నీవింత తడవెందుఁ బోయి - తని చూచు నిందు రమ్మని చేరఁ బిలుచుఁ
బ్రియ మొప్పఁ బైఁబడుఁ బెనచిరాఁ దిగుచు - బయలు కౌఁగిటఁ జేర్చుఁ బలుమాఱు వగచు
నొయ్యన నూరార్చు నొకకొంతవడికి - నొయ్యన దనలోన నొకకొంత దెలియు
“నక్కటా! సౌమిత్రి! యవనీతనూజ - యెక్కడఁ బోయెనో యేమైనయదియొ?1200
వెలఁదియడ్గులచొప్పు వెదకియుఁ గాన - జలజాక్షి యీపర్ణశాలలో లేదు
ఏదెసఁ బోయెనో యిందీవరాక్షి? - కాదొకో యిది దండకావనభూమి?
యీదెస గాదొకొ యిది పర్ణశాల? - కాదొకో రాముఁడ? కానొకొ నేను?
ఐన నాప్రాణంబు లకట! యీబొంది - లోన నెట్లున్నవి లోలాక్షిఁ బాసి?
పూని యీయెడఁ బ్రాణములతగుల్ రోసి - తానును దివి కేఁగ దలఁచితి నేనిఁ?
వ్రతము చెల్లింపక వచ్చె వీఁ డెట్టి - సుతుఁ డంచు నను గణించునే దశరథుఁడు?
కాదేని వ్రతము సాంగంబుగాఁ దీర్చి - మేదిని పాలింపు మిన్నక పురికి
జనినచో మిథిలుఁ డచ్చటికి రా నతనిఁ - గనుఁగొనఁగా సిగ్గు గాదొకో నాకు?
నటుగాన నన్ను నీయడవిలో విడిచి - పటుబుద్ధిఁ బురి కేగి భరతుని గాంచి
తనయనుమతి సర్వధరణిఁ బాలింపు - మని చెప్పి కైకకు నాసుమిత్రకును1210
గౌసల్యకును జనకజ చన్నతెఱఁగు- నాసుద్దియును దెల్పు నను మది నిల్పు”
మని రాఘవుఁడు ఱెప్ప లల్లన వ్రాల్చెఁ - జనకజ మును పర్ణశాలలోనుండి

పోయినగతి మనంబున నుండి వెడలి - పోయెడు నని యడ్డముగఁ జేర్చెననఁగ
నప్పుడు లక్ష్మణుఁ డున్నచందంబుఁ - దప్పక చూచి యెంతయు శోకమంది
యేతల్లి పని సేతు? నేతల్లిఁ గొలుతు? - నేతల్లిఁ దల్లిగా నిటమీఁదఁ జూతు?
నినకులాధిపుశోక మేత్రోవ మాంతుఁ? - దనదుతల్లులకును దనసహోదరుల
కెనయ నీతనితోడిదే లోక మగుట - మనువంశ మంతయు మడిసెఁ బొ మ్మనుచు,
నందంద విలపింప, నంతలో రాముఁ - డొందిన మూర్ఛ దా నొయ్యనఁ దెలిసి
తలకొన్నవగలలో దండకావనము - కలయ నాలోకించి కన్నీరు నించి,
వనజాక్షిఁ జింతింప వగలు రెట్టించి - తనమది శోకించి ధైర్యంబు డించి,1220
"పోయితే సీత! యీ బొందితోఁ బాసి - పోయితే నన్ను నీబొందితో డించి?
పొరి సురాసురలోకపూజార్హ మనక - హరువిల్లు విఱిచితి నతివ! నీకొఱకుఁ,
బరుఁడని తలపోసి బ్రాహ్మణుం డనక - పరుశురాముని భంగపఱిచితిఁ గడఁగి.
నీరజలోచన! నీకునై పూని - యీరెండునిందల నేను గైకొంటిఁ
గడపట నినుఁ బాపెఁ గష్టదైవంబు - పడతి నిందలఁ బడ బాలైతి నేను,
నీవేడుకలు చూచి నీకు నే ప్రియముఁ - గావింతు నని పోయి కపటమృగంబుఁ
జంపి తెచ్చితి దానిచర్మంబు గడఁగి; - యింపార నెవ్వరి కిత్తు నే నింక?
మది నెల్లసుఖములు మఱచి కానలకు - వదలక నను నమ్మి వచ్చినచోట
నినుఁ గావలేనైతి నీచన్నత్రోవఁ - గని రయంబున వచ్చి కదియలేనైతిఁ ;
బరువడి జగమెల్లఁ బాలింపఁజాలు - వరశక్తి గలిగినవానిచందమున1230
మునుకొని శరచాపములు దాల్చి ఘోర - వనదుర్గభూములు వర్తింప వచ్చి
వెడమతి మావారి పెంపెల్ల మఱచి - పడతుక! నినుఁ గోలుపడితి నే నేఁడు;
ఏణాక్షి! నినుఁ బాసి యీశరీరమునఁ - బ్రాణంబు లెబ్భంగిఁ బట్టుదు నింక?
మేదినీతనయ! యిమ్మేదినిఁ బాసి - యేదెస భరియింతు నీదేహ మింక?
నెలఁత! నీవిరహాగ్ని నీదులావణ్య - జలరాశి మునుఁగకఁ జిల్లార్పరాదు;
తగిలి యీశోకాబ్ధిఁ దాఁట నీమేను - తగుతెప్ప లేకట్లు తరియింపవచ్చు;
మగువ! నీపాలిండ్లమఱుఁగు లేకున్న - నొగిఁ గాముశరవృష్టి కోర్వంగరాదు;
న న్నట్లు గొని చనె నళినాక్షి! పిదప - ని న్నిట్లు కొనిపోయె నేఁ డింక మనల
నిరువురఁ బాసిన యీదైవమునకు - నరు దెందుఁ గల దసాధ్యము లెందుఁ గలవు?
కోమలి! ని న్నెత్తికొనిపోవునప్పు - డేమని పలవించి? తేమంటి నన్ను?1240
నేదేశముల కేగి? తెందున్నదాన? - వేదుఃఖముల వేగె ? దేమి చేసెదవు?
ఎవ్వరు గొనిపోయి? రేత్రోవఁ బోతి? - వెవ్విధి వాటిల్లెనే నేఁడు మనకు?
నీయట్టిచదురాలు నీయట్టిముగ్ధ - నీయట్టిలావణ్యనిధి యెందుఁ గలదు?
కలదొకో యొకనాఁడు గర మర్ధి నిన్నుఁ - గలసి వినోదింపఁ గమలాక్షి! నాకు?

జలజాక్షి! నినుఁ గూడి సాకేతపురము - గలవాఁడ నని కాని కాన నొండొకటి,
కలకంఠి! నినుఁ గూడి కనకహర్మ్యములు - గలవాఁడ నని కాని కాన నొండొకటి,
అలివేణి! నినుఁ గూడి యఖిలభోగములు - గలవాఁడ నని కాని కాన నొండొకటి,
నెలఁతుక! నినుఁ గూడి నిఖలసౌఖ్యములు - గలవాఁడ నని కాని కాన నొండొకటి,
యిది మహారణ్యమై యిప్పుడు తోఁచె - నిది పర్ణశాలయై యిప్పుడు తోఁచె,
నిది నాకుఁ దపముగా నిప్పుడు తోఁచె - నిది నాకు దుఃఖమై యిప్పుడు తోఁచేె1250
నేలె మహీపుత్రి! యేలె మృగాక్షి! - యేలె సరోజాక్షి! యేలె లతాంగి!
యేలె వధూమణీ! యెన్నిచందములఁ - గ్రాలుచునున్నాఁడఁ గటకటా!యనవు,
అలసయాసముల బా గంచల కిచ్చి - లలితాంఘ్రిరుచి ప్రవాళంబుల కిచ్చి
వరకుచోన్నతి చక్రవాకుల కిచ్చి - కరములకెంపు పంకజముల కిచ్చి
మెయిచాయ క్రొక్కారుమెఱుఁగుల కిచ్చి - నయనవైభవము మీనములకు నిచ్చి
చల్లనిముఖదీప్తి చంద్రున కిచ్చి - తెల్లనినగవు చంద్రికలకు నిచ్చి
చెలువంపుఁబలుకు రాచిలుకల కిచ్చి - యలకలనునుఁగాంతి యళులకు నిచ్చి
సన్నపునడు మాకసంబున కిచ్చి - నిన్ను దైవము మ్రింగెనే నేఁడు సీత!
హావామలోచన! హాపద్మగంధి! - హావారిజానన! హాసీత!" యనుచు
వివశుఁడై రామభూవిభుఁడు నల్వగలఁ - దవిలి దీనతఁ బొంది తమ్మునిఁ జూచి1260
“యేదెసఁ బోయెనో యిందీవరాక్షి - పోదమా లక్ష్మణ! భూమిజ వెదుక?
నొలసి యీపొదలలో నున్నదో పోయి - పిలుతమా లక్ష్మణ! పృథ్వీతనూజ
నేతరుబాటుల కేగెనో యింతి? - చూతమా లక్ష్మణ! శుకమంజువాణి?
యిత్తమ్మికొలఁకుల కేగెనో సీత - వత్తమా లక్ష్మణ! వనజాక్షి నరసి?"
యని యిట్టు పలుమఱు నతిదీనవృత్తి - మనమునఁ గొని జాలి మఱిమఱి తూలి
ధరియింపరాని వేదనలతో రామ - ధరణివల్లభుఁడు గౌతమి చేరఁబోయి
"యోలోకపావని! యోలోకమాత! - యీలోకపావని నెఱుఁగవే సీత?
నోలోకబాంధవ! యోకరసాక్షి! - యేలీలనైన నీ వెఱుఁగవే సీత?
నోసర్వసంచార! యోజగత్ప్రాణ! - యాసీత నెఱుఁగవే యనఘ! నీవైన
నెలదీఁగ! కానవే యెలదీఁగ బోఁడి - జలజంబ! కానవే జలజాతగంధి?1270
హరిమధ్యఁ గానవే హరిరాజ! నీవు? - కరిరాజ! కానవే కరిరాజగమన?
హరిణంబ! కానవే హరిణాయతాక్షిఁ - బరభృత! కానవే పరభృతవాణి?
నళినాథ! కానవే యలినీలవేణిఁ? - దిలకంబ! కానవే తిలకాంచితాస్య?"
ననుచు విభ్రాంతుఁడై యిటుల నందందఁ - జనిచని వెదకుచు జాలిఁ దూలుచును
నెడపక యిబ్భంగి నెందు వైదేహిఁ - దడవి కానక జనస్థానంబు వెడలి,
విన్ననై విరహార్తి వివశుఁ డై యున్న - యన్న నీక్షించి యిట్లనియె లక్ష్మణుఁడు.

లక్ష్మణుఁడు రాముని శాంతిపఱుచుట

“అన్న! నీ వఖిలలోకారాధ్యపరుఁడ - వున్నతచిత్తుండ వురుబలాడ్యుఁడవు
ఇంతికై వెనుఁబడి యిన్నిచందముల - నింత శోకింతురే? యినకులాధీశ!
యీమోహశోకంబు లిట నీకుఁ గలవె? - దామసమోహనార్థము గాదె జగతి?
నరుదుగా నీదువి ల్లందితివేని? - సురలైన నీదిక్కు చూడ నోడుదురు;1280
అసమానసత్వుండ వఖిలేశ! నీవు - వసుధేశ! నాయంతవాఁడు నీబంటు
అక్కటా! నీ కసాధ్యము లేందుఁ గలవు? - దక్కఁగ నీపేర్మి దలఁపవు గాక?”
అనిన రాముఁడు శోక మంతయు నుడిగి - తనమదిఁ దెలివొంది తమ్మునిఁ జూచి
"యే నింక నిటమీఁద నెన్నిచందముల - జానకి నెడఁబాసి సైరింపఁజాల
వారక నాదు దుర్వారబాణములు - ధారుణీతలము విచారించి చించి
పాతాళవాసులఁ బట్టి సాధించి - శీతాంశుముఖియైన సీత సాధింతుఁ;
గాదేని సప్తసాగరములు గలఁచి - మేదినీధరముల మెదిచి నుగ్గాడి
యీరసంబున దిగ్గజేంద్రకుంభములు - దారించి మేదినీతనయ సాధింతుఁ;1290
గాదేని నఖిలదిక్పాలమర్మములు - భేదించి యాదిత్యబింబంబుఁ ద్రుంచి
పొరిఁబొరి నక్షత్రముల డుల్లనేసి - ధరణిఁ జీఁకటిఁ జేసి తరుణి సాధింతుఁ;
గాదేని సకలరాక్షసుల భస్మంబు - గా దివ్యబాణముల్ కడఁకతో నేసి
యవని యరాక్షస మై యుండఁజేసి - తివుటమై నేఁడు వైదేహి సాధింతుఁ;
గాదేని బ్రహ్మలోకం బెల్లఁ గలచి - యాదిమబ్రహ్మ సంహారంబు చేసి
బలసి జీవుల కెల్ల భయముఁ బుట్టించి - నెలకొన్నకడిమిమై నెలఁత సాధింతు;
నీరీతి భుజశక్తి నేఁ జూపకున్నఁ - జేరి మిన్నక సురల్ సీతఁ జూపుదురె?
యదె! చూడు నాదుబాణానలశిఖలు - పొదలుచునున్నవి భువనంబు లదర
నదె! చూడు వై దేహి" నని విజృంభించి - "త్రిదశులు మెచ్చ సాధించెద" ననుచు
నొదవి లోకములకు నుత్పాతహేతు - వుదయించె నన బొమ లుఱక నిక్కించి
బలసి జీవులతోడ బ్రహ్మాండమెల్ల - నలిఁజేయు సంకర్షణస్వరూపంబు;
రూపించు లయకాలరుద్రుండు వోలెఁ - గోపించి వి ల్లందుకొన్నమాత్రమునఁ1300
దలఁకె జీవములు భూతల మెల్ల వడఁకెఁ - గలఁగె లోకంబులు గగన మల్లాడె
బ్రహ్మాండభాండంబు పగిలిన ట్లయ్యె - బ్రహ్మ మంత్రము దప్పె రవి దప్ప నడచె
నక్షత్రములు డుల్లె నభవుండు వెఱచె - యక్షదేవాసుర లాత్మఁ జేడ్పడిరి.
అత్తఱి సౌమిత్రి యారాముఁ జేరి - చిత్తంబు భయ మందఁ జేతులు మొగిచి
“కాకుత్స్థ! నీ వతికారుణ్యనిధివి - లోకరక్షణకళాలోలచిత్తుఁడవు
జనకజకొఱకునై సకలలోకములు - మునుమిడి నిర్మూలములు సేయఁదగునె?
యొండొండ వనముల నొగి సముద్రముల - నిండినపురముల నిఖిలదేశముల

నలయక వైదేహి నరసి లేకున్న - చలము పెంపున మఱి సాధింతు గాని!"
యని లక్ష్మణుఁడు పల్క నతఁడును బ్రీతి - విని కోప ముడిగి తా విల్లెక్కు డించి
యఖిలేశుఁ డగురాముఁ డట దక్షిణాభి - ముఖుఁడునై తానుఁ దమ్ముఁడు వోవుచుండె.1310
నాతఱిఁ దెరువున నందంద మెఱసి - సీతకొప్పుననుండి చిందిన విరులు
ఆతన్వివక్షోజహారరత్నములు - నాతతమణిమయం బైన యానాతి
పదనూపురము లుర్విఁ బడియున్నఁ జూచి - ముదము శోకంబును మూర్ఛయుఁ గదుర
నప్పుడు రఘురాముఁ డాత్మఁ జింతించి - తప్ప దెవ్వఁడొ క్రూరదానవుం డొకఁడు
కుటిలకుంతల నెత్తుకొని పోయినాఁడు - గటకటా! యని త్రోవ గనుఁగొంచుఁ బోవ
నంతంత రాక్షసునడుగులచొప్పు - నంత నాతెరువున కనతిదూరమున
నరయుచు నరయుచు నందంద పోయి - కరమర్థిఁ జూచిరా కమలాప్తకులులు;
రాలినయెఱకలు రక్తపంకమున - గూలిన సూతుపైఁ గూలినతేరు
దేరుక్రిందటఁ బడి తెగినయశ్వములు - ధారణిఁ బడిన పతాకఖండములు
విఱిగి ముందట నున్నవింటితున్కలును - నఱిముఱిఁ బడియున్న యస్త్రశస్త్రములు1320
గని లక్ష్మణుఁడు చూపఁ గడుఁజోద్య మంది - ఘను లెవ్వరో యిందుఁ గదనసౌఖ్యంబు
లనుభవించినవార లని యివ్విధంబు - గనుఁగొనుతలఁపునఁ గాకుత్స్థకులుఁడు

జటాయువునకు అగ్నిసంస్కారము సేయుట

దెరు వంతకంత శోధించుచు ముంద - ఱరుగుచో రఘురాముఁ డాసమీపమున
నెలమి నెంతయుఁ దూలి యెఱకలు విఱిగి - కలయ నెత్తుటఁ దోగి కాళ్ళును దునిసి
పవిచేతఁ గూలిన భర్మాద్రి వోలి - వివశుఁడై పడియున్న విహగేంద్రుఁ గాంచి
“సౌమిత్రి! చూచితే చపలరాక్షసుఁడు - భూమిజ మ్రింగి తాఁ బొడచూప వెఱచి
చలియించి పక్షివేషమున నున్నాఁడు - బెలుకుఱి వీని చంపెద” నంచుఁ గడఁగి
ఘనచాపహస్తుఁడై కదిసిన రాముఁ - గని పక్షివిభుఁడు గద్గదకంఠుఁ డగుచు
నెత్తురుఁ గ్రక్కుచు నిట్టూర్పు లెసఁగఁ - గుత్తుకఁ బ్రాణముల్ గుదివడఁ బలికె.
"ధరణీశ! యేను మీతండ్రికి సఖుఁడఁ - బరఁగంగఁ గశ్యపబ్రహ్మపౌత్రుఁడను,1330
నరుణనందనుఁడ జటాయువన్వాఁడఁ - జరియింతు నడవుల శైలశృంగముల,”
నని “నాదువృత్తాంత మంతయు నీకు - వినుపింప నే మున్ను విశదంబు గాఁగ
నట్టివానికి నిట్టి యాపద యెట్టు - పుట్టె నటన్న నోపుణ్యాత్మ! వినుము
వలనొప్ప నేఁడు రావణుఁడు నీదేవి - నెలమి ముచ్చిలికొని యేగుచో నేను
బోనీక యడ్డమై భూరిసత్వమున - వానితోఁ బోరాడి వసుధఁ గూలితిని;
ఇదె వానికేతుసమేతసూతాశ్వ - విదితరథం బాజి విఱిగె నాచేతఁ;
జలమున దివి నంతఁ జపలరాక్షసుఁడు - నెలతుకఁ గొనిపోయె నీవు రావైతి;
నేను నీ కీవార్త యెఱిఁగింపఁ గంటిఁ - బూని నీశుభమూర్తిపొడ గానఁ గంటి

నతిపుణ్యకృతి నైతి" నని విన్నవింప - మతిలోన శోక మిన్మడిగ రాఘవుఁడు
వి ల్లటు పడవైచి వివశుఁడై ధరణిఁ - ద్రెళ్ళి సౌమిత్రి బోధింపఁగాఁ దెలిసి1340
“యయ్యో! మహాత్మ! జటాయువా! నీకు - నియ్యవస్థలు వచ్చెనే మదర్థముగ?"
నని జటాయువుదేహ మందందఁ దడవి - తనురక్త మంతయుఁ దానె తుడ్చుచును
దమ్మునిఁ జూచి "యీతఁడు మనకొఱకు - నిమ్మాడ్కి రావణు నెదిరి పోరాడె
నిటువంటిపుణ్యాత్ముఁ డెందైనఁ గలఁడె - యటుగాన దివి కీతఁ డరుగకమున్నె
రావణుఁ డేలెడి రాజధానికిని - ద్రోవయు వానిబంధురపరాక్రమము
నన్నియు నడుగు మీ" వన్న లక్ష్మణుఁడు - కన్నన రఘురామకార్యసహాయు
వాజటాయుని నిర్జరాదివిధేయు - నోజఁ దద్విధ మెల్ల నుచితోక్తి నడుగఁ
గొన్నిమాటలు పేరుకొనుచుఁ గుత్తుకకుఁ - క్రొన్నెత్తు రొలుకఁ బల్కుల కెడలేక
యతులపుణ్యోదయుం డగు రాముఁ జూచి - మతిలోన నతని సంస్మరణ మేమఱక
మోక్షపథానందమునఁ బులకించి - పక్షివల్లభుఁ డంతఁ బ్రాణముల్ విడిచె.1350
ధరణీశసుతు లంత దశరథాధీశుఁ - మరణంబుకంటెను మదిఁ జాల వగచి
విహగవల్లభునకు వేదోక్తయుక్తి - దహనాదికృత్యముల్ దగ నాచరించి

కబంధుఁడు రామలక్ష్మణుల నడ్డగించుట

యంత వేవేగ క్రౌంచారణ్యమునకు - నెంతయుఁ గడఁకతో నేగి యచ్చోట
నానాలతావృక్షనగమృగోదగ్ర - మైనట్టి యొకకోన నరుగుచో నచట
నెఱసినకురులును నిడుదకోఱలును - బఱపైనకడుపును బడబాకినోరు
మిడిగ్రుడ్లకన్నులు మీఁగాళ్ళదాక - విడిబడ్డచన్నులు వెఱ్ఱిచిన్నెలును
నలర నయోముఖి యను దైత్యవనిత - కలితసౌందర్యలక్షణుని లక్ష్మణునిఁ
గనుఁగొని, కామించి కర మంటఁబట్టి - తనుఁబొంద రమ్మని తరితీపు సేయ
జుప్పనాతికి నెట్టి సుఖమిచ్చె దాని - కప్పాట నసిధార ననువార నొసఁగి
దుందుభిపటహాదితూర్యనాదముల - క్రందునకంటె నగ్గలముగా నపుడు1360
ముందఱ నొకమ్రోఁత మోయంగ దాని - చందంబు గనుఁగొనఁ జనుచు రాఘవులు
యోజనాయతబాహుఁ డొగిఁ బారసాచి - యేజంతువులనైన నేపుమై నొడిసి
యఱిముఱి మ్రింగుచు నావలించుచును - జుఱవుచ్చి మస్తకశూన్యుఁ డై నిలిచి
యుదరంబు నోరుగా నున్న కబంధు - విదళితబహుజీవవితతకబంధుఁ
ద్రిదశనిర్బంధు సందీప్తమదాంధుఁ - గదిసి రాముఁడు చూచి కడుచోద్య మందె.
వాఁడును దనకరద్వయమున వారి - వేఁడిమి చెడఁ బట్టి వేవేగ దిగువ
నన్నను జూచి యిట్లనియె లక్ష్మణుఁడు - "నన్ను వీనికి భక్షణము చేసి మీరు
సీత నన్వేషించి చేకొని సకల - భూతల మేలంగఁ బొం" డన్న నతఁడు
చింతించుచును వానిచేతులవెంటఁ - గొంతదూరము వోయి కూర్మితమ్ముఁడును

దానును బుద్ధి నెంతయు విచారించి - పూనికమీఱ గొబ్బున నొఱల్ వెఱికి1370
కడువాడిఖడ్గముల్ గైకొని వానిఁ - గడఁగి చేతులు రెండు ఖండించుటయును
నుబ్బెల్లఁ జెడి దైత్యుఁ డొఱలుచుఁ దూలి - గొబ్బునఁ దెలివి గైకొని వారిఁ జూచి
"మీ రెవ్వ" రనుడు సౌమిత్రి సర్వంబు - శ్రీరామచరితంబు చెప్పిన దాని
వినుటచే నంతట విజ్ఞాన మొదవఁ - దనదువృత్తాంత మంతయుఁ జెప్పఁదొడఁగె.
“దను వను దివ్యుండ, ధరణీశ! యేను - ఘన మైన మునిశాపగతి నిట్టు లైతి.
కనకగర్భునిచేతఁ గామరూపత్వ - మును జిరంజీవిత్వమును గాంచి, క్రొవ్వి
యిట్టిరూపము దాల్చి యెల్లసంయములఁ - బట్టి బాధింపఁగఁ బరమకోపనుఁడు
స్థూలశిరుం డన శోభిల్లుమునికి - నీలోకమునఁ దొల్లి యెగ్గుఁ గావించి
యతిఘోరరూపుఁడ నై యేను మరల - నతనిఁ బ్రార్థించిన నతఁడు మీవలన
నతులశాపవిముక్తి యగు నంచుఁ బలుక - మతిలోన నదియెల్ల మఱువక పిదప1380
నది యాదిగా నిట్టియాకృతిఁ బూని - త్రిదశేంద్రు నాజి కేతెమ్మన్న నతఁడు
కంఠంబు తలతోడఁ గడుపులోఁ బోవ - గుంఠితంబుగ వ్రేసెఁ గులిశపాతమున"
ననిన రాఘవుఁడు "దశాననుచంద - మనఘ! నీ వెఱుఁగుదె?" యనిన వాఁ డనియె
"నెఱుఁగుదుఁ గాని మౌనీంద్రుశాపమున - నెఱుక చాలదు నాకు నీశరీరమున
ననలంబు దరికొల్పుఁ డామీఁద మీకు - వినుపింతుఁ దెలియ నివ్విధ" మన్న వారు
దనువు శరీరంబుఁ దగ సంస్కరింప - ననలుని కాదేహ మాహుతి యయ్యె.
నతఁ డంత దివ్యుఁడై యాకాశవీథి - నతులవిమానంబునందుండి పలికె.
“నోరఘురామ! యాయోధనోద్దామ! - కారుణ్యతారుణ్యగాంభీర్యధుర్య!
కాకుత్స్థవర్య! నీకారుణ్యదృష్టి - పైకొన నాతొంటిపద మందఁగంటి.
విను మింక రావణువిధమెల్ల నేను - వినుపింతుఁ దేటగా వివరించి యతఁడు1390
ధనదానుజుఁడు పులస్త్యబ్రహ్మకూర్మి - మనుమండు తనతపోమహిమ మెప్పించి
నలువచే వరము లున్నతిఁ గాంచినాఁడు - చెలఁగి దిగ్విజయంబు చేసినవాఁడు
తొలివేలుపుల కెల్ల దొరయైనవాఁడు - కలవేలుపుల కెల్ల గంటైనవాఁడు
బలుతలల్ పదియును బాహు లిర్వదియు - గలవాఁడు లవణసాగరఖేయమైన
లంకాపురంబు పాలన సేయువాఁడు - బింకాన రజతాద్రిఁ బెఱికినవాఁడు"
అని చెప్పి రావణుం డాసీతఁ గొనుచు - జనినమార్గము చెప్పి సరగ నాదనువు
మఱి త్రోవ గుఱుతులు మార్గంబు చెప్పి - తఱుచైనవస్తువుల్ తప్పక చెప్పి
మేరఁగాఁ బంపాసమీపంబునందు - నారూఢమతి మతంగాశ్రమం బొప్పు
నమ్మునిశిష్యురా లయినట్టి శబరి - మిముఁ బూజించు; నమ్మెలఁత యున్నెడకు
మీరలు వోవ నమ్మిహిరసూనునకుఁ - గూరిమిచెల్మి గల్గును; దానివలన1400
జానకిఁ బొందెదు సామ్రాజ్యపదవిఁ - బూని గాంతువటంచుఁ బోయె నద్దివికి.

దను వటు దివ్యపదంబున కరుగ - మనువంశతిలకులు మఱునాఁడు కదలి
పంపాసరోవరపశ్చిమస్థలిని - సంపూర్ణతరులతాసంపదఁ బొదలి
ప్రబలి పుణ్యములకుఁ బట్టైనయట్టి - శబరియాశ్రమవనస్థలికిఁ బోవుటయు

రామలక్ష్మణులు శబరిని గాంచుట

నెదురుగావచ్చి యయ్యింతి సద్భక్తిఁ - బదముల కటు సాగఁబడి లేచి మ్రొక్కి
“దశరథవరపుత్ర! తాటకాజైత్ర! - కుశికసంభవయాగకుశలప్రయోగ!
చిరమునిధ్యేయ! శిక్షితతాటకేయ! - పరమగంగాతీరపాదసంచార!
పదరజోనైర్మల్య! పాలితాహల్య! - విదళితహరచండవిపులకోదండ!
భీమభార్గవరామ! బిరుదాభిరామ! - కామితపితవాక్యకరణసుశ్లోక!
ప్రకటాపరాధవిరాధనిరోధ!- సకలమునిత్రాణ! సత్య ప్రవీణ!1410
ఖరదూషణాదిరాక్షసశిరశ్ఛేది! - మరణార్థిమారీచమర్దినారాచ!
సీతావియోగసూచితమోహరాగ! - ఖ్యాతఖగాధ్యక్షకల్పితమోక్ష!
యలఘువిక్రమధామ! యతిపుణ్యనామ! - నెలకొని రఘురామ నిను జూడఁగంటిఁ,
బరికింప నాతపఃఫల మందఁగంటి - నరుదైనపుణ్యంబు లన్నియుఁ గంటిఁ,
గాకుత్స్థ! తెరువునఁ గడుడస్సి తెందుఁ - బోక మాయాశ్రమంబున నేఁడు నిలువు
అనఘాత్మ! మాగురుఁ డైన మతంగ - మునిచేత నీకథ మును వినియుందు;
నీ వాద్యుఁడవు సర్వనిగమవేద్యుఁడవు - గావున నిను నుతుల్ గావింపఁదరమె?
యిది యామతంగమునీంద్రునాశ్రమము - విదితతపశ్చర్యవిశ్రాంతికరము”
అని యామహత్త్వంబు లన్నియుఁ దెలిపి - వనమూలఫలములు వలనొప్పఁ దెచ్చి,
యిచ్చిన భుజియించి యెలమి నారాముఁ - డచ్చటఁ బ్రీతిమై నారాత్రి నిలిచి1420
ఘనజటాబంధైకకబరి నాశబరిఁ - గనుఁగొని మఱునాఁడు కాకుత్స్థుఁ డనియె.
“దరమిడి మిగుల సీతావియోగాగ్ని - దరికొన నెంతయుఁ దలఁకుచున్నాఁడ
నొకచోట నిలువలే కులుకుచున్నాఁడ - వికచాబ్జముఖి సీత వెదుకఁ బోవలయుఁ
బనివినియెద" నన్నఁ బరమసంతోష - మును బొంది శబరి రామునిఁ జూచి పలికె.
"దను వను ఘనుఁడు ముందఱఁ జేయఁదగిన - పను లెల్లఁ దెలిపె నేర్పడ వేడ్కతోడ.
నైనను మరియు నే నదియె తెల్పెదను - మానవనాథ! నీమది కెక్కునట్లు
రావణుఁ జంపెదు రామ! నీకూర్మి దేవి గూడెదవు సందేహంబు వలదు.
ఐనను నేకాకులై పోవఁ దగదు - భానుకులాధీశ! పరఁగఁ బై నిపుడు
ఇనకులాధిప! యింక నిట ఋశ్యమూక - మను పర్వతంబున కరుగుము నీవు ;
సునిశితమతి సూర్యసుతుఁడు సుగ్రీవుఁ - డనువానరాధిపుఁ డాకొండ నుండుఁ1430
దనవధూరత్నంబు తనరాజ్యపదము - తనయన్న వాలిచేఁ దాఁ గోలుపోయి

యతఁడు శోకాతురుఁడై యున్నవాఁడు - అతనికిఁ గపిసేన లప్రమాణములు
అతనికి విశ్వాస మాత్మఁ బుట్టించి - యతనికి నుపకార మలవడఁ జేసి
యతఁడు నీవును గూడి యటు లంక కరిగి - యతిసత్త్వు రావణు ననిలోనఁ జంపి
బలవిక్రమంబులు ప్రస్తుతి కెక్కఁ - జెలువొప్ప నీదేవి సీతఁ గైకొనుము."
అని యొప్ప శబరి కార్యము లెల్లఁ దెలిపి - తనగురువాక్యంబు తలఁచి యాక్షణమె
యనలంబు దరికొల్పి యయ్యగ్నిలోనఁ - దనశరీరము వేల్వఁ దా సమకట్టి
యాసమయంబున నంతరిక్షమున - వాసవప్రముఖగీర్వాణు లందఱును
మణిఘృణిదేదీప్యమానవిమాన - గణసమారూఢులై కనుఁగొనుచుండ
నారదసనకసనందనప్రముఖ - సారమునీంద్రులు సంతోష మందఁ1440
బరముఁ బరంధాము బరమకల్యాణుఁ - బరిపూర్ణుఁ బరమాత్ముఁ బరమేష్ఠివినుతు
నవ్యయు నవికారు నఖిలాంతరాత్ము - నవ్యక్తు నఖిలేశు నాద్యంతరహితు
భవముఖామరవేద్యు భవరోగవైద్యు - రవికులాంబుధిచంద్రు రఘురామచంద్రుఁ
దనమది నిలిపి యత్తరి వలగొనుచు - వినుతించి శబరి యావిభునిసన్నిధిని
ననలునియందు రామార్పణంబుగను - దనశరీరము వేల్చి దైవతానీక
మానితదివ్యవిమానంబు నెక్కి - నానావిధముల వర్ణన సేయ సురలు
దేవలోకమున కెంతే వేడ్కఁ జనియె - దేవదుందుభులు ధింధిమి యని మ్రోయ
ననలముఖంబున నారీతి శబరి - యనిమిషసౌఖ్యంబు లందినయంత
రమణీయమూర్తులు రామలక్ష్మణులు - నమితబలోదగ్రు లచ్చోటు వెడలి
యనవరతాలోక మతిగుణానేక - మునిలోక మగు ఋశ్యమూకంబుఁ గనిరి.1450

శ్రీరాములు ఋశ్యమూకమును జూచి హర్షించుట

త్రైలోక్యవిభు లైన తమరాక చూచి - యాలోలమతి పొంగి యానంద మంది
యనయంబు నొప్పెడు నశ్రుపూరంబు - లన సెలయేరులు నమరినదాని,
నిల మేరుమందరహిమశైలపతుల - నలి మీఱి నగియెడి నగవులో యనఁగ
సాంద్రంబులై యెందుఁ జరుల దీపించు - చంద్రకాంతోపలచ్ఛాయల దాని,
సరసిజాసనుఁడు భూచక్రంబుమీఁద - బరఁగఁ బర్వతరాజపట్టంబు గట్టి
శిరసునఁ బెట్టిన సేసఁబ్రా లనఁగ - నురుశృంగములఁ జుక్క లొప్పెడిదాని,
నురుమతిఁ దనుఁ జొచ్చి యున్నసుగ్రీవుఁ - బరిభవించిన వాలిపై మండుచుండు
గతి సూర్యకాంతముల్ గలయవెలుంగ - నతులప్రతాపోగ్రమై యున్నదాని
మెఱుఁగులు కొమ్ములై మెఱయ నేతెంచి - నెఱయు సానువులందు నీలమేఘములు
పొలుపొందు మదగజంబులు గాఁగఁ దలఁచి - మలయుసామజముల మా నైనదాని1460
నంగజహరుమౌళి నలరు నాకాశ - గంగయై యొప్పులఁ గర మొప్ప నొప్పి
యాయెడఁ గ్రీడించు హంసమాలికలు - మాయని విధుశిరోమాలికల్ గాఁగ

బహుశృంగభూరుహపల్లవచయము - విహితజటాజూటవిభవమై యొప్ప
నాసన్నులై సిద్ధు లర్థి సేవింప - నాసదాశివమూర్తి యన నొప్పుదాని,
బలభేది మొదలుగాఁ బరఁగుదేవతలు - కలయ నంబుధి ద్రచ్చి కన్నవస్తువులు
పనివడి తమలోనఁ బాలుపోకున్న - నునిచిరో యమృతపానోన్మత్తు లగుచు
మఱచిరో యంతయు మంచితా వగుటఁ - దెఱఁగొప్ప దాచిరో దీనిపై ననఁగఁ
గల్పవృక్షంబులఁ గామధేనువుల - వేల్పుకన్నియలను వివిధౌషధములఁ
జింతామణుల నెందుఁ జెడనిపెన్నిధుల - సంతానతరువుల సరి నొప్పుదానిఁ
గని దాని మహిమకుఁ గడుఁజోద్య మంది- యినవంశవల్లభుం డెంతయుఁ బొగడి1470
యఱలేనిభక్తితో ననుజుండు గొలువ - మెఱయు నాశైలసమీపంబునందు
దఱుచైన తొగలనెత్తమ్ములతోడ - వఱలు పంపాసరోవరమున కరిగి
యందును నియతితో నాసరోవరము - నందుఁ గృతస్నానుఁడై రామవిభుఁడు
కలయఁ గనుంగొని కడుచోద్య మంది - విలసిల్లు నొకమావివృక్షంబునీడ
అలసట దీరంగ నపుడు లక్ష్మణుఁడు - సలలితశైత్యోపచారముల్ సలుప
నీక్షించి రఘురాముఁ డేపు దీపించి - వృక్షంబుఁ బరికించి వేడ్క నిట్లనియె.
"వనవాస మిటు తుద వచ్చిన మొదలు - ఘన మైనయద్రులు ఘనపుణ్యనదులు
దరమిడి కంటిమి; ధారుణి నిట్టి - తరు వెందుఁ గాన మీతరువుకు సవతు
సురపతిమొదలగు సురలెల్లఁ గూడి - కరమర్థి నీతరు గావించి రొక్కొ?
యజుఁడె యీతరువున కాయువుఁ బోసి - నిజముగా నిచ్చట నిలిపినాఁ డొక్కొ1480
రవిసుతుతపమున రాగిల్లి బ్రహ్మ - భువిని నీతరువును బుట్టించినాఁడొ?
సేవించి యమృతంబు చేకొని సురలు - భావించి రవిసుతుపక్షంబు గలిగి
యరయంగ మేలైన యమృతంబుతోడఁ - బురణింపఁ దరువుగాఁ బుట్టించినారొ?
యినునితో నిష్టంబు లింపొందఁజేయఁ - జనుధర్మముననుండి శాఖ లున్నతము
లష్టదిక్కులకును ననువందఁ బాఱి - యిష్టఫలంబులు నీఁ గోరినట్లు
పఱచుశాఖలరుచిప్రభ నొప్పు మీఱి - తెఱచి పర్ణంబులు తేజంబు గొప్ప
రవిదృష్టి చొరనీదు; రాత్రులఁ బేర్మి - దవిలి యాశశిదీప్తి దనుఁ గాననీదు
ఫలము లాయమృతపుఫలములకంటెఁ - గలశతగుణములఁ గడునొప్పుదాని,
తరురాజపట్ట మీధాత్రిపై వేడ్కఁ - గరమర్థి దివిజులు గట్టరో ప్రీతి?"
నని తమ్మునికిఁ దెల్ప నగుఁగాక యనుచు - వినయోక్తి నారామవిభుచిత్త మెఱిఁగి1490
యాలోన సౌమిత్రి యన్నకు భక్తి - శాలియై మృదుపర్ణశయ్య గావింప,
సముచితస్థితి మృదుశయ్య రాఘవుఁడు - విమలచిత్తంబున వేడ్క శయింప
సౌమిత్రి రఘురాముచరణంబు లొత్త - శ్రీమీఱ నిద్దఱు చెలఁగుచునుండ
ననఘుని రఘురాము నట లక్ష్మణుండు - గని వెండి యెలుఁగెత్తి గ్రక్కునఁ బలికెఁ.

"గైకొందు చెలి నని కలయంగ నొప్పి - చేకొని చిఱుత రా చేరువఁ బట్టి
యెల్లెడ శుభములె యెసఁగు నీ కనుచు - బల్లిదీప్తంబుగాఁ బలికెఁ బో చెవికి;
భానునిపైఁ బక్షి పరుసున నెలుగు మానుగాఁ గూర్చెద మహిపుత్రి నీకు
ననియు నించుక చేరి యంతయు రొప్పఁ" - దనయాత్మఁ గడుమెచ్చి తమ్మునిఁ జూచి
యినవంశవల్లభుం డిట్లనిపలికె - "వనచరాధీశుండు వడి నేగుదెంచి
ఘనభక్తి మనలను గలయు నిచ్చటను - చనుదుము లంకకు సరగున మనము1500
గూలు రావణుఁ డాజిఁ గూడును సీత - యేలుదు లోకంబు లెలమిఁ బెంపొంద"
నన రామసౌమిత్రు లధికసంతోష - మును బొంది సుఖగోష్ఠి ముదమొప్ప నుండి
రారణ్యకాండ మింపారంగ నుతుల - నారవితారార్క మగు నుర్విమీఁద
నని యాంధ్రభాష భాషాధీశవిభుఁడు - వినుతకావ్యాగమవిమలమానసుఁడు
పాలితాచారుం డపారధీశరధి - భూలోకనిధి గోనబుద్ధభూవిభుఁడు
తమతండ్రి విట్ఠల ధరణీశుపేరఁ - గమనీయగుణధైర్యకనకాద్రిపేర
నాచంద్రతారార్క మగునొప్పుమిగిలి - భూచక్రమున నతిపూజ్యమై వెలయ
నసమానలలితశబ్దార్థసంగతుల - రసికమై చెలువొందు రామాయణంబు
పరఁగు నలంకారభావన ల్నిండఁ- గరమర్థి నారణ్యకాండంబు చెప్పె.
నారూఢి నార్షేయ మై యాదికావ్య - మై రసికానంద మై యెల్లనాఁడు1510
ఇవ్వసుమతి నొప్పు నీపుణ్యచరిత - మెవ్వరు చదివిన నెవ్వరు వినిన
సామాదిబహువేదచయధామరామ - నామచింతామణి నవ్యభోగములు
పరహితాచారముల్ ప్రభువిచారములు - పరిపూర్ణశక్తులు ప్రకటరాజ్యములు
నిర్మలకీర్తులు నిత్యసౌఖ్యములు - ధర్మైక్యనిష్ఠలు దానాదిరతులు
నాయురారోగ్యంబు లైశ్వర్యములును - బాయక వినుచున్నఁ బాపక్షయంబు
వరపుత్రలబ్ధియు వైరినాశనము - సరినొప్పు ధనధాన్యదయసమృద్ధియును
నేవిఘ్నములు లేక యిండ్లలో నధిక - లావణ్యవతు లైన లలనలపొందుఁ
గొడుకులతో నెప్డు గూడియుండుటయు - నెడగాఁగ నాపద లెల్లఁ బాయుటయు
సమ్మదంబున బంధుజనులఁ గూడుటయు - నిమ్ములఁ గామ్యంబు లెడపకుండుటయు
సతతంబు దేవతాసంతర్పణంబు - పితృగణతృప్తియుఁ బెంపారుచుండు1520
వ్రాసినవారికి వరశుభోన్నతులు - వాసవలోకాధివాసతఁ జేయు
నెందాఁక కులగిరు లెందాఁక తార - లెందాఁక రవిచంద్రు లెందాఁక దిశలు
ఎందాఁక వేదంబు లెందాఁక ధరణి - యెందాఁక భువనంబు లేపు దీపించు
నందాఁక నీకథ యక్షరానంద - సందోహదోహళాచార మై పరఁగు.

ఆరణ్యకాండము సంపూర్ణము

————