పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148 సాహిత్య మీమాంస

రంజితవీరత్వ యశోగానమున సర్ వాల్టర్ స్కాట్ పరమానంద భరితుడై నట్లు రఘువంశరాజుల యశోగానమున కాళిదా సపరిమితానందభరితు డాయెను.

శ్రీరాముని నిరతిశయభుజబలము క్షాత్రతేజము నభివర్ణిస్తూ వాల్మీకి అతనియం దింకోవిధమైన వీరత్వము కల్పించెను. హరిహరధనుర్భంగములయందును రాక్షసకులనాశన మందును అతని బాహ్యవీరత్వమును ప్రకటించెనుకదా. ఈవీరత్వ సంపదచేత చాలామంది రాజులు దిగ్విజయ మొనర్చి యశస్సాంద్రులైరి. అందుచేత శ్రీరామునియం దింకొక ఉత్కర్ష నుంచెను. అందు భరతఖండమందలివీరులే కాక ప్రపంచమందలి వీరులెల్ల అతనికి తీసిపోవుదురు. అది అభ్యంతరిక వీర్యము, దానిని వాల్మీకి రామాయణము మొదటిభాగమున వర్ణించనేలేదు. రెండురకముల వీరత్వమును గూర్చి ముచ్చటింతాము.

అసుర వీరత్వము

ఆర్యసాహిత్యమున మనుష్యత్వ మెట్లు చిత్రింపబడినదో చూచితిరి కదా ? పశువుతో సమానుడు కాక తద్వృత్తి నతిక్రమించినవానికే మనుష్యత్వ మలవడుతుంది. పశువువలె కామక్రోధాదులకు వశుడై మానవుడు మతి పోగొట్టుకొంటే ఆతడు పశుతుల్యు డౌట నిస్సందేహము. ఇంద్రియనిగ్రహము కావించినవాడు పౌరషవంతుడగు మానవుడౌను, చూడండి;