పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/679

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


స్థలంబునకే పరువెత్త నన్యపశువుతో లంకెవైచి తెచ్చి పూర్వస్థలంబు
మరచియున్న పర్యంతంబు లంకెతో నుంచి తత్పూర్వస్థలంబు
మరచిన లంకె విడుతు; రిట్లనే విచక్షణులు నీతిఁ దర్కించి గౌణధ్యా
నాదియోగంబునన్ మనంబు బాహ్యేంద్రియంబులవలన మరలింప
వలయు; నిజమనంబునకు నిర్విషయత్వం బనందగు నీక్రమంబు
ప్రకారాంతరంబునం గాదు. క్రమంబునం గాని యున్నతపదంబు నెక్క
సమర్ధుండు గాఁడు; క్రమంబు దక్కి యెక్కెనేని యధఃపథంబు నొందు;
తత్కర్మంబు సేయుచుఁ, దత్కర్మంబు గావింపుచు, శంఖచక్రగదా
ధరు యమాదిగుణసంపన్ను ధ్యానించి యాక్రమంబునఁ బరమ
ధామంబు నొందు. మీరు నాకుఁ బరమమిత్రులు లోకరహస్యం
బెఱింగించెద; సత్సంగమంబున విష్ణుకథలు వినుచు జగంబు విష్ణు
మయం బని యెఱింగి సర్వజనులయెడ మైత్రి గావింపుఁడు. విషయంబుల
యందు దోషదృష్టి పూని, సర్వక్లేశనివారకుండైన విష్ణువును
స్మరింపుచు, సత్సంగంబు లేక యుండెడు విష్ణువిముఖులం గూడక,
యొంటిమై నుండి, యావిష్ణువిముఖులం దూషింపక, యిష్టప్రాప్తి
విపత్తు లాత్మకు సమానంబుగాఁ జూచుచు, నెయ్యదియు సంకల్పింపక,
యెల్లప్పుడు బ్రహ్మజిజ్ఞాసం బూని, యపరరాత్రంబుల లేచి యౌచి
త్యంబున “నాత్మ యెటువంటిది? దేహం బెందున నైనయది?
మనం బేచందంబున వర్తించు? దశానిలంబు లెట్టివి? యక్షంబుల
కుద్యద్వృత్తు లెటువంటివి? ఆత్మపరమాత్మలకు భేదం బెట్లు? ఎవ్వనిచే
నీవిశ్వంబు సృజియింపంబడియె? నావిశ్వం బెవ్వనిచే ధరియింప
బడియె? వేదంబుల తాత్పర్యం బెట్టిది? బంధం బన నెటువంటిది?
మోక్షం బన నెటువంటిది? శ్రోత, మంత దష్టవక్తయు నన నెవ్వండు?
జనకుం డెవ్వండు? సర్వగతమై నిత్యమైన యానంద మేల కనిపించ
దని గహనాంతమైన బ్రహ్మమునున్న సద్వృద్ధుల మఱియు మఱియు
నడుగుచు నన్నియెడలఁ బ్రభుండు ప్రకటంబుగాఁ దోఁచ, స్వప్న
దశయందు మనంబు హరియందు నిలిపి రమింపవలయు; తానే యతని
నన్వయించి పశు వభ్యస్తగృహంబునకుం బోయినయట్లు చనవలయు;
సత్పథవర్తులైన వారికి హరి ప్రసన్నుండగు; విమలజ్ఞానపురస్సరంబై
దుర్లభంబైన నిజపదంబు హరి కృప సేయునంత, దుర్గమయోగ
తంత్రంబునం జరించువారికిఁ దత్త్వంబు బుద్ధిక్రమంబునం బొడము.