పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిక్కన భారతంకంటే ముందుగా అవతరించి, తిక్కననే వరించిన కావ్యం కేతన దశకుమారచరిత్ర. తిక్కన కేతనను సగౌరవంగా రావించి "నీవు సంస్కృతానేకభాషాకావ్యరచనావిశారదుండ వగుట జగత్ప్రసిద్ధంబు గావున నొక్కకావ్యంబు రచియించి నన్ను కృతిపతిం చేయవలయునని సగౌరవంబుగా బ్రార్థించిన నేనును మత్కావ్యకన్యకు దగిన వరుండగు నతని మనోరథంబు సఫలంబు గావింపం దలచి" తాను దశకుమారచరిత్ర రచనకు ఉపక్రమించినట్లు కేతనే చెప్పాడు కాబట్టి తన కావ్యాన్ని అంకితమిచ్చాడనటం సుస్పష్టం. కేతన అవతారికలో తిక్కనవంశాన్ని వర్ణించి తుదకు తిక్కన గుణగణాలు అభివర్ణించి, "కొమ్మనామాత్యుతిక్కన కొలది సచివు లింక నొక్కరు డెన్నంగ నెండు గలడు?" అని తిక్కన వర్ణన ముగించి "ఈ దృశగుణభూషణమునకు" ఇత్యాదిగా ఏడు షష్ఠ్యంతాల అనంతరం తిరిగి షష్ఠ్యంతాలుగానే మూడు (శార్దూలం, కందం, మాలిని) పద్యాలు ఆశ్వాసాంతాలుగానూ వేసి తిరిగి ద్వితీయాశ్వాసాదిగా షష్ఠ్యంత కందంవేసి, ఆ కందం చివర "తిక్కనామాత్యునకున్" అన్నప్రయోగం చేసి, "అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాచెప్పంబూనిన కథానికాయం బను సురలతాబాణం బెట్టిదనిన" అని కృతి రచించాడు. కేతన చేసిన షష్ఠ్యంతాలుకూడా తిక్కనను శ్రోత గావించి వేసినవే గాని తిక్కనకు కృతి సమర్పిస్తున్నట్లుగా వేసినవి కావు.అనగా దశకుమారచరిత్రలో కూడా కృతిసమర్పణకూ, షష్ఠ్యంతాలకు సంబంధం లేదని తాత్పర్యం.

మారన మార్కండేయపురాణాన్ని నాగయ గన్నయకు అంకిత మిచ్చినట్లు స్పష్టంగానే చెప్పాడు.

నాగయ గన్నయ మార్కండేయ పురాణం వినవలెనని కుతూహలం వున్నట్లు నిండుసభలో వెల్లడించడం (మార్కండేయాఖ్యమహాపురాణము వినం గౌతూహలం బయ్యడిన్) మారన తనరచనను అతనికి వినిపిస్తున్నట్లుగానే సంబోధనాంతపద్యాలతో సహా వ్రాయడం జరిగింది. మారన నాగయ గన్నయకు షష్ఠ్యంతాలు వేశాడుగాని, అవి కృతిసమర్పణ విషయికంగానూ వ్రాయలేదు. కృతిశ్రోతత్వపరంగానూ వెయ్యలేదు. "మేరుధీరుడు నాగయమేచశారి" అని మూడవషష్ఠ్యంతపద్యం ముగించి, రమకళ్యాణపరంపరాభివృద్ధిగా నారచియింపంబూనిన యిమ్మహాపురాణంబునకు గథాక్రమం బెట్టిదనిన అని పురాణం ప్రారంభించాడు. ఈ సందర్భాన్నిబట్టి చూస్తే , "గన్నరథినీపతికి పరమకళ్యాణపరంపరాభివృద్ధి" కలుగునట్లు వేసిన షష్ఠ్యంతపద్యాలే గాని కృతిసమర్పణసందర్భంగా వేసినవి కావని సుస్పష్టంగా తెలుస్తుంది.