పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208 సాహిత్య మీమాంస

దివ్యాదర్శములను రచించి ఆర్యకవులు తమకావ్యములకు దివ్యసౌందర్యమును గడనచేయగల్గిరి. వాటిని పఠించువారిఎదుట దివ్యాదర్శములు సాక్షాత్కరించి యుండుటచేత వారువాటిని పూజించి, ఆ మోహనరూపసందర్శమున తనిసి స్వర్గప్రాప్తికై ఎల్లప్పుడు నాకాంక్షింతురు. శూరులు యుద్ధభూమి నురుకజూచుట కిదే హేతువు. వీరస్వర్గము నాశించే కదా కురుపాండవులు ఘోరసంగ్రామ మొనర్చిరి! సతులు సహగమనము చేయుట - బలిచక్రవర్తి పాతాళమునకు కుంగుట - శిబి తనమేనికండలు చెండియిచ్చుట, బృహదర్భకుడు తన సుతుని బ్రాహ్మణసేవకు బలిగా నొసంగుట - మొదలగు కృత్యముల కన్నిటికీ స్వర్గకాంక్షయే ప్రధానము. స్వర్గసభను నారదుడు ధర్మజు నెదుట వివరముగా వర్ణించెను. అష్టదిక్పాలుర ఐశ్వర్య మత్యధికముగా నందు విలసిల్లుచుండును. ఇంద్రుని కాపదవి ఎట్లు లభించెను? నిస్తులపరాక్రమసంపన్నుడగు నాతడు దేవతల కధీశ్వరత్వము లభింప బ్రహ్మచర్య మాచరించెనని మహాభారతమం దున్నది. జితేంద్రియులకుగాని దేవత్వము ప్రాప్తించదు. ఆసురప్రవృత్తి నణగదొక్కి జితేంద్రియులై సంయమివ్రతాచరణ పరులకు మాత్రమే స్వర్గము కరగతమగును.

ప్రాణ ప్రతిష్ఠ (దేవతావాహనము)

దేవతాదర్శముల నన్నిటినీ ఆర్యకవులు సజీవములు మూర్తివంతములుగా నొనర్చి రంటిమి. దేవత లట్టిమూర్తులే,