Jump to content

శివపురాణము/యుద్ధ ఖండము/బాణాసుర గాధ

వికీసోర్స్ నుండి
(బాణాసుర గాధ నుండి మళ్ళించబడింది)

వెయ్యి చేతుల బాణాసురుని విశేష గాధ చెప్తున్నాను. చక్రవర్తికి ఔరస పుత్రుడైన బాణాసురుడు శోణితపురనివాసి. మహాశివభక్తుడు. ఏకకాలంలో తన వెయ్యి చేతులతోనూ శివుడ్ని ఆడీ - పాడీ - అర్చించినందుకూ; ఆనందింప జేసినందుకు మహేశుడు భాణాసురుని ఏదైనా వరం కోరుకోమన్నాడు. శివుని తనయింట ఉండమని కోరాడు బాణాసురుడు.

ఇకనేం - కుటుంబ పరివార సమేతంగా కాపురం పెట్టేశాడు శివుడు. పార్వతీదేవి మాత్రం రానని అలిగింది. 'సర్లే! అట్లే కానిమ్మ'న్నాడు.

కొంతకాలం గడిచింది. శివుడే తన ఇంట కొలువై వుండగా, బాణాసురుడికి కొండంత అండగా ఉండి, అతడు మరింత దుర్నిరీక్షణుడయ్యాడు.

ఇక్కడ - పార్వతీదేవి కూడా అలకతీరి భర్త ఎప్పుడు కబురు చేస్తాడా అని ఎదురు చూడసాగింది. సర్వం తెలిసిన ఆ పరాత్పరుడికి పార్వతీమానసం మాత్రం ఎరుగనిదా?

ఆమెను రమ్మని నందీశ్వరునితో కబురు పంపించడమే గాక, దగ్గరుండి తీసుకురమ్మని - మొత్తం పరివారాన్ని పంపించాడు.

బాణాసురుని కూతురు ఉషాదేవి. ఆమె చెలికెత్తె చిత్రలేఖ ప్రోత్సాహంతో ఉష పూర్తిగా పార్వతీ దేవిని పోలేలాగ అలంకరించుకొని, ఈలోగా శివుని చేరబోయింది. ఉష హృదయం తెలిసిన పార్వతి 'కార్తీక శుద్ధ ద్వాదశీ తిథి' యందు నీకొక పురుషుడు తారసపడి నిన్ను రమించి, నిన్ను వరించగలడు అని వరం ఇచ్చి, ఆమెను పంపించింది.

శివసంకల్పం వల్ల కృష్ణుని మనుమడు అనిరుద్ధుడనే వాడు - పార్వతి వరం ఇచ్చిన వరుడిగా, ఉషాంతఃపురాన వ్రవేశించి ఆమెతో రతిసుఖాలాడి వెళ్లిపోయాడు.

మన్మధుని మించిన అందగాడైనందున ఉష అతడికి ఎటువంటి అభ్యంతరాన్ని చెప్పలేదుగాని, వివాహం గాకుండానే పరపురుషుని సంగమించడమేమిటని మథనపడింది. చిత్రమేమిటంటే - తన్ను రమించిన పురుషుడెవ్వడన్నదీ, ఎలా ఉంటాడన్నదీ ఆమె వర్ణించలేకపోయింది. అతడ్ని తలపుల్లో దాచడం ఇక తనవల్ల కాక చెలికత్తె చిత్రలేఖతో చెప్పుకుంది.

చిత్రలేఖ ఉపాయం ఆలోచించింది. దేశ దేశాల రాకుమారుల చిత్రాల్ని తెప్పించి, అందులో ఉషను రమించిన వాడిని గుర్తుపట్టమన్నది.

ఇదిలా ఉండగా - ఓ రోజు శివుడి దగ్గర కొచ్చిన బాణాసురుడు "పరమేశా! వెయ్యి చేతులిచ్చావు కాని, ఏం లాభం? వీటికి తగ్గపని కల్పించలేకపోయావు. నా సహస్ర బాహువులతోనూ ఏకకాలంలో యుద్ధం చెయ్యగల వైరిని చూపించవయ్యా!" అని వేడుకున్నాడు.

"అభీష్ట సిద్ధిరస్తు! నీకు భుజబల గర్వం అధికమైనట్టుంది. నీచేతుల్ని ఒక్కొక్కటే నేలకూల్చే ఘనుడితో నీకు యుద్ధం అతి త్వరలోనే సంప్రాప్తించుగాక!" అని దీవించాడు శివుడు.

ఉష చెప్పిన రాకుమారుడిని, చిత్రపటాల ద్వారా అనిరుద్ధుడిగా గుర్తుపట్టిన చిత్రలేఖ తనకున్న యోగశక్తి చేత రాత్రికిరాత్రే అనిరుద్ధుడ్ని అపహరించి తెచ్చి, ఉష శయ్యాగృహంలోకి చేర్చింది. ఉష యధేశ్చగా తన ప్రియుడితో సుఖాల తేలియాడింది.

ఈ విషయం బాణాసురుడికి తెలిసి, తన అంతఃపురంలోకి - ఈతడెలా ప్రవేశించాడో అర్ధం గాక యుద్ధసన్నద్ధుడయ్యాడు. అయితే అశరీరవాణి హెచ్చరిక మేరకు అనిరుద్ధుని వధించక,చెరలో బంధించాడు.

ఇటు ఉషా అటు అనిరుద్ధుడు సాక్షాత్ దుర్గా స్వరూపురాలైన అమ్మవారిని అర్చించడంతో, అనిరుద్ధుడు చిత్రంగా చెరసాలనుంచి బైటికి వచ్చేయగలిగాడు. అనంతరం ఉషా - అనిరుద్ధులు తిరిగి సుఖాలలో్ మునిగిపోయారు.

అక్కడ- ద్వారకానగరిలో అనిరుద్ధుడు అదృశ్యమైన వైనం అందర్నీ విచారంలో ముంచగా - నారదుడు జరిగిన విషయం చెప్పగానే శోణపురాన్ని ముట్టడించాడు.

బాణాసురుని కిచ్చిన మాటప్రకారం - శోణపురంలో కొలువై ఉన్న శివుడు బాణాసురుడికి బాసటగా నిలిచాడు.

శివ కేశవుల ముఖా ముఖీ తలపడవలసిన అగత్యం ఏర్పడింది.

శివుడి వరం దేవతలకు అనుకూలంగా మల్చడానికి కృష్ణుడొక ఎత్తువేశాడు.

దాని ప్రకారం - శివుడు స్తబ్ధుడయ్యేలా శౌరి జృంభణాస్త్రాన్ని ప్రయోగించాడు. మహనీయమైన ఆ అస్త్ర ప్రభావంతో శంభుడు రణ భూమినుంచి వైదొలిగాడు.

వేయిచేతుల బాణాసురుడు, ఇంతకాలానికి తనకు తగ్గ వైరి దొరికాడని సంబరపడి, రణభూమిలో అడుగిడినాడు.

సర్వవశంకరుడైన శంకరుడినే పక్కకు తప్పించగలిగిన విరాధి వీరుడితో యుద్ధం సంఘటిల్లినందుకు - తన భుజబల పరాక్రమం చూపించి లోకాలను మరింత గడగడలాడించే అవకాశం దొరికినందుకు ఉప్పొంగిపోయాడు.

లోకభీకరమైన యుద్ధం సాగింది. ఏకకాలంలోనే తన వెయ్యి చేతులతోనూ చతుర్భుజుని ఎదుర్కొన్నాడు. సుదర్శన చక్రంతో అన్ని చేతులనూ ఒక్కటొక్కటిగా తరిగి పారేశాడు చక్రపాణి. అలా ఒక్కటొక్కటిగా వెయ్యికి నాలుగు చేతులను మాత్రం మిగిల్చి, (తనతో సముజ్జీ అయినందున) ఈసారి ఎత్తిన చక్రంతో బాణాసురుని శిరస్సు ఖండించబోగా, శివుడు అడ్డుపడ్డాడు.

"వాసుదేవా! బాణుడి గర్వం అణగడానికే నేనీవరం ఇచ్చినాను తప్ప, అతడిశిరః ఖండనం జరగాలనికాదు" అని అనుగ్రహించి ఉషా అనిరుద్ధుల వివాహం దగ్గరుండి జరిపించాడు...అంటూ - సూత పౌరాణికుడు యుద్ధఖండం మంగళాంతం చేశాడు.

                                       యుద్ధ ఖండము సంపూర్ణము