పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

201

చేసి నిదానంగా ప్రవహింపవలసిన బ్రతుకునదిని ఎగుడుదిగుడుగా చేసి లోకంలో శాంతిని నాశనంచేస్తాయి.

శివదేవయ్య రుద్రమహాదేవి హృదయంలో జరుగుతూన్న మహాయుద్ధం గమనిస్తూనే ఉన్నారు. బంగారు ఛాయతో, సన్నగా శలాకలాగ పొడుగరియై వెలిగిపోయే దివ్యఫాలమూ, పొడుగాటిముక్కూ, లోతుకళ్ళూ, సన్నటిపెదవులూ గల శివదేవయ్యదేశికులు - “ఆ యుద్ధం జరిగితీరవలసినదే, లోకకల్యాణార్థమైన జీవితాన్ని సరితీర్చవలసిందేకాని మనుష్యు డంతకన్న ఏమిచేయాలి? రుద్రమదేవి యుద్ధం రుద్రమదేవి నిర్వహింపవలసిందే! కాని ఆమెకు లేనిపోని క్లిష్టసమస్య కలిపించి, ఆమె జీవితనౌక తెరచాపలపై నాలుగువైపుల నుంచీ నాలుగు గాలులనూ వదలి ఆమెనౌక ఆమె నడుపుకోవా లనడం ఏమి ధర్మం?” అనుకుంటూ ఉంటారు.

ఆమెను ఈ మహారాజ్యభారం వహించమన్నారు. ఆమెభర్త ఆమెతోపాటు చక్రవర్తి కాకూడదు. ఆమెకు చక్రవర్తి చిన్నతనములో పెండ్లిచేయకపోయెను. చేయకపోగా, మగవానినిగా పెంచి ముమ్మడమ్మనుఇచ్చి పెండ్లికూడ చేసినారు.

ఈ విషయాలన్నిటికీ తన సలహాయే ముఖ్యమైన కారణమయినది. చక్రవర్తికి ఈ బాలికవల్లనే కాకతీయవంశం నిలవాలనీ, కాకతీయ సామ్రాజ్యం అంతరించకూడదనీ ఉన్నగాఢకాంక్ష ఈ పరిస్థితులకు మూల కారణం. తాను పన్నిన ఎత్తుగడలన్నీ ఆకాంక్షమీద ఆధారపడి ఉన్నవి.

‘చాళుక్య వీరభద్రుడే రుద్రమదేవికి తగినభర్త’ అని వా రిరువురనూ దగ్గరకు తీసుకొని వచ్చి వారి హృదయాల రాగం ఉద్భవింపడానికి తానువేసిన ఎత్తులన్నీ ఫలించాయి కాని రుద్రమ ఉత్తమురాలవడంచేత తనభర్త తనతోపాటు చక్రవర్తి కావాలని కోరితీరుతుంది. ఆమెభర్త చక్రవర్తి అయినట్లయితే కాకతీయరాజ్యంలో ఉండాలని ఇష్టపడే సామంతులు చాలమంది చాళుక్యుల పాలనంలో, ఉండుటకు ఏ మాత్రమూ ఇష్టపడకపోవచ్చును. పురుషుడు భార్యతోపాటు చక్రవర్తి అయినట్లయితే స్త్రీ నెమ్మది నెమ్మదిగా అంతఃపురంలో ఉండిపోవడమూ, పురుషుడే ఏకైక చక్రవర్తి అవడమూ జరుగుతుంది అందుకనే రుద్రమదేవిని ‘నీభర్త చక్రవర్తి కాకూడదు’ అని కోరవలసివచ్చింది.

కాబట్టి కర్తవ్యం అంతా ఆ యువతీ యువకులమీద ఉంది! కాని కథానాయికా నాయకులిద్దరూ అత్యుత్తమ వంశజాతులవడంవల్ల తా మిరువురూ ఒక్కొక్క అడుగువేయడానికి, ఒక సంవత్సరము ఆలోచిస్తారు. కనుకనే తన సూత్రధారిత్వము తప్పదు. చక్రవర్తి వృద్ధుడు. ఏక్షణంలో ఏమి జరుగుతుందో? శివదేవయ్య ఆ యా విషయాలు ఆలోచిస్తూ తన పూజామందిరంలోనే ఉన్నాడు. ఉదయం ప్రార్థన చేసి, యోగాభ్యాసము చేసి, అవసరమైతే సభామందిరానికిపోయి