పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

207 దేవత్వము

ఆర్యసాహిత్యమున కొల్లులుగా నున్నవి. దేవతల కునికిపట్టగు స్వర్గము సౌఖ్యమునకు పాదు. అచ్చటికి పోవుమార్గ మతిసంకీర్ణమే (Strait is the gate to Heaven) కాని శ్రద్ధా భక్తు లలవడినవాళ్ల కది సుగమము. స్నేహ మమత లను దిగువమెట్టులపై నుండి గురుజనులను భక్తితో నర్చించువారి దృష్టులను దేవతలు తమవై పాకర్షింతురు. దేవతలను మూర్తివంతుల నొనర్చి ఆర్యకవులు మానవాభివృద్ధికి మార్గము చూపిరి. లక్ష్మి కమనీయ స్వర్ణప్రతిమ, వేదమాతయైన సరస్వతి జగన్మోహినియగు శ్వేతమూర్తి, అసురవిజయినియగు పార్వతి దశభుజ, శక్తిరూపిణి, నీలమూర్తి. జగదుత్పత్తికి కారణభూతుడు సూర్యుడు; దాని నావరించియుండువాడు వరుణుడు; తేజమున కాధారభూతుడు అగ్ని; జగత్ప్రాణస్వరూపుడు వాయువు. అద్వితీయుడగు భగవంతు డన్ని జీవులయందూ వర్తించును. అనంతవిభూతి కాధారుడై స్వర్గమున రాజిలుచుండు దేవదేవుడు స్వప్రకాశవికాసమున అనంతబ్రహ్మాండమం దంతహిన్‌తుడై యుండియు సామాన్యదృష్టికి గోచరుడు కాడు. అతని విభూతివికాసము గనకున్న అతని నారాధించు టెట్లు? ఆతడు విశ్వవ్యాపి కావున అనంతమూర్తు లం దతని జూచి అనంతు డనుకొనవలెను.

                  యచ్చ కించి జ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పి వా
                  అంత ర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ: స్థిత:||
                  కన్న జగ మెల్ల మరియును విన్న జగము నిండియంతటనారాయణుండు వెలయు

ఇట్టి విశ్వరూపసందర్శన మర్జునునికి లభించినది.