పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎర్రాప్రగడ తన నృసింహపురాణం అహోబల నృసింహస్వామికి అంకిత మిచ్చాడు. ఆస్వామినే శ్రోతగాచేసి, ఆశ్వాసాద్యంతాలతో సంబోధనాంతాలు వేశాడు. నృసింహపురాణంలో ఎర్రన షష్ఠ్యంతాలు వేసినా అతడు తిక్కనవలె నృసింహపురాణాన్ని నృసింహస్వామికి విన్నపం చేస్తున్నట్లే షష్ఠ్యంతాలు వేశాడు. "అత్యుదాత్త భక్తప్రయుక్తోల్లాసభాసితుండనై, కృతి చేయందొడంగి" అని వచనం వ్రాసి, ఆతర్వాత పదకొండు షష్ఠ్యంతాలు వేసి పదకొండవ షష్ఠ్యంతాన్ని "భక్తచింతామణికిన్" అని ముగించి "ఏను విన్నపంబు సేయంగల లక్ష్మీనృసింహావతారంబును పురాణకథకుఁ బ్రారంభం బెట్టిదనిన" అని కథాప్రారంభం చేశాడు. కాబట్టి ఎర్రన వేసిన షష్ఠ్యంతాలు సైతం కృతిసమర్పణకు సంబంధించినవి కావని కృతివిజ్ఞాపనానికి సంబంధించినవని తేటతెల్ల మవుతున్నది.

నన్నెచోడుడు తనకావ్యాన్ని అంకితం యివ్వనేలేదు - కాబట్టి అతను వేసిన షష్ఠ్యంతాలకు అంకితానికి సంబంధం మొదటనే సున్నగదా! తిక్కన, కేతన, మారన, ఎర్రాప్రగడలు అంకితం యిచ్చినా తాము వేసిన షష్ఠ్యాంతాలు అంకితవిషయికంగా వెయ్యనేలేదు.

అంకితపరంగా వ్రాయబడిన షష్ఠ్యంతాలు పోతన భాగవతంలో కనిపిస్తాయి. పోతన తన వంశావతారం వర్ణించి తననుగురించి ఒక పద్యం వ్రాసి "అయిన నేను నాచిత్తంబున శ్రీరామచంద్రుని సన్నిధానంబు కల్పించుకొని - హరికి నందగోకులవిహారికి" అంటూ షష్ఠ్యంతాలుగా నాలుగు ఉత్పలమాలలు రచియించాడు. షష్ఠ్యంతాల తరువాత (శేషశాయికిన్) "సమర్పితంబుగా నే నాంధ్రంబున రచియింపఁబూనిన భాగవతపురాణంబునకున్ గథాక్రమంబెట్టి దనిన" అని కథాప్రారంభం చేశాడు. షష్ఠ్యంతాలతో సమన్వయమయ్యే విధంగా, సమర్పితశబ్దాన్ని ప్రయోగించడంతో శ్రీహరికి అంకితమిచ్చే సందర్భంగా షష్ఠ్యంతాలు వేసినవాడయ్యాడు. పోతన వేసిన పద్ధతిలో షష్ఠ్యంతాలు కృతి సమర్పణ సందర్భంగా తిక్కన, మారన, కేతన, ఎర్రయలు వెయ్యలేదు. వారు వేసిన సందర్భాలు కృతిసమర్పణకు సంబంధించినవి కానేకావు. కృతిప్రదానం ఉన్నప్పుడే షష్ఠ్యంతాల రచనాప్రసక్తి కలిగిందనుకొనడం పొరపాటు. నన్నెచోడుడు తన కావ్యాన్ని అంకితం ఇవ్వకుండానే మల్లి కార్జునిపై షష్ఠ్యంతాలు రచించాడుగదా!

కుమారసంభవంలో ఆశ్వాసాద్యంతాలలో సంబోధనాంతాలైన పద్యాలు లేకపోవడంచేత కుమారసంభవానికి మల్లికార్జునుడు శ్రోత కా డనడం సబబు కాదు. మల్లికార్జునుని శ్రోతగా చేసుకొని అతనికే ఈకృతి తాను చెప్పుతున్నట్లు నన్నెచోడుడు