పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెలుగెత్తి చాటిన విషయం మొదటే పేర్కొన్నాను. ఇంకా ఆశ్వాసాద్యంతపద్యాలరచనలో కుమారసంభవానికి భారతాది గ్రంథాలకు ఉన్నతేడాను గురించి చర్చించుకొందాము.

భారత కృతి శ్రోతగా రాజరాజు నుంచి భారత ఆశ్వాసాద్యంతాలలో రాజరాజును సంబోధించి సంబోధనాంతాలైన పద్యాలు రచియించాడు నన్నయ. ఈ సంబోధనాంతాలు నన్నయ భారతం ప్రథమాశ్వాసం చివరనుంచి రచియించాడే కాని ఆది నుంచి రచియించకపోవడం ఒక లోపమనే చెప్పాలి. శ్రీవాణీగిరిజాశ్చిరాయ ఇత్యాది ప్రథమశ్లోకం దగ్గరనుంచి "సారమతింగవీంద్రులు" అన్నపద్యం వరకూ ఉన్నది నన్నయ భారతావతారిక. రాజరాజు నన్నయను రావించి తనకిష్టమైన వేవేవో వివరించి "పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మె మ్మెయిన్" అని వచించి భారతం "తెనుగున రచియింపు మధికధీయుక్తిమెయిన్" అని ఆనతిస్తాడు. తరువాత నన్నయ భారతరచనలో ఉన్న కష్టమును వర్ణించి "అయినను దేవా! నీయనుమతంబున ... నిక్కావ్యంబు రచియించెద" అని పేర్కొన్నాడు. తన భారతాన్ని రాజరాజును వినవలసిందిగా అవతారికలో నన్నయ పేర్కోలేదు. "సారమతింగవీంద్రులు ... జగద్దితంబుగాన్" అన్న పద్యం తరువాత "తత్‌కథాక్రమం బెట్టిదనిన" అని భారత కథాప్రారంభం చేస్తాడు. కృత్యవతారిక పూర్తికాగానే అనగా - సారమతింగవీంద్రులు అన్న పద్యం తరువాత రాజరాజును సంబోధించి రెండు మూడు పద్యాలుగాని కనీసం ఒక పద్యం గాని నన్నయ రచించి ఉండవలసింది. భారత కథాప్రారంభానికి ఆదిలో సంబోధనాంతపద్యాలు రాజరాజు నుద్దేశించి వెయ్యకపోవడంతో భారతానికి రాజరాజు శ్రోత అనే విషయం కావ్యాదిని మరుగుపడిపోయినది. ప్రధమాశ్వాసం చివరికి వెళ్తేనేగాని నన్నయ భారతాన్ని "రాజరాజుకు వినిపిస్తున్నట్లు వ్రాశాడు" అన్న విషయం బోధపడదు. కాబట్టి కథాప్రారంభానికి ఆదిలో సంబోధనాంతాలు వెయ్యకపోవడం ఒకలోపంగానే తేలుతుంది.

ననయ్య చేసిన యీ పొరపాటును తిక్కన గమనించి తనరచనలో యిటువంటి పొరపాటు రాకుండా సర్దుకున్నాడు. తిక్కన విరాటపర్వాదిని కథాప్రారంభానికి ముందు (హరిహరనాథునకు) "ఏను విన్నపంబుసేయు తెరంగుగా నంత సన్నిధిం గలిగించుకొని యమ్మహాకావ్యంబు నర్థంబు సంగతంబు చేసెద" అని వ్రాసి హరిహరు నుద్దేశించి మూడు సంబోధనాంతపద్యములు వ్రాసి ఆ తర్వాత "దేవా! దివ్యచిత్తంబున నవధరింపుము" అనిగాని భారత కథాప్రారంభం చెయ్యలేదు. తిక్కన హరిహరుణ్ని సంబోధించినవిధంగా నన్నయకూడా కథాప్రారంభానికి