పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202 సాహిత్య మీమాంస

రచించెనా ? షైలాకు భీషణకౄరత నిర్దయల సరస పోర్షిఆ వక్తృత మధురముగా నుండును కాని, అది క్షణికము కావున ఆరస మంతతో ముగియును. ఆదృశ్య మంతమగుసరికి నింద్యుడగు యూదుని చరితము మరింత నీచముగా నొనరించుటకు క్రైస్తవునిచే క్షమాభిక్షను కవి అడిగించెనని తోచును. అట్టి క్షమను క్రైస్తవులు యూదులయెడ గన్పరచినారా ? అదే జరిగియుంటే ఆ రెండుజాతుల కంతపగ పుట్టనే పుట్టియుండదు సొమ్ము పుచ్చుకోవాలని షైలాకు కోర్టుకు రాలేదు - క్రైస్తవుల దుష్కృతములచేతనూ, అత్యాచారముల చేతనూ పీడితులై క్రోధావేశులైన యూదుల కసి తీర్చుకొను ఉద్దేశముతో నతడు వచ్చెను. క్రైస్తవుల పక్షమున వాదించుటకు వకీ లుండెనుకాని యూదుల పక్షమువా డేడీ? యూదుడే ఆనాటకము వ్రాసినట్టైతే ఘటనాచక్రము మారి యుండదా ? షైలాకు పాత్రమున మానవుని యందలి పశ్వంశ ప్రబల రూపమున చిత్రింపబడినది. తగవు తీర్చుటకు క్రైస్తవు లందరూ గుమిగూడినారు. యూదుని కెదురుగా విజాతీయు లందరూ దళబద్ధులైనారు కాని షైలాకుపక్షమువారిని కవి దళబద్ధులను చేయలేదేమి? ఇది పాత్రరచనయందు పక్ష పాతము కాదా ? క్రైస్తవకవి నాటకకర్త కావున యూదుని నింద్యచరిత్రునిగా నిర్మించి అతనిపక్షమున వాదించువాని నైనా నియమించలేదు. పోర్షియా దయావిషయికోపన్యాస మిచ్చునప్పుడు యూదులు ప్రతివాదించుటకు సబబు లేదా!