పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

గోన గన్నా రెడ్డి

గునబోయి తాకడం, శ్రేణులు విడకుండ వెనుకవారు ముందుకు సర్దుకొనడం ఇవన్నీ శిక్షణ ఇచ్చింది.

జేగంట గుర్తులకు యుద్ధవిధానాలు నడపడం ఆ మహారాణి ఏనుగులకు నేర్పింది.

ఓరుగల్లు వెలివాడలకు, మైలసంతకుచుట్టు గంపకోట కట్టించింది. నగరం చుట్టు ఉన్న కోటగోడల ఇనుమిక్కిలిగా బలిష్టమొనర్చింది. రాచకోట బాగు చేయించింది. అగ్నిబాణాలు ఆర్పడం నేర్పించింది. అగ్నిబాణాలనుండి కాపాడే తోలుకూర్పాసాలు లక్షలు సిద్ధం చేయించింది.

నగరంనిండా ధాన్యపుగాదెలు నిర్మాణం చేయింది వానిని వివిధధాన్యాలతో నింపించింది. నగరంలో రాచకోటలో ఎన్నో కూరగాయల తోటలు వేయబడినాయి. ఎన్నో మంచినీళ్ళ బావులు త్రవ్వినారు. చెరువులలో ఎప్పుడూ నీరు ఉండే విధానం పండితులతో ఆలోచించి నిర్వహించినారు.

ఓరుగల్లు నగరం రెండేళ్ళ ముట్టడికి సర్వసిద్ధ మయింది.

4

“శ్రీ కాకతీయ గణపతిరుద్రుడు కాలంచేశాడూ? అతని కూతురు రాచరికమా? క్షత్రియకులానికి ఎంతగతిపట్టిందీ!” అన్నాడు కల్యాణి చోడోదయుడు.

కల్యాణినగరం పశ్చిమాంధ్ర మహారాజ్యానికి ఒకనాడు ముఖ్యనగరం. కాంచీపురం రాజధానిగా పల్లవులు దక్షిణానా, వాతాపినగరం రాజధానిగా పడమటను చాళుక్యులూ శాతవాహన సామంతులుగా ఉండేవారు.

శ్రీశైలానికి ఈశాన్యంగా పల్లవభోగమూ, తూర్పుగా చళుక విషయమూ ఉండేవి. చళుకవీరుడొకడు చక్రవర్తికి సేనాపతియై కుంతలదేశం జయించినాడు. శాలివాహన చక్రవర్తికి పెద్దకుమారుడు రాజప్రతినిధిగా ములుకనాటికి ముఖ్యనగరమైన ప్రతిష్ఠాననగరంలోనూ, ద్వితీయకుమారుడు, మసికనగరం రాజధానిగా శాతకర్ణాటంలోనూ ఉండేవారు. మధ్యకుంతలానికి వాతాపిలో చళుకసేనాధిపతి ఉండేవాడు.

శాలివాహన సామ్రాజ్యం విచ్ఛిన్నంకాగానే, ఇక్ష్వాకులు పల్లవభోగానికి, తూర్పు ఆంధ్రావనికీ సామ్రాట్టులైనారు. కంచిలో పల్లవులు స్వతంత్రులై నారు. బాదామిలో చాళుక్యులు స్వతంత్రులైనారు.

ఆనాటినుండి చాళుక్యులు కుంతలము, అశ్శకము, ఆంధ్రము, గాంగవాడి, అభీరము, ఘూర్జరము జయించి, మహారాజ్యము విస్తరింపచేశారు, వాతాపినుండి రాజధాని కల్యాణినగరమునకు వచ్చినది.