పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిపదం బెఱుంగక యహోరాత్రంబు స్వోదరపూరకులై పరులు వర్తింపుదురు. (నార. 174. పు. 131. వ). అని వామాచారపరమైన శ్మశానపూజలను గురించి పేర్కొన్నాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ని విషప్రయోగాదులతో బాధించినపుడు రాక్షసబ్రాహ్మణులు అనేక అభిచారక్రియలు చేసినట్లుకూడా వర్ణించాడు. చివరికి దైత్యయాజ్ఞికులైన మాంత్రికులు పాపకోదితమైన కృత్తికను సైతం ప్రహ్లాదునిమీద ప్రయోగించినట్లు నరసింహకవి వర్ణించాడు. (చూ. నార. 483. పు. మొదలు. 494. పు. వరకు.) శ్రీకృష్ణ బాణాసుర యుద్ధసమయంలో హరుడు త్రిశిరఘోరమూర్తియైన ఉగ్రజ్వరాన్ని కల్పించగా దాని నతిశీతలజ్వరాన్ని కల్పించడంతో హరి హరించాడని నరసింహకవి పేర్కొన్నాడు. (నార. 63. పు. 369. వ). ఈ సందర్భంలో జ్వరీకరణమహామంత్రప్రయోగాన్ని, దానికి విరుగుడుగా నిలువగలిగిన శీతలీమంత్రప్రయోగాన్ని నరసింహకవి విస్పష్టపరచాడు.

బ్రాహ్మణవృత్తాంతవర్ణనాసందర్భంగా శాకలాపురంలో దురాచారుడైన బ్రాహ్మణునికి లభ్యమైన వేశ్యాకాంత అనేక వశ్యమోహకాలైన ఔషధాలు ప్రయోగించి అతని భార్యనుంచి అతని మనస్సును విరిచి వశ్యంచేసుకొన్నట్లు పేర్కొనడం జరిగింది (నార. 242. పు. 260. ప.). మోహినీరాజుల సంభాషణసందర్భంగా "తద్వశీకరణౌషధాంతరములడుగ" (నార. 230. పు. 203. ప.) అని వశీకరణ ఔషధాలవిషయం పేర్కొన్నాడు. అయితే ఒక యోగిని యిచ్చిన వశీకరణ ఔషధాలను ఉపయోగించిన విధాన్ని పేర్కొని యిటువంటి వశీకరణౌషధప్రయోగాలవల్ల వివిధరోగాలు సంభవిస్తాయంటూ "ఈ చూర్ణంబు క్షీరంబులతోఁ గూర్చి భర్తకుఁ ద్రావించిన, వాఁడు నీ దాసుండగు నీ రక్ష నీవు గళంబునం దాల్చిన నిఖిలవశీకారం బగునని నియోగించిన నేను నట్ల కావించితి. తన్మహిమచే భర్త దినదినంబును గృశియించి ముఖంబున వ్రణంబులు పుట్టి తద్వ్రణంబులం గ్రిమిసహస్రంబులు వొడిమ నస్థిచర్మావశిష్టుండై యుండి నన్నుం బిలిచి నీ దాసుండనైతి నన్యగృహంబుల కేఁగ నన్నుం గటాక్షింపవే యనిన నేను దద్యోగిని విన్నవించిన యుపశమనౌషధంబు దెచ్చిఁ స్వస్థునిఁ జేసితి నంత." (నార. 231. పు. 205. వ.) అని నరసింహకవి వివరించి యీ దుష్టౌషధాలకు విరుగుడుగా పనిచేయగల సదౌషధాలుకూడా వుంటాయన్న సంగతిని మంత్ర, తంత్ర, వైద్యశాస్త్రాలరీత్యా సూచించాడు.

రుక్మాంగదచరిత్ర విశేషాలు

రుక్మాంగదుడు విష్ణుభక్తులలో చాలా గొప్పవాడు. పెక్కురాజ్యాలనుజయించినవాడు. అనేకమంది భార్యలతో సుఖభోగలాలసుడైనవాడు.