పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138 సాహిత్య మీమాంస

బాల్యవివాహముల పరిణామము

ఆర్యుల ప్రేమాదర్శములయందు ప్రేమగౌరవమే కాక ప్రేమసౌందర్యము కూడా కలదు. సీతాపాత్రము సుందరమని ఒప్పుకొంటే ప్రేమసౌందర్యమహిమను మెచ్చుకొన్నట్లే. అట్టి నిసర్గప్రేమచిత్రములు మన సాహిత్యమున అనేకము లున్నవి. స్త్రీలయందు నిసర్గ ప్రేమను పాదుకొల్పుటకే హిందువులందు బాల్యవివాహము లేర్పడినవి. కోమలమతులగు బాలికల నూత్నానురాగము భర్తలయందూ గురుజనము నందున్నూ చిన్నప్పటినుండీ నిక్షిప్తమగును. హృదయమందు ప్రేమకళిక దరవికసితము కాకపూర్వమే కోమలస్వాంతలగు కన్యలు యోగ్యులగు పతుల కర్పించబడుదురు. ఆప్రేమ నానాటికి వికసించి యౌవనప్రాదుర్భావమున నుదయించు అనురాగముచేత వృద్ధిచెంది పత్యర్పిత మగును. కిశోరావస్థ నుండీ అత్తవారింట లాలనపాలనముల నొందుచుండుటచేత అచ్చటివారియందు మమతభక్తి పెరిగి పెద్దలను సేవించునిచ్ఛ ప్రబలమగును. అందుచేత ఆర్యకుటుంబములు స్త్రీజనమునకు ప్రేమాలవాలములు, శాంతినికేతనములయి వారిమానసములందు చాలాసద్గుణములు సంచితము లగును. పాతివ్రత్యము, ప్రేమ, స్నేహము, మమత, భక్తి, సారళ్యము, సత్యానురక్తి, దయ, క్షాంతి, ధైర్యము, శాంతి, దాంతి, కోమలత్వము, అణకువ, సాజపుసిగ్గు, ఓపిక మొదలగు గుణ