పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/666

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రమింపుము; బ్రహ్మానుభవంబు శ్లాఘ్యంబు గాదని యెప్పుడు
మదిం దలంపవు; మృగయాద్యూతగీతరసానుభవంబు చేసి వివేక
శిక్షాగురువులముందర మున్ను పల్కినయట్లు పల్కనేరవు;
మద్భుజాబలగతభౌమదివ్యవిషయంబు లనుభవింపుము; [1]నిధానం
బుపై నధిష్ఠించి దైన్యంబు చెప్పుకొననేల? అటు పల్కెద వే నిచ్చిన
సుఖంబు విడిచి యుపేంద్రునివలన నేమి యనుభవించెదవు?
నాయాజ్ఞ శిరంబునం దాల్చిన దేవేంద్రునిం జూడవే? యని హిరణ్య
కశిపుండు పల్కినఁ దన్మంత్రులు “రాజపుత్ర యీమహారాజు
ననుగ్రహంబు మాకుం గలుగ మమ్ము నాశీర్వదింపు"డని ప్రార్థింపు
దురు. చంద్రుండు భూషాకాలంబుల వేగంబె దర్పణంబై యుండక
విళంబంబు చేసినఁ గళల మొత్తించు, వరుణుండు స్వాదుసితమధురం
బులగు జలంబుఁ గలశంబున నిడుకొని పానార్ధంబుగా వెనువెంటం
దిరుగు; దూరస్థకృత్యంబునకు ననిలంబు దూతం జేసిన సదా
తిరుగుచు సదాగతి యన్నపేరు సార్థంబుగాఁ జేసికొనియె; ఇటువంటి
యేకవీరుండైన దైత్యరాజునకుం బుత్రుండవై పుట్టి క్షీణతరులైన
దేవతలలోఁ దాను నొక్కరుండైన విష్ణుని నె ట్లాశ్రయించెదవని పల్కిన.

125

ప్రహ్లాదుఁడు హరిస్మరణమహిమను గొనియాడుట

క.

ప్రచురవిశృంఖలమతులగు
సచివులుఁ దండ్రియును బల్కు జడవాక్యంబుల్
రుచియించక నిజధర్మ
ప్రచయమునకు నప్పుడంతరాయంబైనన్.

126


క.

వారిఁ గని మీకు సరిగా
భూరిగతిం బలుక బుద్ధి వొడమదు; నే ని
టూరక యున్న ననాదర
మేరీతిఁ దరింతు మీర లెఱుఁగరె? జాణల్.

127


క.

సర్వగతుఁడైన మాధవు
నిర్వాణప్రభుఁ దలంచి నిలిచినచో నా
గీర్వాణులు చేసిన యం
తర్విఘ్నములు గురుజనులు దప్పింతు రిలన్.

128
  1. నిధానంబవై యధిష్టించి