పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకృష్ణాంకితంబు సేయుమని యానతిచ్చిన మేల్కాంచి కృష్ణభగవంతుని మనంబున నిడుకొని రచియింపబూనితిఁ దదవతార క్రమంబెట్టిదనిన" అని నరసింహకవి కృష్ణావతారక్రమాన్ని 456 పద్యాలలో దాదాపు ప్రథమాశ్వాసం తుదివరకూ అత్యంతమధురమై మంజులమైన కవితతో వర్ణించాడు. "మధురాపురవర్ణన - శ్రీకృష్ణ జననము - శ్రీకృష్ణలీలలు, దుష్టసంహారము - శ్రీకృష్ణుఁడు దావాగ్నిని గ్రోలుట - వర్షాగమము - వసంతాగమము - గోపికావిహారము - నందుఁ డేకాదశి నుపవసించుట - అక్రూరుఁడు యమునాజలముల రామకృష్ణులఁ గాంచుట - శ్రీకృష్ణుఁడు కంసుని సంహరించుట - శ్రీకృష్ణుఁ డుద్థవుని గోపికలకడకంపుట - శ్రీకృష్ణుఁడు జరాసంధ కాలయవనుల జయించుట - శ్రీకృష్ణుఁడు రుక్మిణి సత్యభామల పరిణయమాడుట - నరకసంహారము, పారిజాతాపహరణము - ప్రద్యుమ్నవృత్తాంతము - శ్రీకృష్ణుఁడు బాణాసురుని నోడించుట - నృగమహారాజు వృత్తాంతము, పౌండ్రకవాసుదేవుఁడు - కౌరవ పాండవ సంబంధము - కుచేలోపాఖ్యానము - శ్రీకృష్ణుఁడు వృకాసురుని బంధించుట - అర్జునుఁడు సుభద్రం గొంపోవుట - ద్వారకలో శ్రీకృష్ణుని జీవితము." అన్న వివిధశీర్షికలతో శ్రీకృష్ణుని అవతారవిశేషాలను వర్ణించాడు. అనంతరం కృతిపతియైన శ్రీకృష్ణసమర్పణంగా ఐదు షష్ఠ్యంతాలైన కందపద్యాలను రచించి, అసలు నారదీయపురాణంలో "మునులు నారాయణుని దర్శించడం"తో కథా ప్రారంభం చేశాడు.

నన్నెచోడుడు మొదలుకొని అనేకమంది కవులు యీ షష్ఠ్యంతాలు ప్రయోగించారు - అయితే కొందరు సార్థకంగా షష్ఠ్యంతాల పుట్టుకను దృష్టిలో పెట్టుకొని ప్రయోగించగా మరికొందరు నిరర్ధకంగా ప్రయోగించారు.

షష్యంతాల చరిత్ర

శ్రీకృష్ణాంకితమైన యీ నారదీయపురాణంలో నరసింహకవి అత్యంతసార్థకంగా షష్ఠ్యంతకందపద్యాలు విరచించాడు. ప్రాచీనకవు లనేకమంది తమకావ్యాలలో షష్ఠ్యంతాలు రచించారు గాని అవన్నీ సార్థకాలుగా విరచించా రనడానికి అవకాశం లేదు. 1960 వ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసాలలో కర్నూలు ఉస్మానియా కళాశాలలో నన్నయవర్ధంతి సందర్భంగాను - ఉస్మానియా విశ్వవిద్యాలయం కళాశాలల దశమాంధ్ర అభ్యుదయోత్సవాల సందర్భంగానూ నన్నయభారతరచనలో ఉన్న వైశిష్ట్యాన్ని గురించి ఉపన్యసిస్తూ షష్ఠ్యంతాలగురించి కొన్ని మాటలు చెప్పాను. నన్నయ కవితావిషయికప్రసంగానికే యెక్కువ అవకాశం ఉన్న ఆ సభలో షష్ఠ్యంతాలచరిత్ర విషయమై సామాన్యం