పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాను సూక్ష్మంగాను ప్రస్తావించాను. అప్పటి నా ఉపన్యాసాల సారాంశం జనవరిలో ఆంధ్రప్రభ ప్రచురింపగా నేను షష్ఠ్యంతాలపై సామాన్యంగా వెలువరించిన భావాలు ఈ క్రింది రూపం దాల్చినాయి.

"ఎకాడమీ బహుమానం పొందిన వేదం వెంకటరాయశాస్త్రిగారి కుమారసంభవ విమర్శలో నన్నెచోడుడు తిక్కనకు సైతం తర్వాత వాడని కేవలం షష్ఠ్యంతాల మీదనే ఆధారపడి వ్రాయడం జరిగింది. ఇది కేవలం షష్ఠ్యంతాలచరిత్రను గమనించకపోవడం వల్లనే జరిగిం దనుకుంటాను. కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః ఇత్యాదిగాఉన్న కేశవనామాలను ఆధారం చేసుకునే తెలుగులో షష్ఠ్యంతాలు వెలిశాయి. సంస్కృతంలో చతుర్థ్యంతాలుగా ఉన్న పదాలు తెలుగులో సమూలంగా షష్ఠ్యంతవిభక్తి కువర్ణాంతాలుగా ఉంటాయి.

తెలుగులో రామునికొరకు సీత నిచ్చెను అనడం అస్వాభావికం. రామునికి సీత నిచ్చె ననడమే స్వాభావికంగా ఉంటుంది. అందువల్ల కేశవనామాల్లో ఉన్నచతుర్థి విభక్తులను అనుసరించి తెలుగుకు స్వాభావికమైన షష్ఠీవిభక్తి కుప్రత్యయప్రయోగంతో షష్ఠ్యంతాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ షష్ఠ్యంతాలు కేశవనామాలవలెనే మొదట దైవపరంగా - అంటే - కావ్యాన్ని దేవునికే అంకితమిచ్చినప్పుడే యీ షష్ఠ్యంతాలు ఉపయోగింపబడేవి అని అనిపిస్తుంది. దైవపరంగా ఉపయోగింపబడే యీ షష్ఠ్యంతాలను మానవపరంగా చేసిన మొదటికవి నన్నెచోడుడే. నన్నెచోడుడు తన గురువైన మల్లికార్జునుని దేవుడుగా భావించాడు. శివుడికి మలికార్జునుడికి అభేదంచేసి తన కావ్యాన్ని గురువుకే అంకితమిచ్చి దేవునికిచ్చినట్లే సంతృప్తి చెందాడు. దేవుడుకి తన గురువుకి అభేదం చేసినందువల్ల దైవపరంగా వాడబడుతున్న షష్ఠ్యంతాలను తన గురుపరంగా కూడా వాడినాడు. ఇలా మానవపరంగావాడబడిన కుమారసంభవంలోని షష్ఠ్యంతాలను చూచే తిక్కన ఉత్తరరామచరిత్రలో మనుమసిద్ధికి షష్ఠ్యంతాలు వేశాడు. నన్నయ్య భారతాన్ని రాజరాజుకి వినిపించినట్లు వ్రాసినాడే కాని అంకితమివ్వలేదు. అసలు నన్నయ తన భారతాన్ని ఎవరికి అంకిత మివ్వలేదు. అందువల్ల భారతంలో షష్ఠ్యంతాలు వెయ్యవలసిన అవసరం కనిపించలేదు-" (భారతరచనలో వెల్లివిరిసిన నన్నయ కవితాప్రాభవం - ఆంధ్రప్రభ దినపత్రిక. 1960 జనవరి 10.)

సామాన్యంగా చెప్పిన యీ షష్ఠ్యంతాల విషయమైన పైవాక్యాలు చూచి వాటిలోని భావాలనే చిలువలు పలువలు చేర్చి అసంబద్దాలైన అనేకవిషయాలతో కూడిన ఒకవ్యాసం "షష్ఠ్యంతముల పుట్టుపూర్వాలు" అన్న శీర్షికతో భారతిలో ప్రచురింపబడింది. యీ వ్యాసకర్త ఆంధ్రప్రభలోని పైవాక్యాలు చూచినట్లు