పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తద్వంశంబున
సిరులన్ సద్గురుశేఖరుం డనఁగ మించెన్ గొండమార్యుఁ డా
హరియే యీ ఘనుడంచు శిష్యవరు లాత్మాయత్తులై కొల్వఁగా
వరవేదాంతరహస్యవేదియు భరద్వాజర్షి గోత్రాబ్ధిభా
సురశీతాంశుఁడునై ప్రసిద్ది వెలసెన్ సూరుల్ ప్రశంసింపఁగన్.

ప్రాచీనకాలంలో కంచర్ల కేశవాచార్యుడనే వైష్ణవమతస్థుడైన మహానుభావుడు మంత్రోపాసనార్చనాబలంతో, విష్ణుమహిమతో ఉభయవేదాంతవిద్యామహోన్నతుడై వీరవైష్ణవపీఠాధిపుడై ప్రఖ్యాతి వహించాడట. బ్రహ్మరాక్షసుల్ని శాపంతో అణచాడట. ఈ సందర్భంలో నరసింహకవి వ్రాసిన "ఏదేశికాధీశుఁడిద్ద బుద్ది స్ఫూర్తి బ్రహ్మరాక్షసుల శాపంబణంచె" అన్నపాదానికి బ్రహ్మరాక్షసులను శాపంతో అణచాడనీ, బ్రహ్మరాక్షసులను శాపవిముక్తులుగా చేశాడనీ రెండు విధాలుగానూ అర్థం చెప్పవచ్చును. కేశవాచార్యుడు తన్నెదురొడ్డి నిలిచిన ఒకానొకశక్తిని సైతం లొంగదీసుకొని చక్రాంకితాలు వేశాడట! వరంగల్లును వైష్ణవమతమయంగా మార్చి తన హస్తగతం చేసుకొని రామానుజాచార్యుని విజయధ్వజాంకంగా నిలిచాడట! ఈ కేశవాచార్యుని వంశంలో భరద్వాజగోత్రికుడై సాక్షాత్తు శ్రీహరియే యీ కొండమాచార్యులుగా అవతరించాడు అని శిష్యవరులు కొలువగా వేదాంతరహస్యజ్ఞుడై యెంతో కీర్తి వహించాడట. ఈకొండమాచార్యులే ప్రస్తుత నారదీయపురాణకృతికర్తయైన అల్లాడు నరసింహకవికి గురువు. ఈ కొండమాచార్యులు కీర్తిశేషులైన తరువాతనో సజీవులై వుండగనేనో ఒకనాడు నరసింహకవికి స్వప్నంలో కనిపించి నారదీయ సాత్వికపురాణాన్ని లోకోపకారార్థంగా ఆంధ్రభాషలో విరచించి శ్రీకృష్ణుని కంకిత మీయవలసిందిగా ఆజ్ఞాపించాడట. తదాజ్ఞమేరకు శ్రీకృష్ణాంకితంగా ఈ నారదీయపురాణాన్ని నరసింహకవి రచించాడు.

నరసింహకవి సంస్కృతకవులలో క్రీస్తుశకం 11వ శతాబ్దంలో వున్న జయదేవకవిని సంస్తుతించాడు. తెలుగుకవుల్లో ప్రత్యేకించి కవిత్రయాన్ని మాత్రమే ప్రస్తుతించాడు. కవిత్రయంలో మూడవవాడైన ఎఱ్ఱాప్రగడ క్రీ. శ. 13వ శతాబ్ది లోని వాడు, కాబట్టి మన ఈ అల్లాడు నరసింహకవి క్రీస్తుశకం 13వ శతాబ్దికి తరువాతి వాడేనని దృఢంగా చెప్పవచ్చును.

కవి ప్రారంభంలో ఇష్టదేవతాస్తుత్యాదికం చేస్తూ శ్రీకృష్ణుణ్ని - రుక్మిణీదేవిని - ఆదిశేషువును - చింతామణిని - పంచాయుధుని - విడివిడి పద్యాలలో కీర్తించాడు.