పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిలో రాజరాజును సంబోధిస్తూ ఒక పద్యం వ్రాసినా కనీసం ఒకవాక్యం వ్రాసినా ఆయన కృత్యాది నిర్దుష్టంగా ఉండేది. నన్నయ చేసిన యీ పొరపాటును పొరపాటుగా గుర్తించలేక, తిక్కన చేసిన సర్దుబాటులో విశిష్టతను సంపూర్ణతను గుర్తించలేక అనేకమంది తర్వాతికవులు నన్నయవిధానాన్నే అనుసరించి తమ తమ కావ్యావతారికలను లోపభూయిష్టమే చేశారు. మారన, పోతన, శ్రీనాథుడు, పెద్దన, పింగళి సూరన, రాజరాజభూషణుడు, కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు మొదలైన ప్రముఖ కవులంతా నన్నయపద్ధతినే అనుసరించి - అనగా - కృతి శ్రోతను కథాప్రారంభానికి పూర్వం సంబోధించకుండానే తమ రచన సాగించారు. నాచనసోముడు తిక్కన చేసిన సర్దుబాటును గమనించాడు కాబోలు! తమ కావ్యకథాప్రారంభానికి ముందు హరిహరనాథుణ్ని ఉద్దేశించి సంబోధనాంతంగా కందం వ్రాసి "దేవా" అని వచనంతో కూడా సంబోధించి "వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె" అన్నమాట వ్రాసిగాని కథాప్రారంభం చెయ్యలేదు. పైన పేర్కొన్న మారనాదుల కావ్యాలన్నిటిలోనూ ప్రథామాశ్వాసం చివరినుంచే (భాగవతంలో ప్రథమస్కంథం చివరినుంచే) గాని సంబోధనాంతపద్యాలు కానరావు. తిక్కన సవరించినా తిక్కనను, సోము డనుసరించినా ప్రమాదభరితంగా మొదట నన్నయరచనలో జరిగిన పొరపాటును గమనించిన తర్వాతి కవులంతా తమ తమ రచనలను కూడా ప్రమాదభరితాలుగా చేశారు.

ఇంక నన్నెచోడుని ఆశ్వాసాద్యంతపద్యాలను గురించి, తిక్కన నిర్వచనోత్తరరామాయణం, కేతన దశకుమారచరిత్రల ఆశ్వాసాద్యంత పద్యాలను గురించి చర్చించవలసి ఉన్నది.

నన్నెచోడుడు కేవలం మహాకవేకాదు. గొప్ప మేధావి కూడా. అడుగడుగునా ఏదో ఒక ప్రత్యేకత లేకుండా అతని రచన సాగనే సాగదు. తనగురుదేవుడైన మల్లికార్జునునికి కావ్యకథానాయకుడైన ఈశ్వరునికి అభేదం చేసినందువల్ల ఆశ్వాసాద్యంతపద్యాలను ప్రతి ఆశ్వాసంలోనూ కథకు అనుగుణంగా పూర్వాపరాన్వయాలకు సందర్భాలకు సరిపోయేవిధంగా రచియించాడు. నిజానికి కుమారసంభవం పండ్రెండు ఆశ్వాసాలున్న కావ్యమే అయినా ప్రతి ఆశ్వాసానికి చివర ఉన్న గద్యలు తొలగించివేస్తే మొత్తం కుమారసంభవం ఆశ్వాసాద్యంత పద్యాలలో ఏ ఒక్కదాన్నీ తొలగించకుండా లేదా విడిచిపుచ్చకుండా చదివితే ఏకాశ్వాసకావ్యంగా రూపొందుతుంది. కుమారసంభవం ఏకాశ్వాసకావ్యంగా కూడా రూపొందడానికి ఆశ్వాసానికి ఆశ్వాసానికి మధ్యలో ఉండే అద్యంత