పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

105 పాశవప్రేమ

దుర్దాంతప్రేమావిలమానస అగుటచేతనే కదా జెసికా నిర్ధనుడగు జనకునికంట దుమ్ముజల్లి, బెల్మాంటునందలి లారెన్స్ దగ్గరకు పరుగెత్తిపోయినది! ఇట్టిపనులు యూరపునందు సర్వసాధారణముగా జరుగుచుండుటచేత షేక్స్‌పియరు వీటిని తననాటకములందు తరుచుగా వాడెను. హోమరు మహాకావ్యమందును హెలెన్ పారిసుతో లేచిపోయెను. ఇట్టి పాప చిత్రములను నవయువకులగు మనవిద్యార్థులఎదుట సతతము నిలువనిచ్చిన వారిభావములు దూష్యములుకావా? ఇక శృంగారరసపూరితములగు నవలలమాట వేరె చెప్పనేల? యూరోపీయ సంఘధర్మముల ననుసరించిన షేక్స్‌పియరు నాటకములయం దిట్టిపాపచిత్రములకు కొదవ యుండునా?

ఆజనసంఘములందు ఆదర్శప్రేమ నిర్దిష్టములగు నాటకములు లేకపోలేదు, కాని ప్రేమసౌందర్యమును వివరించునవి మాత్రము చాలాతక్కువ. ఆంగ్లకావ్యములు, నాటకములు నవలలు మొదలగు వాటియం దీలోపము సర్వసాధారణముగా కనబడుచుండునే, వాటివలన మానవప్రకృతి ఉజ్వలితమగునా? పాశ్చాత్య నాటకకవిసార్వభౌముని నాటకములయందు అచ్చటి ప్రజల రీతినీతులు యథార్థరూపమున చిత్రింపబడి యుండుట చేత అవి వారి కాదర్శములైనవి. రూపగుణమోహమువలన ఉత్పన్నమగు అనురాగము యౌవనమున నెట్లు దుర్దాంతమగునో కనవలెనన్న పాశ్చాత్యసాహిత్యము పఠించ వలయును.