పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కధిపతిగా పేర్కొనలేదు. అంతేకాదు, నన్నెచోడుడు వేసిన షష్ఠ్యంతాలు కృతిసమర్పణ సందర్భమయినవి కానేకావు. "మునిజన ముఖమణి ముకురుండైన జంగమ మల్లికార్జునదేవునకు"అని షష్ఠ్యంతంగా వచనం ముగించి (58 ప్ర. ఆ) ఎనిమిది షష్ఠ్యంతాల తరువాత కావ్యారంభానికి పూర్వం "పరమభక్తియుక్తి నావర్జితహృదయుండనై సకలభువనభవనావతారకారకుండైన పరమేశ్వరు నవతారం బగుటయుం దదంశావతారంబుగా వర్ణించి, నా చెప్పఁబూనిన దివ్యకథాసూత్రం బెట్టి దనిన" అని వచనం వ్రాసి "సతి జన్మంబున్" అని కథాప్రారంభం చేశాడు. ఈ వచనానికి పూర్వంలో ఉన్న యెనిమిది షష్ఠ్యంతపద్యాలు నా చెప్పంబూనిన అన్నపదాలతో అన్వయిస్తాయి. వినుత బ్రహ్మర్షికి...వ్యావర్ణించి చెప్పబూనిన, అత్యనుపమసంయమికి...నా చెప్పంబూనిన అని సజ్జనాభరణునకు...నా చెప్పంబూనిన మల్లికార్జునమునికి ... నా చెప్పంబూనిన అని షష్ఠ్యంతముల కన్వయం. నన్నెచోడుడు వేసిన షష్ఠ్యంతాలన్నీ, మల్లికార్జునుని శ్రోతగా యెంచి అతనికి తాను కృతి చెప్పుతున్నట్లుగా వేసినవే గాని కృతి సమర్పణ (అంకితం) సందర్భంగా వేసినవి మాత్రం కావు.

షష్ఠ్యంతాలు వ్రాయడంలో నన్నెచోడునే ఆదర్శంగా తీసుకున్న తిక్కనకూడా తన భారతాన్ని హరిహరనాధునకు అంకిత మిచ్చినప్పటికీ, తాను వేసిన షష్ఠ్యంతాలు కృతిసమర్పణపరంగా వ్రాయలేదు. తాను మహాభారతగాథను హరిహరునకు విన్నపం చేస్తున్న సందర్భానికి అనుగుణంగా వేశాడు. "కృతిపతిత్వ మర్థించి వచ్చితిఁ దిక్కశర్మ" అని హరిహరనాథుడే స్వయంగా స్వప్నంలో అన్నట్లు తిక్కన పేర్కొన్నాడు. "ఇట్టి పదంబు గాంచి పరమేశ్వరునిం కృతినాథుచేసి" అని తిక్కన కూడా స్వయంగా చెప్పాడు. కాబట్టి భారతాన్ని హరిహరనాథునికి అంకిత మిచ్చాడనే విషయం విస్పష్టం. కాని షష్ఠ్యంతాలు మాత్రం తిక్కన కృతిసమర్పణపరంగా వెయ్యనే లేదు. "మహాకవిత్వదీక్షావిధి నొంది, పద్యముల గద్యములం రచియించెదన్ గృతుల్" అని పూని యీ దృశంబులగు పుణ్యప్రబంధంబులు దేవసన్నిధిం బ్రశంసించుటయు నొక్కయారాధన విశేషం బగుటం జేసి" అని వచనం వ్రాసి, అనంతరం "ఓంకారవాచ్యునకు ఇత్యాది అయిదు షష్ఠ్యంతాలు రచియించి, ఏను విన్నపంబు సేయు తెరంగుగా" నని వ్రాశాడు. ఓంకారవాచ్యునకు అని మొదలుపెట్టి "భక్తవరతంత్రునకున్" అని షష్ఠ్యంతాలు ముగించి, "ఏను విన్నపంబు చేయు తెరంగుగా" అనడంవల్ల ఈ షష్ఠ్యంతాలు అయిదూ హరిహరనాథునకు విన్నపసందర్భంగా వేసినవే కానీ, కృతిసమర్పణవిషయకంగా వ్రాసినవి కావని తేటతెల్లమవుతున్నది. అంకితం యివ్వడానికి, షష్ఠ్యంతాలు వెయ్యడానికి తిక్కన భారతంలో బొత్తిగా సంబంధం లేదు.