పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

గోన గన్నా రెడ్డి

వారు లకుమయప్రభువువంక జూచి ‘మహారాజా! ఈ మహారాజ్యంలో స్త్రీలపై కుట్రచేసేవారు ఉద్భవించారు. రాజద్రోహం దుష్టవాసనలా దేశాలన్నీ కమ్మింది. మీపైన కొందరు రాజద్రోహనేరం మోపుతున్నారు. సార్వభౌములు కాని, యువ మహారాణీవారు కాని ఆ మాట నమ్మలేదు. అయితే తమ కెందు కంత సైన్యం? ఆ విధమైన సన్నాహం? వెంటనే మీ ఆజ్ఞలు వర్థమానపురం పంపండి, సైన్యంలో మూడువంతులు తగ్గించుడని. అదీగాక మీరు మీ అన్నగారి కుమారునికి రాజ్యం ఎందుకు అప్పగించలేదు? ఆ కారణంచేత ఆ తెలివితక్కువ బాలకుడు గజదొంగయై దేశాన్ని నాశనం చేస్తున్నాడు. అతని శిక్షించడానికి ప్రసాదాదిత్యనాయకుడు సైన్యాలతో వెళ్ళాడు. కంచి మొదలైన క్షేత్రాలు సేవించి వస్తారు. మీరు సార్వభౌములతో వేదాంతచర్చ చేస్తూ సుఖంగా కాలక్షేపం చేస్తారుగాక!’ అని చెప్పిరట” అని మనవి చేశాడు.

గన్న: మనం అనుకున్నట్లే అయింది. ఇప్పటికైనా వీరందరికీ నాయకు డెవడో తెలుసుకున్నావటయ్యా సబ్బయ్యా!

సబ్బ: లేదండీ. చాలావరకూ గాలించాను. దేశంలో ఎవరు అఖండ సైన్యాలు సమకూరుస్తున్నారో పిల్లికళ్ళతో రాత్రిళ్ళు వేయికళ్ళతో తెల్లవారగట్ల చూస్తున్నాను. మహారాజా! నా కొక అనుమానం ఉన్నది. అది....

గన్న: నాకు నీవు చెప్పబోయేకడనే అనుమానం ఉంది. నేనూ మీరూ స్వయంగా వెళ్ళి విచారిద్దాము. ఈలోగా వేంగీ మహారాష్ట్రంలో గోదావరీతీర నగరమైన మేడిపల్లి లో కాచయనాయకుడు చాలా గర్వించి పోతున్నాడనీ, ఆంధ్రరాజ్యం విచ్ఛిన్నం చేయటానికి కాళింగుల సహాయం కోరుతున్నాడనీ, మొన్ననే తరిమి వేయబడినా కటకాధిపతి కొంత సైన్యమూ, బానలకొలదీ ధనమూ కాచయనాయకునికి పంపించాడనీ మీవాళ్ళు పట్టుకువచ్చిన వేగువిషయంలో నేను ఒక విచిత్రాలోచనకు వచ్చాను. ఈ సభావా రందరూ ‘వల్లె’ అంటే మనం వెంటనే కాచయ్యను గోదావరి కెరటాలలో ఊగిస్తూ చల్లంగి పంపించవలసి ఉంది.

అప్పు డొక యువక ప్రభువు లేచి ‘ప్రభూ! మనం ఇంత సైన్యంతో అన్ని వందలమైళ్ళు ఎలాప్రయాణం చేయగలం?’ అని వినయంగా అడిగినాడు.

గన్నారెడ్డి చిరునవ్వునవ్వి “ఓయి మహారాజా! గజదొంగలు అవసరమైతే రెక్కలు కట్టుకుని ఎగిరి వెళ్ళలేరా? మనం భక్తుల జట్టులుగా పదివేలమంది గోపాదక్షేత్రమూ, తదితర గోదావరితీర క్షేత్రాలు చేరుకొంటాము. మన అశ్వికులు రెండువేలమంది పదిగా, ఇరవైగా వివిధమార్గాలను నిడుదప్రోలుకు ఎగువనున్న మలయపర్వతారణ్యాలకు చేరాలి. నేనూ మారు