పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కైఫీయతులందలి భాష

27

కాలమును సూచించుటకు సాధారణముగా తద్ధర్మార్ధకక్రియలే వాడబడినవి. చాయగలరు వంటి ప్రయోగములు తక్కువగానున్నవి. కొను ధాతువునకు ప్రథమపురుష బహువచనమున కొనుదురు - కొందురు అను రూపము కలుగును. అది వాడుకలో కొంటారు అను రూపమును పొందును. అట్లే పోవు ధాతువునకు ప్రథమపురుష బహువచనరూపమైన పోదురు అను దానికి పోతారు అనునది వాడుకలోని రూపము. కైఫీయతులలో నీ వాడుకరూపములే కానవచ్చుచున్నవి. పోవును అనుటకు పోతుంది అనురూపము వాడబడినది. గురువిరహితములై అయాంతములైన ఏకస్వర ద్విస్వర ధాతువుల ఇంచుగ్వక్రంబుల కియుడాగమ మగును. అట్టి ఇయుడాగమము వచ్చిన వశియించు మున్నగు రూపములు కైఫీయతులలో నున్నవి. ధాతువులకు చున్న చేర్చిన యెడల వర్తమాన కాలక్రియాజన్యరూపములును, ఎడు, ఎడి, ట, అను ప్రత్యయములను చేర్చగా తద్ధర్మక్రియాజన్యవిశేషణములును ఏర్పడును. చున్నకు బదులు తున్నతో కూడిన రూపములును, స్తున్నతో కూడిన రూపములును, కానవచ్చుచున్నవి. ఎడు, ఎడి, అను ప్రత్యయములకు చాల చోట్ల ఏ ఆదేశముగా వచ్చినది. అనెడు, చేసెడు, అను వానికి బదులు అనె, చేశె, అను రూపములు వాడబడినవి. ఇట్లు ఏ ప్రత్యయముతో ముగియు, తత్ధర్మక్రియాజన్యవిశేషణములకు అప్పుడు, మొదలగునవి పరమగునపుడు “టి” అనునది ఆగమముగా వచ్చుచున్నది. చేటప్పుడు, అనేటప్పుడు మున్నగురూపము లిందుకు తార్కాణములు. అనేటి, అతను అనుచో, అనెడికి బదులు అనేటి అనురూపము వాడబడినది. ఇన అను ప్రత్యయముతో ముగియు భూతకాలక్రియాజన్యవిశేషణములకు, అట్టి, అటువంటి అనువానిని చేర్చుట, వాడుకభాషలోనే కాక, గ్రాంధికమునందు కూడ కనబడును. అటువంటిలోని, “టు” అనుదానికి “షు” అనునది ఆదేశముగా వచ్చిన రూపములు కొన్ని కానవచ్చుచున్నవి. ఉన్నషువంటి, ఉండబడ్డషువంటి అను రూపము లిందుకు నిదర్శనములు. ఇట్టి, షు తో కూడిన రూపములు ఇప్పుడు కూడ వృద్ధులైన వైదికుల వాడుకలో వినబడుకు. అను+ అటువంటి = అనునటువంటి; అను అనుదానికి అనే అనురూపము వచ్చిన పిమ్మట అటువంటి లోని అకారమును, టు అనుదానికి ఆదేశముగా వచ్చిన షు లోని ఉకారమును లోపింపగా నేర్పడిన అనే ష్వుంటి వంటి రూపములు కొన్ని కలవు. ధాతువులకు, ఇంచు, అనునది చేర్చగా, ప్రేరణార్థకరూపము లేర్పడును. ఉదా : తవ్వించినాడు, వేయించినారు, జరిగించినారు, వ్రాయించినది. ఈ ఇంచుక్కు పరమగునపుడు, ధాతువుల చివరనుండు, చ, కారమునకు “ప”కారము వచ్చును. నడిపించు, ఇప్పించినారు మున్నగు రూపములు కైఫీయతులతో నచ్చటచ్చట నున్నవి. కర్మణ్యర్థమున ధాతువులకు, పడు ధాతువు అనుప్రయుక్త మగును. కైఫీయతులలో కర్మణి ప్రయోగములు తక్కువగా కనబడుచున్నవి. నిర్మింపబడిన, ఇవ్వబడిన మున్నగు రూపములు స్వల్పముగా నున్నవి; ఒకచోట లిఖింపచేశి ఉన్నది. ఇచ్చట దానికి లిఖింపబడి అని యర్థము. ఇచ్చునకు ముత్తు పరమగునపుడు ఈ, ఈయ అనురూపములు వచ్చును. వాడుకలో చకార ద్విత్వయము, వకార ద్విత్వయముగా మారుటచే ఇవ్వను, ఇవ్వలేదు, ఇవ్వబడిన అనురూపములు వినబడుచున్నవి. కైఫీయతులలో, కొను, పడు, ధాతువులు కొన్నిచోట్ల స్వార్థమునందే వాడబడియున్నవి. ఉండుకున్న (ఉండిన)