పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/677

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నాద్యబ్రహ్మానందంబు సవ్యం బతాపమిశ్రంబు సర్వజనసాధారణంబు
గలదు; తదర్శనంబు మోక్షప్రదంబు; అక్లేశప్రాప్యంబైన
యీమహాసుఖంబు విడిచి యెవ్వం డన్యసుఖంబుఁ గోరు? రాజ్య
వైభవంబు విడిచి భిక్షాశనంబు సేయుట సుసాధనంబైనం బ్రహ్మ
సుఖంబు గలుగు; విషయాసక్తుండైనవాఁడు జాత్యంధుండు; బుధులు
తనుఁ జూచి దుఃఖించిన భవంబునందే విహరింతు రెట్లు? భవంబు
దుఃఖమయంబుగా నెఱింగి హరిభజనంబుఁ గావించుడు. తద్భజనంబున
నపరోక్షంబైన సంస్కారఫలంబు మీకు లభించు. మఱియు.

176


చ.

వెలయు నసారఘోరభవవృక్షమునందు రమాధవార్చనా
ఫలము జనించె నొక్కటి; ప్రపన్నసుసాధ్యము తత్ఫలంబు; ని
వ్వలఁ దను వెత్తకుండిన నవశ్యము గల్గదు దేహ మేఁగినన్
గలుగునె లింగదేహ మటు గాంచిన జీవులకుం బ్రసిద్ధిగన్.

177


క.

ఇది యెఱిఁగి బాహ్యసుఖసం
పద గల జనుఁ డచ్యుతాంఘ్రిభజనము సేయన్
దుది ముట్టి జన్మఫల మా
పద లుడుపుం గాకయున్నఁ బతితుం డరయన్.

178


శా.

సంసారంబున నుండియే హరిపదాబ్జాతంబు లర్చించి త
త్సంసారంబు నధోగతిం జరపునే తావత్ప్రసంగంబునన్
సంసిద్ధం బగుఁగాక మీకు జను లెంచంగాఁ గృతఘ్నత్వ మా
సంసారం బిపు డాక్రమించునె ప్రశస్తంబైన నీధామమున్.

179


క.

అని యెఱిఁగి మానసాబ్జం
బున నీశ్వరు శంఖచక్రభూరిగదాశో
భనబాహు భక్తియోగం
బునఁ గొల్వఁగవలయుఁ గామములు విడిచి జనుల్.

180


తే. గీ.

సర్వభూతంబులందున, శక్తి గలుగ
వారిపై మైత్రి నిలుపఁగావలయు; రోష
కామములమీఁద రోషంబు గలుగవలయుఁ
గనవలయు శత్రులని రోషకామములను.

181