పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38 బిల్వమంగళ [అం 2

యుంటే ప్రాణ మతితుచ్ఛమనిపించును, పామునకూ, తాడుకీభేద ముండదు.

చింతా - నీకు మైమరుపు కలిగిందా? పిచ్చి పట్టిందా?

బిల్వ - నీకు ప్రేమమహత్వ మావంతైనా తెలియదు, కాని అతిసుందరివి! లోకమోహినివి!

చింతా - రెప్ప వాల్పక చూస్తున్నా వేమి?

బిల్వ - నామాట నిజమౌనో కాదో చూస్తూన్నాను. నాకు మతిలేదని నీ విదివరకే గ్రహించియుండవలసినది. నీవు హాయిగా నిద్రపోతూ ఉంటే నేను నీముఖమే చూస్తూ ఉంటాను. నీ వూపిరి విడిచేటప్పుడు దశదిశలూ నాకు శూన్యములై తోచును. నీవు కంట నీరు పెట్టితే నాగుండెలో శూలముగుచ్చిన ట్లుండును. ఇది నీవెరుగవా? నాకు పిచ్చి పట్ట కేమి? నాసర్వస్వమూ ఋణగ్రస్త మయింది, అది నేను లెక్క చేయలేదు. నిందమాత్రమే నా కాభరణ మయింది. నామాటలన్నీ నిజమని ఇప్పుడైనా తెలిసిందా? (పామును చూచి) నాకు మతి లేదనడానికి కిదే దృష్టాంతము. నేను వెర్రివాడనే కాని, చింతామణీ, నీవు అసమానసౌందర్యఖనివి! నిరుపమాన రూప సుందరివి!

చింతా - సరిపోయింది-ఏమంటివి?

బిల్వ - నీ వప్రతిమ మనోహరిణివి. లేకున్న ఇన్ని దినాలు నిన్ను పూజింతునా! నీవు దేవివా, రాక్షసివా అని సంశయిస్తూన్నాను. దేవివైతే నామనోవ్యధ నెరుగగల్గుదువు.