పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంత్ర శాస్త్రాది విశేషాలు

"క్షరం ప్రథాన మమృతాక్షరమ్" (నార. 325. పు. 29. వ.) అని ఉపనిషద్వాక్యం పేర్కొన్నట్లు ధ్వన్యాత్మకాలు, శబ్దాత్మకాలయిన వర్ణాలన్నింటిని మనం మామూలుగా అక్షరాలంటున్నాం కాని అది యథార్థం కాదు. 'అకారాదిక్షకారాంతాః వర్ణాః' అన్న వాక్యం ప్రకారం అక్షరశబ్ద మన్నది యేర్పడిందని కొంద రంటారు కాని అది కూడా యథార్థం కాదు. వర్ణాలన్నీ అక్షరాలు కావు. క్షరాలు, అక్షరాలని ఆర్షవిజ్ఞానం దృష్ట్యా వర్ణాలు ద్వివిధాలు. అమృతసిద్ధి కలిగించేవి మాత్రమే సార్థకమైన అక్షరాలు. తద్భిన్నాలైనవన్నీ నామమాత్రపు అక్షరాలైన క్షరాలు. అయితే అమృతబీజాలు కానటువంటి అక్షరాలు శక్తిరహితాలని చెప్పడానికి బొత్తిగా అవకాశంలేదు. క్షరంకాని, అక్షరంకాని యే వర్ణమైనాసరే శక్తివంతమైనదే. ధ్వన్యాత్మకమైన శబ్దం శక్తివంతం కాగా, అదే ధ్వన్యాత్మకమైన నిశ్శబ్దశక్తి మహాశక్తివంతమైనది. కాగా, వివిధశబ్దాత్మకాలైన విభిన్నమంత్రాలకు, విభిన్నశక్తు లున్నా యన్నమాట యథార్థం. ఏ మంత్రసిద్ధిలోనైనా, మానసికజపం మహాశక్తివంతమైందన్న ఆర్షవిజ్ఞానదృష్టి, ఆధునికవైజ్ఞానికదృక్పథంలోకూడా సత్యసమ్మతమైనదే. అనంతమంత్రాలతో, అపూర్వశక్తుల కాలవాలాలైన, వేదాలను ప్రతిబింబించిన పురాణాలలో వివిధమంత్రశక్తుల ప్రసక్తు లుండడం అబ్బురం కాదు. విష్ణు, బ్రహ్మ, మహేశ్వరాది దేవతలందరికి విభిన్నరాక్షసులెల్లరకూ, ఉన్న ఆయుధాలన్నీబహుళమంత్రశక్తిసంభరితాలే. నరసింహకవి రత్నావళి వృత్తాంతసందర్భంలో "రాక్షసి నిజమందిరంబునంగల సకలధనంబులు సంగ్రహించుకొని ఖరేణురూపంబున బ్రాహ్మణునిం బై నిడుకొని రాజపుత్రియైన రత్నావళి నదృశ్యకరణశక్తిం దోడుకొని తృతీయముహూర్తంబున శంకరాలయమున కరుదెంచి, కాశీపురంబు చూపి యిది పాపతరుకుఠారంబు" (నార. 294. పు. 144. వ). అని రాక్షసివల్ల 'ఖరేణురూప అదృశ్యకరణశక్తి' మంత్రప్రయోగాలను చూపించాడు. ఇదేవిధంగా కాశిరాజు పుత్రికను కౌండిన్యున కిచ్చి వివాహం జరిపించిన సందర్భంలో రాక్షసి కరణిరూపం ధరించి రత్నావళిని నిజపురానికి తోడ్కొనివచ్చిన సందర్భంగాను, వివిధ మంత్ర, తంత్ర విద్యల ప్రభావాలను చూపించినట్లు పేర్కొన్నాడు. అయితే మంత్రోపాసనలో, సన్మంత్రోపాసనలు, దుర్మంత్రోపాసనలు, యెప్పుడూ వుండనే వుంటాయి. నరసింహకవి కలియుగధర్మాలను వివరించే సందర్భంలో "ద్విజాధములు నారాయణు వర్జించి దేవాంతరసేవకులై యుంద్రు. దుష్టద్రవ్యంబుచేత దుర్గారాధనక్రియలు హరిబాహ్యులగు నృపద్విజులు ప్రాణిహింసచేఁ గావింపుదురు. శ్మశానదేవతార్చనంబు శ్రేయస్కరంబని యొనరింపుదురు.