పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34 బిల్వమంగళ [అం 2

చింతా - ఓసి, నీచిన్నతనము కూల! సంగతిగ్రహించ లేకపోయినావు-సాయంత్ర మా మొద్దును బంపినాడు, నే నెవడినైనా సరసుని పెట్టుకొన్నానేమో స్వయముగా చూడవలెనని అర్ధరాత్రికి తానే దయచేసినాడు.

బిల్వ - చింతామణీ, నిజముగా నిన్నుచూడ వచ్చినాను సుమా.

చింతా - (ముక్కు మూసుకొని) అబ్బా! ఈ దుర్గంధ మేమిటి? (ముగ్గురూ పోవుదురు)

బిచ్చ - చూచినావా? ఎంత మూర్ఖుడవో. సంతకి సన్నజాజులు తెస్తారు, కాని చవిటిమన్ను తెస్తారా? ఇంకా ఆలోచనెందుకు? బయటికి పద, లేకుంటే చీపురుదెబ్బలు తప్పవు. నేనూ వత్తునుకాని నాకింకా ఆశ పోలేదు. (దాసి వచ్చును)

దాసి - అబ్బే! అయ్యగారు ఒంటికేదో పూసుకొని రాలేదుకదా? ముక్కులో నరాలు కుళ్ళిపోతూన్నవి. శవము కంపు!

(చింతామణి వచ్చును)

చింతా - దాసీ, కుళ్ళిన మాంసమే! పురుగులు గులగులలాడుతూన్నవి. పక్కంతా పాడైంది. ఇల్లంతా పాడు కంపు - ఏలాగు పోతుందో?

సాధు - దాసీమణీ, నేను పోనా?

చింతా _ ఈశవ మెవడు ? వీడినికూడా పంపినాడా?