పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన వ్యాసంలో పేర్కొనకపోయినా యీ రెండూ చూచినవారికి వస్తుస్థితి బోధపడకుండా ఉండదు. నిజానికి "షష్ఠ్యంతముల పుట్టుపూర్వాలు" అన్న శీర్షికతో వెలువడిన యీ వ్యాసవిషయాలు అసలు షష్ఠ్యంతాల చరిత్రను ప్రాచీనకావ్యాల కృత్యవతారికా విషయాలను వెల్లడించలేదు సరిగదా వాస్తవవిషయాలకు దృగ్గోచర మవుతున్న పరమసత్యాలకు విరుద్ధాలుగా వెలువడడం విచారనీయమైన విషయం.

నా ఉపన్యాస వాక్యాల సారాంశంగా నాటి ఆంధ్రప్రభలో వెలువడిన వాక్యాలు అతిసామాన్యమైనవి. అంతకు మించి షష్ఠ్యంతాల చరిత్ర గురించి మనం గమనించవలసిన విషయాలు అనేకంఉన్నాయి. వాస్తవవిషయాలన్నిటినీ కూలంకషంగా విమర్శించి నిగ్గునుతేల్చి యీ క్రింది విషయాలు వెల్లడించాను.

"నన్నెచోడుడు తన కుమారసంభవమును భక్తితో గురువగు మల్లికార్జునునకు అంకితము గావించినాడు. కాని నన్నయవలె విన్పింపలేదు. ఇట్లనుటచే మల్లికార్జునునకు కుమారసంభవము బొత్తిగా వినిపింపలేదనుటకాదు. ఆయనను కేవలము శ్రోతగా గ్రహింపలేదనుట మాత్రమే. అనగా మల్లికార్జునుడు కుమారసంభవమునకు కృతిపతియే కాని కృతిశ్రోత కాదనుట. కనుకనే కుమారసంభవమునం దాశ్వాసాద్యంత పద్యములలో సంబోధనాంతముల కవకాశము లేకపోయినది. పైగా చోడుడు తనగురువునకును శివునకును అభేదమును గల్పించి యాశ్వాసాంతములలో శివునివర్ణన వచ్చునట్లు కూర్చుకొని యాశ్వాసాద్యంత పద్యములను కృతినాయక కృతిపతుల కిరువురకు (కథానాయక కృతిపతుల కిరువురకు అని ఈ రచయితభావం కాబోలు) నన్వయించునట్లు విభిన్నవిభక్తికములుగా రచించినాడు. ఇక్కడ కృతిప్రదానము కలదు గనుక షష్ఠ్యంతముల రచనకు ప్రసక్తి కలిగినది" - అని ఒకరు వ్రాశారు.

ఈ అభిప్రాయాలన్నీ చాలా ప్రమాదభరితాలు. నన్నెచోడుడు తన కుమారసంభవాన్ని మల్లికార్జునునకు అంకితం యిచ్చాడనడం ఒక పొరపాటు. నన్నయవలె మల్లికార్జునునికి వినిపింపలేదనడం రెండవపొరపాటు. మల్లికార్జునుని కృతిశ్రోతగా యెంచి కుమారసంభవ రచన చెయ్యలేదు. కావుననే సంబోధనాంతాల కవకాశం లేకపోయిందనడం మూడవ పొరపాటు. నన్నెచోడుడు కృతిప్రదానం చేసినాడు కాబట్టే షష్ఠ్యంతాల రచనకు ప్రసక్తి కలిగిందనడం నాల్గవ పొరపాటు. సూక్ష్మంగా, వివరంగా కుమారసంభవాది గ్రంథాలు పరిశీలించకుండా వ్యాసరచనకు దొరకొన్న యీ రచయిత యీ నాల్గు పొరపాటు భావాలేకాదు