పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32 బిల్వమంగళ [అం 2

ఒకటిరెండు విద్యలు మాత్రమే ఎరుగుదును, భస్మాలు చేస్తాను, బంగారము చేయగలను.

దాసి - బంగారము చేయగలవూ?

సాధు - శ్రీగురుకటాక్షమున ఆవిద్య నేను నేర్చగలిగితిని, నీ కుపదేశిస్తాను.

దాసి - అబ్బో! అలాగైతే నాబోటివాళ్ళను పదిమందిని పోషించగలవు. (స్వ) నన్ను బుట్టలో వేయవలెనని చూస్తున్నాడు!

సాధు - ఆవిద్య నేర్చుకొన్నాను, ఇంతవరకూ ఎప్పుడూ చేయలేదు; గురువుగారు "బైరాగికి బంగారు మెందుక"ని నిషేధించినారు. ఆవిద్య ఇతరుల కుపదేశించుమనే గుర్వాజ్ఞ. నీవు నారాధవై తే నీకు నేర్పుతాను. సంవత్సరము నా చెప్పు చేతలలో ఉంటే సకలవిద్యలూ ఉపదేశిస్తాను.

దాసి - (స్వ) సన్యాసికి సొత్తక్కరలేదు. కాని సాని కావలెనట! వీడు టక్కరి లాగున్నాడు, ఇంటినుండి గెంటవలయును, లేకుంటే హాయిగా నిద్రపోనీయడు. (ప్ర) సరే, మీరు పొద్దుగుం కేసరికి రండి, నేను నిద్రపోవలెను. (బిచ్చగానితో) ఓరీ మొద్దా! నీవూ నడువు, నేను లోనికిపోవలెను, ఇద్దరూ దయచేయండి.

(గోడమీదనుండి బిల్వమంగళుడు దుముకును)

అయ్యొబాబో! దొంగర్రో! దొంగ! ఇల్లు దోపిడవును!

(లోపల, ఏమే, దాసీ, ఏమిటాగోల?)