పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కౌశిక, కాశ్యప, ఔర్యులు అనే మహర్షులు - దక్షసావర్ణికమన్వంతరంలో మేధాతిథి, వసువు, సత్యుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, సవనుడు, హవ్యవాహనుడు అనే మహర్షులు - బ్రహ్మసావర్ణికమన్వంతరంలో రామ, వ్యాస, ఆత్రేయ, దీప్తిమంత, బహుశ్రుత, భరద్వాజ, ద్రౌణి (అశ్వత్ధామ), అనేమహర్షులు ఉన్నారు. ఇదేవిధంగా ధర్మసావర్ణిక, రౌచ్య, భౌచ్యమన్వంతరాలలో విభిన్నులైన సప్తర్షులు ఉన్నట్లు ప్రాచీనగ్రంథాలు పేర్కొన్నాయి. ధర్మ, సూర్యసావర్ణికమన్వంతరాలలో ఒకదానికి మారుగా మేరుసావర్ణికమన్వంతరాన్ని కొందరు పరిగ్రహించారు. కాగా వివిధమన్వంతరాలలో విభిన్నసప్తఋషిమండలాలు ఉన్నట్లు మనకు తేటతెల్ల మవుతున్నది.

మన్వంతరాలలో విభిన్నులైన సప్తమహర్షులకు స్థానం వున్నట్లుగానే మనువులకుకూడా ఆ స్థానం శాశ్వతంకాదనీ తెలుస్తున్నది. అంటే వైవస్వతమన్వంతర మన్నది వొకటున్నదిగదా! ఆ మనుస్థానంనుంచి వైవస్వతుణ్ని తప్పించి సమర్హుడైన మరొకవ్యక్తి ఆ స్థానాన్ని పొందవచ్చు నన్నమాట. గృహగోధి మోహినుల సంభాషణాసందర్భంలో "అట్లు గావునఁ దత్ఫలంబు నాకు నొసంగి ధర్మమూర్తీ! వైవస్వతపదధ్వంసీ! పాలించవే యని గృహగోధి పల్కిన విని మోహిని యిట్లనియె." (నార. 233. పు. 213. ప.) అని నరసింహకవి పేర్కొనడంద్వారా వైవస్వతాదిమనుపదాలకు కాదు, మనుపదస్థులైన వైవస్వతాది మహర్షులకు సైతం విభ్రష్టత్వం తప్పదని తెలియజేశాడు.

ఇదేవిధంగా కుబేరు డొక డున్నాడని అనేకగ్రంథాలద్వారా సుప్రసిద్ధమైన విషయం. కాని సప్తఋషులవలెనే కుబేరత్వానికిసైతం మార్పు వున్నదని నారదీయపురాణంవల్ల తెలుస్తున్నది. సప్తఋషులు మన్వంతరాలలో మారగా కుబేరుడు కల్పాంతంలో మారుతాడని నారదీయపురాణం పేర్కొంటున్నది. కల్యాణతీర్థమహిమావర్ణనలో నరసింహకవి "కల్యాణతీర్థతీరంబున ధనం బొకనికిం జాలున ట్లొసంగినఁ గల్పాంతరంబునఁ గుబేరుండై జనించు" (నార. 184, 185 పు. 178 . వ.) అని పేర్కొనడంద్వారా కుబేరత్వంసైతం శాశ్వతం కాదని తేటతెల్లం చేశాడు. అసలు నరసింహకవి పేర్కొనని ఆర్షవిజ్ఞానరహస్యం మరొకటి వున్నది. కుబేరుడు వొక్కడే ధనవంతుడుకాడు. దౌర్జన్యంతో రాక్షసులనే కాక వివిధచక్రవర్తుల నందరిని సైతం వోడించి ధనరాసులను నిలువ చేసుకున్నవాడు "కుబేరుడు". నిజానికి ఆర్షవిజ్ఞానందృష్ట్యా కుబేరుడంటే "దుర్ధనవంతు డ"ని అర్థం. ఈ దృష్ట్యానే సద్ధర్మపథంలో సవ్యంగా మహత్తరమైన సంపదను ప్రోది చేసినవాడు కుబేరుడు కాడు. సుబేరు డనబడుతాడు. ఆర్షవిజ్ఞానం అడుగంటినకారణంగా యీ కుబేర, సుబేర విభిన్నత్వాన్ని ప్రాచీను లెవరూ గుర్తించలేదు.