పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

209 దేవత్వము

ఈయాదర్శములను మరచినవాళ్ళు దైవోపాసన చేయలేరు; ఒకవేళ చేసినా అది ధర్మసంగతము కానేరదు. ఆదర్శములను త్యజించినట్టైయితే దేవతలు నిర్జీవు లగుదురు. ప్రాణ ప్రతిష్ఠ కావింపబడిన దేవతాప్రతిమలందు దివ్యశక్తిని గాంచువారే దేవాదర్శముల గాంచగలవారు. ప్రాణప్రతిష్ఠామంత్రము చేత దేవాదర్శము సజీవమగును. ప్రాణప్రతిష్ఠ యన నేమి? శక్తివంతము సజీవమూ అగు దేవతామూర్తిని ధ్యానించి అనుభవములోనికి దెచ్చుకొనుట. ఇట్టిమూర్తులనే మనవా రుపాసింతురు.

దేవతాచరితము

ప్రాణప్రతిష్ఠచేసిన దేవతాప్రతిమ అనంతదివ్యశక్తులకు నిధానమని భక్తులు భావింతురు. ఈ శక్తులే దాని విభూతి యనబడును. ఒక్కొక్కదేవత ఒక్కొక్క విభూతిరూపమున ఉపాసకుల హృదయములందు నిహితమగును. దివ్యప్రేమ, దివ్యనిగ్రహము, దివ్యబలము, దివ్యవిభూతియూ ఆర్యసాహిత్యమున దేదీప్యమానముగా వర్ణింపబడినవి. అన్నిమూర్తులూ సగుణేశ్వరుని రూపములే. ప్రేమమూర్తి ఒకప్పుడు ప్రచండరూపము ధరించి అధర్మపరులను శిక్షించి, శిష్టులను రక్షించి ధర్మసంస్థాపనము చేయుచుండును.

                 పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
                 ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే|| భ|| గీ||
                 రక్షింపగ సజ్జనులను శిక్షింపగ దుష్టజనుల సేమమెలర్పన్
                 వీక్షింపధర్మువాహన దక్షా నేనవతరింతు దగ యుగ యుగమున్
                                                                            టా|| ల|| న||